ప్రైవేటు బడి.. దోపిడీ!

ప్రైవేటు బడి.. దోపిడీ!

ప్రస్తుత జనరేషన్ తల్లిదండ్రులు తమ పిల్లలకు మెరుగైన చదువులు అందించాలనే లక్ష్యంతో బతుకుతున్నారు.  కడు బీదవాడైనా సరే తమ పిల్లలకు నాణ్యమైన చదువులందించేందుకు కడుపు మాడ్చుకొని, అప్పులు చేస్తున్నారు. నాణ్యమైన చదువుల కోసం ప్రైవేట్ స్కూళ్ల బాట పడుతున్నారు. ఇందుకు కారణం ప్రభుత్వ పాఠశాలల్లో  ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇంతకుముందు కాలంలోలాగ  విద్య బోధించకపోవడమేనని అత్యధిక శాతం ప్రజలు నమ్ముతున్నారు.  ప్రభుత్వ పాఠశాలల్లో  మెరుగైన రీతిలో ఇంగ్లీష్ మీడియం బోధన అందు బాటులో లేకపోవడం,  సిబ్బంది కొరత,  సరైన మౌలిక వసతుల లేమి కూడా  ప్రభుత్వ పాఠశాలల  మనుగడకు  శాపాలుగా మారుతున్నాయి.  అయితే, ఈ పరిస్థితులనే  అదనుగా చేసుకొని  అత్యధికశాతం  ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అధిక ఫీజులతోపాటు  పుస్తకాలు, యూనిఫాం, టై, బెల్టు, ఇతరత్రా రూపంలో అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వ నిబంధనలు ఉన్నట్టా?  లేనట్టా? 

ప్రభుత్వ నిబంధనలు కాగితాలకే పరిమితం

ప్రైవేటు విద్యా వ్యవస్థపై ప్రభుత్వ నియంత్రణ లేదా అంటే ఉంది. అది జీవోల రూపంలో  కాగితాలకే పరిమితమై ఉంది. 1980వ  దశకంలోనే నాటిప్రభుత్వాలు జీవోలను విడుదల చేశాయి. కానీ, అమలు సంగతేంటి? అని మాత్రం అడగొద్దు!  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌లో ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982,  క్యాపిటేషన్ యాక్ట్ 1983,  1987లో  వచ్చిన  జీవో నెంబర్ 246 ద్వారా ప్రైవేటు విద్యా సంస్థలు ఫీజులు పెంచాలంటే తల్లిదండ్రులు, టీచర్స్ అసోసియేషన్ వారితో తప్పక సంప్రదించాలి.  వారి అనుమతి తప్పనిసరి.  కానీ,  ఫీజులు పెంచే క్రమంలో ఏ ప్రైవేటు విద్యా సంస్థ కూడా ఈ ప్రక్రియ పాటించిన దాఖలాలు కనిపించడం లేదు. 

246 జీవో అమలు ఏది?

1994లో  జీవో నెంబర్ 1 విడుదల అయింది. 246 జీవో ప్రకారం  ప్రైవేటు స్కూళ్ల నిర్వహణలో 5 శాతం కన్నా ఎక్కువ లాభాలు ఆశించకూడదు. అలాగే, ఆర్జించిన రాబడిలో 50 శాతం టీచర్ల  జీతభత్యాలకు వెచ్చించాలి. 15 శాతం స్కూల్  నిర్వహణ, మౌలిక వసతులకు వినియోగించాలి. 15 శాతం  బోధనేతర సిబ్బంది జీతభత్యాలకు వెచ్చించాలి. అయితే, ఈ నియమ, నిబంధనలు పాటించే ఒక్క ప్రైవేటు పాఠశాలనైనా చూడగలమా?  విద్యా హక్కు చట్టం 12(1) ప్రకారం ప్రైవేట్,  కార్పొరేట్ స్కూళ్లలో 25% పేదలకు చెందిన పిల్లలకు ఉచితంగా విద్యను అందించాలని రాజ్యాంగంలో  ఉంది.  కానీ అమలు ఏది?

లవ్ అగర్వాల్ కమిటీ చేసిన ప్రతిపాదనలు..

కాషన్ డిపాజిట్ రూ.5వేలు మించరాదని, అర్బన్ ఏరియాలో ఉన్న ప్రైవేటు స్కూళ్లలో ఎంత హైటెక్ హంగులతో ఉన్న స్కూల్ అయినా కూడా ఐదవ తరగతి ఫీజు రూ. 24వేలు, 10వ తరగతి వరకు రూ. 30వేలు మించరాదని కమిటీ స్పష్టం చేసింది. అలాగే రూరల్ ఏరియాలో 10వ తరగతి వరకు రూ. 15 వేలు మించరాదని స్పష్టంగా తన నివేదిక ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అదికూడా ఆయా స్కూళ్ల ఖర్చుల ఆధారంగా ఫీజులను నిర్ధారించాలని కమిటీ సూచించింది. జిల్లా స్థాయి ఫీజు నియం త్రణ కమిటీ (డిఎఫ్ఆర్సీ)ని ఏర్పాటు చేయాలని సూచించింది.  అంతేకాకుండా ప్రైవేటు స్కూళ్లకు ఫ్యాన్సీ పేర్లు అంటే.. టెక్నో, హైటెక్, మోడరన్, స్మార్ట్, తదితర పేర్లు పెట్టకూడదని చెప్పింది. 

ప్రైవేట్​ స్కూళ్ల ఫీజుల నియంత్రణ అధికారం
 రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందన్న  హైకోర్టు

లవ్ అగర్వాల్ కమిటీ చేసిన ప్రతిపాదనలు స్వీకరించిన ప్రభుత్వం జీవో నెంబర్ 91ను జారీ చేసింది. జీవో 91 ఉత్తర్వులు విడుదలైన నెల రోజులకే ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. ప్రైవేటు స్కూళ్ల ఫీజులను రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రించలేవని, సీబీఎస్సీ సిలబస్‌‌తో బోధించే స్కూళ్ల ఫీజులను రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రించలేవని, 1983లో వచ్చిన జీవో ప్రకారం ఇది సమంజసం కాదని వాదించాయి.  వాదనలు విన్న హైకోర్టు..  ప్రైవేటు స్కూళ్ల ఫీజులను నియంత్రించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని తెలిపింది.  కానీ, జిల్లా స్థాయి ఫీజు నియంత్రణ కమిటీ (డిఎఫ్ఆర్సీ) సిఫారసులు ప్రైవేటు స్కూల్ ఫీజులను నియంత్రించలేవని డిఎఫ్ఆర్సీని కొట్టివేసింది. తద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు స్కూళ్ల ఫీజుల అంశంపై సుప్రీంకోర్టులో  లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఇలా కేసులపై కేసులతో వ్యవహారం ఎప్పుడు కొలిక్కివస్తుందో తెలియని పరిస్థితి. .

ప్రైవేటు స్కూళ్ల వ్యవహారంపై ప్రభుత్వాల విధానాలేంటి?

తెలంగాణా ప్రభుత్వం ప్రైవేటు స్కూళ్ల  ఫీజుల వ్యవహారంపై పేరెంట్స్ అసోసియేషన్,  స్కూల్ యాజమాన్యాలవారితో  సంప్రదించి తగుచర్యలు తీసుకోవాలి. ఉస్మానియా యూనివర్సిటీ  ప్రొఫెసర్ డా.తిరుపతిరావు కమిటీని ప్రభుత్వం వేసింది.  ఈ కమిటీ  ప్రైవేటు స్కూల్ ఫీజు వసూళ్లు, టీచర్ల జీత భత్యాలను ఆన్​లైన్​లో ఉంచాలని సూచించింది.  గతంలో స్కూల్  ఫీజులపై వెలువడిన జీవోలలో మార్పులు చేర్పులు చేయాలని కమిటీ కోరింది. తద్వారా  ఇప్పటికే ఉన్న జీవో  నెంబర్ 1తో పాటు 1983లో  వెలువడిన అడ్మిషన్లు, క్యాపిటేషన్ ఫీజుల నిషేధ చట్టంలో  అవసరమైన మార్పులను సూచించింది. 1983 చట్టంలోని  సెక్షన్ 7ను సవరించాలని, తదితర అంశాలపై  పేరెంట్స్‌‌కు  సానుకూల  మార్పులను  చేర్పులను చేయడం అత్యవసరంగా ప్రభుత్వానికి సూచించిందని సమాచారం.  అయితే  కమిటీ ప్రతిపాదనలు కానీ, నివేదికను కానీ ప్రభుత్వం అధికారికంగా బహిరంగపర్చకపోవడం గమనార్హం. ఇకనైనా ప్రభుత్వం స్పందించి సామాన్య, పేద ప్రజల పిల్లలకు నాణ్యమైన ఉచిత విద్యను అందించేవిధంగా చర్యలు తీసుకోవాలి. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ఇంగ్లీష్ మాధ్యమంలో బోధనను అమలు చేయాలి. 

  -శ్రీనివాస్ గుండోజు,
        ​జర్నలిస్ట్‌‌