పంతుళ్లకు పాఠాలు

పంతుళ్లకు పాఠాలు
  • సూర్యాపేట జిల్లాలోని ఇంగ్లిష్ టీచర్లకు శిక్షణ 
  • మూడు రోజులపాటు వెయ్యి మందికి ట్రైనింగ్ 
  • యూకేకి చెందిన ఎన్జీవో సంస్థ ద్వారా శిక్షణ అందిస్తున్న కలెక్టర్​

సూర్యాపేట, వెలుగు: మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో సూర్యాపేట జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలోని ఇంగ్లిష్ టీచర్లకు శిక్షణ ఇస్తున్నారు. ఆంగ్లంపై టీచర్లు పట్టు సాధించి విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన చేస్తే మంచి ఫలితాలు వస్తాయని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ టీచర్లకు శిక్షణ ఇస్తున్నారు. 

సూర్యాపేట జిల్లాలోని టీచర్లకు శిక్షణ..

కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన తేజస్ నందలాల్ పవార్ మొదటగా విద్యారంగంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను సందర్శించగా విద్యార్థులు ఇంగ్లిష్ లాంగ్వేజ్ లో వెనుకబడినట్లు గుర్తించారు. ఇంగ్లిష్ భాషపై టీచర్లు సైతం వెనుకబడడంతో స్టూడెంట్స్ కు అర్థమయ్యే రీతిలో బోధన లేకపోవడమే కారణమని కలెక్టర్​భావించారు. దీంతో ఇంగ్లిష్ లాంగ్వేజ్ పై టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. 

ఇందులో భాగంగా యూకేకి చెందిన ప్రముఖ ఎన్జీవో సంస్థ జాలి సుఖోస్ తో కలెక్టర్ మాట్లాడి జిల్లాలోని ప్రభుత్వ టీచర్లకు ట్రైనింగ్ ఇప్పించేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఈ సంస్థకు అనేక దేశాల్లో 15 ఏండ్ల అనుభవం ఉంది. తమిళనాడు రాష్ట్రంలో సైతం ఇదే సంస్థ శిక్షణ ఇచ్చింది. జిల్లాలో కూడా ఇదే సంస్థతో టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చేందుకు కలెక్టర్ ఒప్పందం చేసుకున్నారు.    

మూడు రోజులపాటు టీచర్లకు ట్రైనింగ్..

జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోని వెయ్యి మంది టీచర్లకు మూడు రోజులపాటు ఈ సంస్థ శిక్షణ ఇవ్వనుంది. జిల్లావ్యాప్తంగా ఉన్న 700 ప్రైమరీ, యూపీఎస్ స్కూళ్లకు చెందిన ఇంగ్లిష్ టీచర్లలో ఒక్కో స్కూల్ నుంచి ఒక్కొక్కరికి అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ ఇస్తున్నది. హుజూర్ నగర్  నుంచి 250, కోదాడ 250, సూర్యాపేట 300, తిరుమలగిరి నుంచి 200 మంది టీచర్లకు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. 

ఇప్పటికే సూర్యాపేట, తిరుమలగిరి, హుజూర్ నగర్ ప్రాంతాల టీచర్లకు శిక్షణ పూర్తి చేశారు. కోదాడకు చెందిన టీచర్లకు రెండు రోజుల్లో శిక్షణ పూర్తి కానుంది. ముఖ్యంగా విద్యార్థులకు సులభంగా అక్షరాలను విడగొట్టి సృజనాత్మకంగా ఇంగ్లిష్ అర్థమయ్యేలా ఎలా భోదించాలి అనే అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. 

ఉచితంగా వర్క్ బుక్స్..

శిక్షణ పూర్తి చేసుకున్న టీచర్లకు ట్రైనింగ్ బుక్, స్టూడెంట్ వర్క్ బుక్, టీచర్ గైడ్, పోనిక్స్​ చార్ట్స్, పోస్టర్స్, స్టూడెంట్ రీడింగ్ బుక్, హ్యాండ్ బుక్స్ ఇవ్వడంతోపాటు ప్రతి స్కూల్ కు వర్క్ బుక్స్, బిగ్ బుక్స్ ను ఈ సంస్థ ఇవ్వనుంది. దీనితోపాటు టీచర్లు స్టూడెంట్స్ కు ఎలా టీచింగ్ చేస్తున్నారు.. అనే దానిపై 10 టీమ్స్ మూడు నెలలకు ఒకసారి స్కూల్స్ పై మానిటరింగ్ చేయనున్నారు. వెనుకబడిన టీచర్లకు మరోసారి శిక్షణ ఇస్తారు.   

ఇంగ్లిష్ భాషపై పట్టు సాధించేందుకే శిక్షణ 

ఇంగ్లిష్ భాషపై పట్టు సాధించి విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా టీచింగ్ చేసేందుకు టీచర్లకు మూడు రోజులపాటు ట్రైనింగ్ ఇస్తున్నాం. ట్రైనింగ్ తో స్టూడెంట్స్ కు ఇంగ్లిష్ లాంగ్వేజ్ లో ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. - అశోక్, డీఈవో