శాంతి చర్చలు జరగకపోతే బస్తర్ లో ఆదివాసీలు మిగలరు : ప్రొఫెసర్ హరగోపాల్

శాంతి చర్చలు జరగకపోతే బస్తర్ లో ఆదివాసీలు మిగలరు : ప్రొఫెసర్ హరగోపాల్
  • భారత్ బచావో సభలో ప్రొఫెసర్ హరగోపాల్

ముషీరాబాద్, వెలుగు:  చత్తీస్ గఢ్ దండకారణ్యం లో కేంద్ర బలగాలు, మావోయిస్టుల మధ్య జరుగుతున్న యుద్ధంలో ఆదివాసీలే అత్యధికంగా ప్రాణాలు కోల్పోతున్నారని ప్రొఫెసర్ హరగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు.  వెంటనే మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరిపి బస్తర్ లో కాల్పుల విరమణ ప్రకటించాలని, శాంతి నెలకొల్పాలని కోరారు. మేధావుల ప్లానింగ్ కమిటీ రిపోర్టును సమీక్షించి ఆదివాసీలపై మానవీయంగా వ్యవహరించాలని సూచించారు. రాజ్యాంగంలోని షెడ్యూల్​5, 6లోని ప్రాంతాలను, గిరిజనుల హక్కులను కాపాడాలని పేర్కొన్నారు.  భారత్ బచావో ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘దండకారణ్యంలో ఆదివాసుల జాతి హననాన్ని అడ్డుకుందాం.. 5, 6వ షెడ్యూల్ ప్రాంతాలను కాపాడుకుందాం.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టులపై కాల్పుల విరమణ  ప్రకటించాలి’ పేరుతో సభ జరిగింది.  

హరగోపాల్​తో పాటు ఎమ్మెల్సీ కోదండరాం, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ భక్త చరణ్ దాస్, మధుయాష్కీ, గ్రంథాలయ చైర్మన్ రియాజ్, బోయిన్​పల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, ట్రైకార్​చైర్మన్ బెల్లయ్య నాయక్, ఆదివాసీ నాయకురాలు సోనీ సోది, గాదె ఇన్నయ్య హాజరై మాట్లాడారు. బస్తర్ లో నక్సల్స్ పేరుతో ఆదివాసీలను అరెస్టు చేసి జైల్లో పెట్టి చంపేస్తున్నారని ఆరోపించారు. న్యాయవ్యవస్థ వారిపై ప్రేమ చూపించాలని కోరారు. కేంద్రం శాంతి చర్చలు జరపకపోతే బస్తర్, ఆదివాసీలు రెండు మిగలవని ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కడ చూసినా పోలీస్ క్యాంపులే ఉన్నాయని మణిపూర్ లాంటి ఘటనలు బస్తర్ లో ప్రతిరోజు జరుగుతున్నాయని తెలిపారు. రాజ్యాంగ పరిధిని దాటితే ప్రభుత్వాలకే హానికరమన్నారు.