జయశంకర్ సార్ 12 వ వర్ధంతి సందర్భంగా ఈనాటి తెలంగాణలో విద్యావంతుల పాత్ర గురించి మాట్లాడుకోవాలి. విద్యావంతుల పాత్ర గురించి సార్ చెప్పిన విషయాలు అందరికీ తెలిసినవే. విద్యావంతులు సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించాలని జయశంకర్ సార్ అనేక సార్లు వివరించారు. సమాజం సంక్షోభంలో ఉన్నప్పుడు విద్యావంతులు మౌనంగా ఉండటం కన్నా పెద్ద నేరం మరొకటి లేదని సార్ అన్నారు. ప్రజలకు తమ కష్టాలు అర్థమవుతాయి. కానీ తాము ఎదుర్కొంటున్న సమస్యలకు మూలకారణాలు తెలుసుకునే అవకాశం ప్రజలకు లేదు. చదువుకున్నందున విద్యావంతులకు సామాజిక సమస్యలకు మూలకారణాలను వెతికే శక్తి వచ్చింది. విద్యావంతులకు వున్న ఈ శక్తిని సమాజ హితం కోసం ఉపయోగించాలి. చదువుకున్న వాళ్లు, మన దేశంలోనే కాదు మొత్తంగా మూడవ ప్రపంచ దేశాలలో నిర్వర్తించవలసిన పాత్రను సార్ చాలా సూటిగా వివరించారు. సార్ ఆలోచనల వెలుగులో ఇవాళ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిలో విద్యావంతులు తమ కర్తవ్యాలను నిర్ణయించుకోవలసి ఉన్నది.
నేడు రాష్ట్రంలో నిరంకుశ పాలన నెలకొని వున్నది. ఒక వ్యక్తి – ముఖ్యమంత్రి – చేతిలో అన్నీ అధికారాలు కేంద్రీకృతమైనాయి. ఆయన అధికారాలను ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగిస్తాడు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజల కొరకు ఉపయోగించాలి. అందరం కలిసి సమిష్టిగా తయారు చేసుకున్న నియమాల ప్రకారం, సమిష్టిగా ఎంచుకున్న లక్ష్యాల కోసం అధికారాన్ని ఉపయోగించాలన్నది ప్రజాస్వామిక సూత్రం.ఆంధ్రా పాలనలో తెలంగాణా ప్రజలకు భాగస్వామ్యం లేదనే కదా తెలంగాణ తెచ్చుకున్నాం. వచ్చిన రాష్ట్రంలో ప్రజలకు భాగస్వామ్యం కల్పించాలి కదా. కానీ రాష్ట్రాన్ని తెచ్చింది నేనే కాబట్టి, నాకు అన్నీ తెలుసు కాబట్టి తెలంగాణ బాగోగులు నిర్ణయించే అధికారం తనకే ఉండాలని కేసీఆర్ కోరుకున్నాడు.
చైనా, సింగపూర్ మాదిరిగా మన దగ్గర కూడా నిరంకుశ పాలన ఉంటే బాగుండునని అనుకున్నాడు. అయితే ఆ దేశాల్లో ప్రభుత్వాలు సామాజిక, ఆర్థిక సంస్కరణల కోసం చేసిన పనిని ఆమోదించడు. ఈ విచ్చలవిడితనం, నిరంకుశ పోకడలు అంతం కాకుండా తెలంగాణ పురోభివృద్ధి సాధ్యం కాదు. ఇవ్వాళ పాలకులు అధికారాన్ని తమ ప్రయోజనాలను కాపాడు కోవడానికి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇసుక దందాలకు, భూములపై వివాదాల సెటిల్ మెంట్ల కోసం, కాంట్రాక్టులు పొందడానికీ అధికారాన్ని ఉపయోగిస్తున్నారు. చట్టబద్ధ పాలనలో స్వార్థ ప్రయోజనాలకు అధికారాన్ని వాడకూడదు. పాలకులు ప్రజా ప్రయోజనాలకు తూట్లు పొడిచి స్వంత లాభం చూసుకుంటే ప్రజా సంక్షేమం గురించి పట్టించుకునే వారుండరు.
విద్యావంతుల మౌనం ప్రమాదకరం:
విద్యావంతులు ఈ పరిస్థితిలో మౌనంగా ఉండటానికి వీల్లేదు. జయశంకర్ సార్ తెలంగాణ ఏర్పడిన తరువాత తెలంగాణ అభివృద్ధికి మరో పోరాటం అవసరమని అన్నారు. ఆ పోరాటం కష్టంగా ఉంటదని, తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. వారు ఊహించినట్టుగానే నేటి పరిస్థితి ఉన్నది. ప్రస్తుత పరిస్థితిలో విద్యావంతులు ఉద్యమ విలువల ఆధారంగా తమ కర్తవ్యాలను నిర్వచించుకోవాలి. ప్రజాస్వామ్య పరిరక్షణ మనందరి ఉమ్మడి కర్తవ్యమని గుర్తించాలి. పాలకులు ఒక మాఫియాగా మారిపోయి సమష్టి వనరులను కొల్లగొట్టడాన్ని ప్రశ్నించాలి. గ్రామ పంచాయితీలను, మున్సిపాలిటీలను బలహీనం చేస్తున్న పాలకుల వైఖరిని నిలదీయాలి. నిర్బంధాన్ని ప్రయోగించి నిరసన తెలిపే హక్కును కాలరాస్తున్న పాలకుల నిరంకుశ విధానాలను ఎదిరించాలి. నిరుద్యోగ సమస్య పైన స్పందించాలి. రైతుల ఆత్మహత్యల గురించి మాట్లాడాలి. ఇరిగేషన్ ప్రాజెక్టుల అమలులో చోటుచేసుకున్న అవినీతిని ఎత్తి చూపాలి. ప్రజల భూమి హక్కుల పరిరక్షణకై కదలాలి. అడ్డగోలు భూసేకరణను ప్రశ్నించాలి. సింగరేణి, ఆర్ టీసీ, విద్యుత్ సంస్థల పరిరక్షణ కోసం ఉద్యమించాలి.
జవాబుదారిలేని పాలన
ప్రజాస్వామ్యంలో అధికారం ప్రజల చేతుల్లో వుంటది. ఆ అధికారాన్ని పొందిన వారు ప్రజల పట్ల జవాబుదారీతనంతో పనిచేయాలి. చట్టాన్ని వదిలిపెట్టి ఇష్టానుసారంగా అధికారాన్ని ఉపయోగించడం వలన చట్టబద్ధ పాలనకు సాంప్రదాయ పెత్తనానికి, దౌర్జన్యానికి మధ్య తేడా లేకుండా పోతుంది. చివరి రెండు రకాల అధికారాలు – సాంప్రదాయక పెత్తనం కానీ, దౌర్జన్యం కానీ – జవాబుదారీతనం లేకుండా అధికారాన్ని చెలాయించే వారి ఇష్ట ప్రకారం పనిచేస్తాయి. చట్టబద్ధ పాలనలో సమిష్టి ప్రయోజనాల కోసమే అధికారాన్ని ఉపయోగించాలి. లేకపోతే మూడు రకాల అధికారాల మధ్య విభజన రేఖ చెదిరిపోతుంది. అనేక పోరాటాల ఫలితంగా ఏర్పడిన చట్టబద్ధ పాలన బలహీనమై పోయి గుప్పెడు మంది ఇష్టానుసారంగా అధికారాన్ని చెలాయించే పరిస్థితి, పోరాటాల వలన ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో తలెత్తడం దురదృష్టకర పరిణామం. అదికూడా గుప్పెడు మంది కుమ్మక్కై మాఫియా వలె అందరికీ చెందిన వనరులను కొల్లగొట్టడం కోసం అధికారాన్ని ఉపయోగించడం రాష్ట్రంలో ప్రస్తుతం చూస్తున్నాం.
జయశంకర్ సార్ ఆశయాలు సాధిద్దాం
అన్నిటికన్నా మించి బీఆర్ఎస్పాలనలో ఎన్నికల ప్రక్రియ పూర్తిగా పతనమైంది. పైసలు కుమ్మరించి ఓట్లను కొల్లగట్టె పద్దతిని, పైసలతో ప్రతిపక్షాలను బలహీన పరిచే అప్రజాస్వామిక సంస్కృతిని రూపుమాపటానికి ప్రయత్నం చేద్దాం. ఎన్నికలు ప్రజల సమస్యల గురించి మాట్లాడుకోవటానికి ఉపయోగ పడగల వేదికలుగా ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం మనందరి కర్తవ్యం. దానికోసం అందరం కలిసి పూనుకుందాం. ఉద్యమ కాలంలో భావ వ్యాప్తి చేసి, ఆందోళనలు నిర్మించి తెలంగాణ సాధనలో కీలక పాత్ర పోషించిన పౌర సమాజం ఇప్పుడు మౌనంగా ఉండటానికి వీలులేదు. ప్రజాస్వామిక విలువలను పాదుకొల్పి అందరికీ బతుకు దెరువు చూపగల తెలంగాణ నిర్మాణానికి పూనుకుందాం. జయశంకర్ సార్ ఆశయాలను సాధించే ప్రయత్నం చేద్దాం. అదే మనం ఆయనకు ఇవ్వగల నివాళి.
- ఎం. కోదండ రామ్, టీజేఎస్ అధ్యక్షుడు