జైళ్లలో సౌలత్​లేవి?

జైళ్లలో సౌలత్​లేవి?

తోషఖానా అనేది పాలకులకు, అధికారులకు ఇచ్చిన బహుమతులను నిల్వచేసే ప్రభుత్వ శాఖ. దేశాధినేతల నుంచి వందల మిలియన్ల రూపాయల విలువైన బహుమతులను అక్రమంగా విక్రయించారని, అవినీతికి పాల్పడ్డారని పాకిస్తాన్ మాజీ ప్రధాని మీద ఆరోపణలు వచ్చాయి. అది కేసుగా మారి ‘తోషఖానా కేసు’గా ప్రసిద్ధి చెందింది. ఈ కేసులో సెషన్స్​కోర్టు తన తీర్పును ఈ మధ్య ప్రకటిస్తూ.. ఇమ్రాన్​ఖాన్​కు మూడేండ్ల జైలు శిక్ష విధించింది. అవినీతి విధానాలకు పాల్పడినందుకు గాను, రాజకీయాల నుంచి కూడా దూరంగా ఉండాలని చెబుతూ కోర్టు అనర్హత వేసింది. కోర్టు తీర్పు ప్రకటించిన తర్వాత ఇమ్రాన్​ఖాన్​ను ఇటీవల లాహోర్​లోని అతని ఇంటి నుంచి పోలీసులు అరెస్ట్​చేసి తీసుకువెళ్లారు. 

ఇమ్రాన్​ఖాన్​అనర్హత ఐదు సంవత్సరాలు. గత అక్టోబర్​లో సౌదీ యువరాజు మహమ్మద్​బిన్​సల్మాన్​ఇచ్చిన పురాతన వాచ్​సహా ఖాన్​అనేక విలువైన బహుమతులను కొనుగోలు చేసి వాటిని ప్రకటించిన లాభాల కోసం విక్రయించినట్లు వచ్చిన ఆరోపణలపై పాకిస్తాన్​ ఎన్నికల సంఘం దర్యాప్తు ప్రారంభించింది. ఆ తర్వాత కేసు నమోదైంది. బహుమతుల వివరాలను ఉద్దేశపూర్వకంగా తప్పుగా ఇచ్చారని కోర్టు అభిప్రాయపడింది. ఆయన అలా చేసినందుకు కోర్టు చివరకు దోషిగా గుర్తించింది. 

150కి పైగా కేసులు..

ఇమ్రాన్​ఖాన్​ ఆ ఆరోపణలను ఖండించాడు. అతని తరఫు న్యాయవాది ఇంతేజార్​హుస్సేన్​ పంజోతా మాట్లాడుతూ.. ఈ తీర్పుపై తాము అప్పీలు చేస్తామని, ఇమ్రాన్​ఖాన్​ను రాజకీయ బలిపశువును చేశారని అన్నాడు. ఇమ్రాన్​ఖాన్​తన కేసును సమర్థవంతంగా కోర్టులో ఎదుర్కొనేందుకు అవకాశం ఇవ్వలేదని, న్యాయమైన విచారణ జరపలేదనేది ఆయన వాదన. కాగా ఈ వాదనలను సమాచార మంత్రి ఔరంగజైబ్​తిప్పకొట్టారు. ఆ తీర్పుతో కానీ, అతని అరెస్టుతో కానీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని మంత్రి నొక్కి చెప్పారు. ఖాన్​కు కోర్టు ఉచితమైన, న్యాయమైన విచారణకు అవకాశం కల్పించిందని, కేసు విచారణ ఒక సంవత్సరం పాటు కొనసాగిందని, 40 కంటే ఎక్కువ సార్లు విచారణ జరిగినా ఖాన్​ మూడు సార్లు మాత్రమే కోర్టు ముందు హాజరయ్యారని కూడా ఆయన చెప్పాడు. ఈ తీర్పుతో వచ్చే పాకిస్తాన్​ సార్వత్రిక ఎన్నికల్లో ఇమ్రాన్​ఖాన్ ​పోటీ చేసే అవకాశాలు సన్నగిల్లాయి. ఇమ్రాన్​ఖాన్​ దాదాపు150 కేసులు ఎదుర్కొంటున్నాడు.

అవిశ్వాస తీర్మానంలో ఓడి..

దశాబ్దాలుగా పాకిస్తాన్​ రాజకీయాలపై సైన్యానికి పట్టు ఉంది. సైన్యం మద్దతుతోనే ఇమ్రాన్​ఖాన్​ 2018లో ఎన్నికయ్యారు. అయితే వారి మద్దతును కోల్పోయిన తర్వాత గత ఏడాది అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్ అధికారం కోల్పోయాడు. సైన్యంతో అతని సంబంధాలు దెబ్బతిన్న తర్వాత అరెస్ట్ ​కావడం గత మూడు నెలల్లో ఇది రెండోసారి. తనపై హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయని అతను సైన్యం మీద ఆరోపణలు చేశాడు. దేశంలో ఉన్నతాధికారులకు వ్యతిరేకంగా ఇమ్రాన్​ఖాన్​బహిరంగ ప్రచారాన్ని ఉధృతం చేశాడు. గత మే నెలలో ఇస్లామాబాద్ ​హైకోర్టులో హాజరు కావడానికి ఇమ్రాన్​ఖాన్​ వచ్చినప్పుడు దాదాపు100 మంది పారామిలిటరీ దళాలు అతని అరెస్టులో పాల్గొన్నాయి. అతనితోపాటు ఆయన రాజకీయ పార్టీకి చెందిన చాలా మందిని కూడా అరెస్ట్​చేశారు. అరెస్ట్​అయ్యే సమయంలో ఇమ్రాన్​ఖాన్​ ఓ సందేశం విడుదల చేశాడు. ‘‘ఈ సందేశం మీకు చేరేటప్పటికి నేను అరెస్ట్​అవుతాను. జైలులో ఉంటాను. మీరు ఇండ్లల్లో దాక్కోకండి. శాంతియుత నిరసనలు కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు చేసే ఉద్యమం నా కోసం కాదు. మీ కోసం, మీ పిల్లల కోసం, వారి భవిష్యత్​కోసం. మీ హక్కుల కోసం మీరు పోరాటం కొనసాగించకపోతే మీరు బానిసలుగా జీవిస్తారు” అని ఇమ్రాన్ ​పేర్కొన్నాడు. 

విపరీతమైన రద్దీ..

కరడు గట్టిన నేరస్తులు ఉన్న జైలులో కూడా మౌలిక సదుపాయాలు ఉండాలి. కనీస సౌకర్యాలు ఉండాలి. జైళ్లల్లో ఖైదీల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నది. మరీ ముఖ్యంగా విచారణలో ఉన్న ఖైదీల సంఖ్య పెరిగిపోయింది. ఈ సమస్య గురించి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆ మధ్య ఆందోళన వ్యక్త పరిచారు. జైళ్లలో అధిక రద్దీ మాత్రమే కాదు జైళ్లలో అవినీతి కూడా ఆందోళన కలిగిస్తున్నది. జైళ్లలో రద్దీ మూలంగా అనారోగ్యకరమైన పరిస్థితులు నెలకొంటాయి. దాని వల్ల ఖైదీల్లో అసంతృప్త జీవన పరిస్థితులు ఏర్పడతాయి. కొంత మందికి ప్రత్యేక వసతులు కల్పించడం లాంటివి మిగతా ఖైదీలకు కష్టం కలిగిస్తాయి. ఈ రోజు ఇమ్రాన్​ఖాన్​ఎదుర్కొంటున్న పరిస్థితి రేపు మరో నాయకుడు కూడా ఎదుర్కోవచ్చు. అందుకని జైళ్ల పరిస్థితుల గురించి అధికారంలో ఉన్నప్పుడే ఆలోచించాలి. ఇది ఒక్క ఆ దేశానికే కాదు.. అన్ని దేశాలకూ వర్తిస్తుంది.

అన్ని దేశాల్లోనూ అదే స్థితి..

తోషఖానా కేసులో తీర్పు వెలువడగానే ఇమ్రాన్​ఖాన్​ను అరెస్ట్ ​చేసిన పోలీసులు అతడిని పంజాబ్​ రాష్ట్రం​ అటాక్​సిటీలో ఉన్న అటాక్​ జైలుకు తరలించారు. నిజానికి ఇమ్రాన్​ఖాన్​ను రావల్​పిండిలోని అడియాలో జైలులో ఉంచాలని కోర్టు ఆదేశించింది. కానీ అతడిని అటాక్ ​జైలులో నిర్బంధించారు. తనను ‘సి’ క్లాస్ ​జైలులో ఉంచారని అక్కడి పరిస్థితులు బాగా లేవని ఇమ్రాన్​ఖాన్, అతని న్యాయవాదులు అంటున్నారు. ఇమ్రాన్​న్యాయవాది ఇస్లామాబాద్ ​హైకోర్టులో పిటిషన్​దాఖలు చేసి ఇమ్రాన్​ఖాన్​ను ‘ఏ’ క్లాస్​సౌకర్యాలు ఉన్న జైలుకు తరలించాలని కోరాడు. కుటుంబ సభ్యులు, న్యాయవాదులు, ఫిజీషియన్లు అతడిని కలిసే అవకాశం కల్పించాలని ఆ దరఖాస్తులో కోరాడు.

అది రాజ్యాంగ పరమైన హక్కు అని అతను ఆ దరఖాస్తులో పేర్కొన్నాడు. చిన్నతనం నుంచి అతను ఉన్నత కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అని, ఖాన్​రాజకీయ హోదా వగైరాలన్నింటినీ పరిగణించి మంచి సౌకర్యాలు ఉన్న జైలుకు పంపించాలని కోరాడు. ఓడలు బండ్లు కావడం, బండ్లు ఓడల కావడం మామూలే. అధికారంలో ఉన్నప్పుడు ఎవరూ జైళ్ల స్థితిగతుల గురించి మాట్లాడరు. వాటి గురించి పట్టించుకోరు. తాము జైలుకు వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడినప్పుడు వీటి గురించి మాట్లాడతారు. పాకిస్తాన్​లోనే కాదు.. మన దేశంలోనూ ఇదే పరిస్థితి.

-  డా. మంగారి రాజేందర్, జిల్లా​ జడ్జి(రిటైర్డ్)