- ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్
హైదరాబాద్, వెలుగు: టీజీబీపాస్ (తెలంగాణ స్టేట్ బిల్డింగ్ పర్మిషన్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ వెరిఫికేషన్ సిస్టమ్) అప్లికేషన్లను వేగవంతంగా పరిష్కరించాలని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ ఆదేశించారు. పరిష్కరించిన అప్లికేషన్లను వెంటనే ఆయా విభాగాలకు పంపాలన్నారు. టీజీబీపాస్ అప్లికేషన్ల పరిష్కారం పై గురువారం సెక్రటేరియెట్ లో ప్లానింగ్ అధికారులతో రివ్యూ చేపట్టారు.
అప్లికేషన్లలో జత చేయాల్సిన డాక్యుమెంట్ లు ఏవైనా తక్కువగా ఉంటే ఆ విషయాన్ని దరఖాస్తుదారుడికి తెలియజేయాలని.. తిరిగి అన్ని డాక్యుమెంట్ లతో దరఖాస్తు చేసుకునేలా చూడాలని దానకిషోర్ అధికారులకు స్పష్టం చేశారు.
ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు టీజీ బీపాస్ కింద హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీలో అప్లికేషన్ల ప్రోగ్రెస్ పై రిపోర్ట్ ఇవ్వాలని ఆయన ఆదేశించారు. ఇప్పటి నుంచి ప్రతి శనివారం టీజీబీపాస్ అప్లికేషన్లపై రివ్యూ చేస్తామన్నారు. ఈ సమావేశంలో డీటీసీవో దేవేందర్ రెడ్డి, హెచ్ఎండీఏ ప్లానింగ్ డైరెక్టర్లు విద్యాధర్, రాజేంద్ర ప్రసాద్ నాయక్, జీహెచ్ఎంసీ సిటీ చీఫ్ ప్లానర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.