మెదక్​ జిల్లాలో పథకాల ప్రారంభోత్సవం రసాభాస

మెదక్​ జిల్లాలో పథకాల ప్రారంభోత్సవం రసాభాస
  • ఎమ్మెల్యే  సునీతారెడ్డి, 
  • లైబ్రరీ చైర్​పర్సన్ ​సుహాసిని రెడ్డి మధ్య ప్రొటోకాల్ వివాదం 

కౌడిపల్లి, వెలుగు: కౌడిపల్లి మండలం వెంకటాపూర్​ (ఆర్​) గ్రామంలో ఆదివారం ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమం రసాభాసగా మారింది. పైలట్ ప్రాజెక్ట్​గా ఎంపిక చేసిన గ్రామానికి  83 రేషన్ కార్డులు, 42 ఇందిరమ్మ ఇండ్లు, 33 ఆత్మీయ భరోసా, 214  మందికి రైతు భరోసా మంజూరయ్యాయని అధికారులు తెలిపారు. డీఎల్పీవో సాయిబాబా సభలో లబ్దిదారుల లిస్ట్​ చదువుతుండడంగా బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే సునీతారెడ్డి వచ్చేంతవరకు లిస్టు చదవొద్దు, సర్టిఫికెట్లు ఇవ్వొద్దని అధికారులను, లబ్ధిదారులను అడ్డుకున్నారు.

దీంతో కాంగ్రెస్, బీఆర్​ఎస్ నాయకులతో గొడవకు దిగారు. ఎమ్మెల్యే సునీతా రెడ్డి తర్వాత కార్యక్రమానికి వచ్చి అధికారులను జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. తాను లేకుండా పథకాలు ఎలా పంపిణీ చేస్తారని, ఎమ్మెల్యేకు ప్రొటోకాల్ వర్తించదా అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత ఎమ్మెల్యే సునీతారెడ్డి లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్​పంపిణీ చేస్తుండగా, జిల్లా లైబ్రరీ చైర్​ పర్సన్​ సుహాసిని రెడ్డి కూడా పత్రాలను పంపిణీ చేశారు. దీంతో సునీతారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఇద్దరూ స్టేజిపై పోటాపోటీగా మైక్ లో మాట్లాడుతుండగా ఎమ్మెల్యే సునీతా రెడ్డి, సుహాసిని రెడ్డి  మైకు 
లాగేశారు.