
- ఉమ్మడి మెదక్ జిల్లాలో ఇప్పటివరకు45 నుంచి 60 శాతమే పూర్తి
- మొత్తం17 మునిసిపాలిటీల్లో నో స్పెషల్డ్రైవ్స్, రిబేట్స్
- ప్రాపర్టీ ట్యాక్స్ లపై అధికారులు రిలాక్స్
సంగారెడ్డి/మెదక్/సిద్దిపేట, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లాలో మున్సిపాలిటీల ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లు స్లోగా జరుగుతున్నాయి. ఆర్థిక సంవత్సరం ముగియడానికి 45 రోజుల గడువు మాత్రమే ఉన్నప్పటికీ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. సంగారెడ్డి జిల్లాలో 8, మెదక్ జిల్లాలో 4, సిద్దిపేట జిల్లాలో 5 కలిపి మొత్తం 17 మున్సిపాలిటీలలో ట్యాక్స్ వసూళ్లు 45 నుంచి 60 శాతం వరకే పూర్తయ్యాయి. పన్నులు వసూళ్లు కాక ఖజానా ఖాళీ కాగా పారిశుధ్య కార్మికులు, సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో 8 మున్సిపాలిటీలు ఉన్నాయి.
మున్సిపాలిటీల వారీగా బకాయిలు ఇలా..
సంగారెడ్డి మునిసిపాలిటీలో ఇంటి పన్నులు మొత్తం రూ.13.2 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా కేవలం రూ.6.20 కోట్లు మాత్రమే వసూళ్లయ్యాయి. ఇంకా రూ.6.82 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. నారాయణఖేడ్ బల్దియాలో ప్రాపర్టీ ట్యాక్స్ రూ.2.30 కోట్లు కాగా వీటిలో రూ.1.5 కోట్లు వసూలు చేశారు. ఇంకా రూ.80 లక్షలు వసూలు చేయాల్సి ఉంది. జహీరాబాద్ మునిసిపాలిటీలో ప్రాపర్టీ ట్యాక్స్ రూ.24 కోట్లు ఉండగా ఫిబ్రవరి 10 వరకు రూ.10 కోట్లు కూడా దాటలేదు.
ఇంకా రూ.14 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. బొల్లారం మున్సిపాలిటీలో రూ.16.19 కోట్ల పన్నులు వసూలు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.10.48 కోట్లు వసూలు చేశారు. మిగిలిన బకాయిలు రూ.5.71 కోట్లు వసూలు కావాల్సి ఉంది. జోగిపేట మునిసిపల్ పరిధిలో ప్రాపర్టీ టాక్స్ మొత్తం. రూ.1.32 కోట్లు రావాల్సి ఉండగా రూ.52 లక్షలు మాత్రమే వసూలయ్యాయి. మిగతా రూ.80 లక్షలు స్పెషల్ డ్రైవ్ లో వసూలు చేస్తామన్న ధీమాలో అధికారులు ఉన్నారు.
అమీన్ పూర్ మున్సిపాలిటీలో మొత్తం రూ.25 కోట్ల పన్నులు వసూలు కావాల్సి ఉండగా ఇప్పటివరకు వసూలు చేసింది రూ.11 కోట్లు మాత్రమే. మిగతా రూ.13 కోట్లు వసూలు కావాల్సి ఉంది. తెల్లాపూర్ బల్దియాలో రూ.40 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయాలన్న డిమాండ్ ఉంది. కానీ వసూలు చేసింది మాత్రం రూ.21 కోట్లు ఇంకా రూ.19 కోట్ల బ్యాలెన్స్ ఉంది. సదాశివపేట మున్సిపాలిటీలో రూ.1.13 కోట్లు ప్రాపర్టీ టాక్స్ లు వసూలు చేయాల్సి ఉంది. ఇందులో ఇప్పటివరకు రూ.25 లక్షలు వసూలు చేశారు. ఇంకా రూ.88 లక్షలు రాబట్టాల్సి ఉంది.
సిద్దిపేట జిల్లాలో..
సిద్దిపేట మునిసిపాలిటీలో రూ.17.74 కోట్ల పన్నులు వసూలు చేయాల్సి ఉండగా రూ.11.57 కోట్లు వసూలయ్యాయి. ఇంకా రూ.6.17 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. దుబ్బాక మునిసిపాలిటీలో రూ.2 కోట్ల పన్ను వసూలుకు రూ. కోటీ 10 లక్షలు వసూలయ్యాయి. ఇంకా రూ.90 లక్షలు రావాల్సి ఉంది. చేర్యాల మునిసిపాలిటీలో రూ.3.14 కోట్ల పన్నులు వసూలు చేయాల్సి ఉండగా రూ. కోటి 47 లక్షలు వసూళ్లయ్యాయి. మరో రూ. కోటి 66 లక్షలు వసూలు కావాల్సి ఉంది.
హుస్నాబాద్మునిసిపాలిటీలో రూ. కోటి 70 లక్షల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయాలన్న డిమాండ్ ఉండగా ఇప్పటివరకు రూ.95 లక్షలు వసూళ్లయ్యాయి. ఇంకా రూ.75 లక్షలు వసూలు కావాల్సి ఉంది. గజ్వేల్మునిసిపాలిటీలో రూ.4.75 కోట్ల పన్నులు వసూలు చేయాల్సి ఉండగా రూ.2.71 కోట్లు వసూలయ్యాయి. మరో రూ.2.03 కోట్ల బకాయి ఉంది. మునిసిపల్, రెవెన్యూ సిబ్బంది, బిల్ కలెక్టర్లు పన్ను వసూళ్లకు తిరుగుతున్నారు. మార్చి నెల ముగిwwసే నాటికి వంద శాతం పన్ను వసూలు పూర్తి చేసే దిశగా కసరత్తు చేస్తున్నారు.
మెదక్ జిల్లాలో..
మెదక్ మునిసిపాలిటీలో ప్రాపర్టీ టాక్స్ డిమాండ్ రూ.5.06 కోట్లు. ఇప్పటి వరకు రూ.2.83 కోట్లు వసూలయ్యాయి. మున్సిపల్ సిబ్బంది ఇంటింటికీ తిరిగి పన్నులు వసూలు చేస్తున్నారు. తూప్రాన్ మున్సిపాలిటీ ట్యాక్స్ డిమాండ్ రూ.2.91 కోట్లు కాగా ఇప్పటి వరకు రూ.1.50 కోట్లు వసూలయ్యాయి. ఇవి పోను ఇంకా రూ.1.41 కోట్లు బకాయి ఉన్నాయి.
రామాయంపేట మునిసిపాలిటీలో ట్యాక్స్ డిమాండ్ రూ.1.57 కోట్లు కాగా ఇప్పటి వరకు రూ.65.34 లక్షలు వసూలయ్యాయి. నర్సాపూర్ మునిసిపాలిటీ ట్యాక్స్ డిమాండ్ రూ.3.74 కోట్లు ఉండగా ఇప్పటి వరకు రూ.2.49 కోట్లు వసూలయ్యాయి. ఇంకా రూ.1.24 కోట్లు బకాయి ఉన్నాయి. ఏప్రిల్ లో 5 శాతం రిబెట్ ఉంటుందని అధికారులు చెబుతున్నారు.