
- పెద్దపల్లి మండలం నిట్టూరు హైస్కూల్ వద్ద ఘటన
పెద్దపల్లి, వెలుగు : ‘ఫిజిక్స్ టీచర్ మాకు వద్దే వద్దు’ అంటూ పెద్దపల్లి మండలం నిట్టూరు హైస్కూల్ స్టూడెంట్లు, వారి తల్లిదండ్రులతో కలిసి బుధవారం నిరసన తెలిపారు. స్కూల్ గేటుకు తాళం వేసి, అక్కడే బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు తల్లిదండ్రులు మాట్లాడుతూ.. స్కూల్‌లో ఫిజిక్స్ టీచర్‌గా పనిచేస్తున్ శంకరయ్య కొంతకాలంగా విద్యార్థుల పట్ల కుల వివక్ష చూపుతున్నారని, తన ప్రవర్తనతో స్టూడెంట్లను భయాందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. శంకరయ్యను నిట్టూర్ హైస్కూల్ నుంచి ట్రాన్స్‌ఫర్ చేయాలని, లేదంటే ఆందోళన చేపడుతామని హెచ్చరించారు.
నిరసనపై స్పందించిన హెచ్‌ఎం మాట్లాడుతూ... టీచర్ శంకరయ్య వ్యవహారాన్ని గతంలోనే పేరెంట్స్ తన దృష్టికి తీసుకొచ్చారని, ఈ విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ధర్నా సమాచారం తెలుసుకున్న పెద్దపల్లి ఎస్సై లక్ష్మణ్‌రావు స్కూల్ వద్దకు చేరుకొని సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని స్టూడెంట్స్, పేరెంట్స్‌కు నచ్చజెప్పారు. దీంతో వారు ఆందోళన విరమించారు.