ఆక్సిజన్‌ లెవల్స్ నేచురల్ గా పెరగాలంటే

కరోనా సెకండ్‌‌ మ్యుటెంట్​లో ఎక్కువమందికి శ్వాసకు సంబంధించి ఇబ్బందులు వస్తున్నాయి. దీనికితోడు ఆక్సిజన్‌‌ కొరత కూడా ఎక్కువగానే ఉంది. కేసులు పెరిగిపోవడంతో హాస్పిటల్స్‌‌లో బెడ్స్​ దొరకడంలేదు. చాలామందికి ఇంట్లోనే ట్రీట్మెంట్‌‌ తీసుకోవాల్సిన పరిస్థితి. అందుకే, హోం ఐసోలేషన్‌‌లో ఉన్నవాళ్లు ఆక్సిజన్‌‌ లెవల్స్‌‌పై జాగ్రత్తపడాలి. అలాంటి వాళ్ల కోసం ఆక్సిజన్‌‌ మెషిన్లు వచ్చేశాయి. కానీ, అవి చాలా కాస్ట్లీ. అందుకే, నేచురల్‌‌గా మన ఆక్సిజన్‌‌ లెవల్స్‌‌ పెంచుకోవాలి. అందుకు ‘ ప్రోన్‌‌ పొజిషన్‌‌’ ప్రాక్టీస్‌‌ చేస్తే బెటర్​ అని ఈ మధ్య వీడియోలు తెగ వైరల్‌‌ అవుతున్నాయి. 

నిజంగానే ఈ వ్యాయామం ప్రాక్టీస్‌‌ చేస్తే ఆక్సిజన్‌‌ పెరుగుతుందా?

ప్రోన్‌‌ పొజిషన్‌‌ ప్రాక్టీస్‌‌ చేసే వ్యక్తి ఆక్సిజన్‌‌ లెవల్‌‌ 93 నుంచి 95కి పెరిగిందని వైరల్​ అవుతున్న ఆ వీడియోల్లో కనపడుతోంది. ప్రోన్​ పొజిషన్​ నిజంగానే ఆక్సిజన్‌‌ లెవల్స్‌‌ పెంచుతుందని చెప్తున్నారు కొందరు ఎక్స్‌‌పర్ట్స్‌‌. ఇటలీలో ఆక్సిజన్‌‌, బెడ్ల కొరత ఉన్నప్పుడు కరోనా పేషంట్లకు డాక్టర్లు ప్రోన్‌‌ పొజిషన్‌‌ ప్రాక్టీస్‌‌ చేయమని సలహా ఇచ్చారని.. అది ఒక లైఫ్‌‌ టెక్నిక్‌‌గా పని చేసిందని చెబుతున్నారు. 

అసలు ఏంటిది?

ప్రోనింగ్‌‌ అంటే పొట్టమీద.. అంటే బోర్లా పడుకోవాలి. తల కిందికి ఆన్చి, రెండు చేతులు ముందుకు పెట్టాలి. ఈ పొజిషన్‌‌లో పడుకున్నప్పుడు ఊపిరితిత్తుల వెనుక భాగం, శరీరం సాగుతాయి. దానివల్ల ఆక్సిజన్​ సరఫరా పెరిగి శ్వాసలో సమస్య రాకుండా ఉంటుంది. ఛాతి, పొట్టమీద పడుకోవడం వల్ల శరీరంలోని అన్ని భాగాల్లోకి గాలి వెళ్తుంది. దానివల్ల కూడా ఆక్సిజన్​ సరఫరా పెరుగుతుందని అంటున్నారు ఎక్స్‌‌పర్ట్స్‌‌. శ్వాస విషయంలో ఇబ్బంది ఉన్నవాళ్లకు ఈ వ్యాయామం కచ్చితంగా  పనిచేస్తుంది. వెంటిలేటర్‌‌‌‌ అవసరం ఉన్నవాళ్లలో కూడా ఇది కొంతమేర ప్రభావం చూపుతుందని చెబుతున్నారు వాళ్లు.