ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు రెడీ..!

ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు రెడీ..!
  • ఇవాళ్టి నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం 
  • 236 కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం
  • 4.29 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం
  • ఈ సీజన్​ నుంచి సన్నాలకు రూ.500 బోనస్​ అమలు

ఖమ్మం, వెలుగు : ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. వానాకాలం పంటలు  చేతికి వచ్చేందుకు ఇంకా టైమ్​ఉన్నా.. రైతులకు ఇబ్బందులు కలుగకుండా  ముందుగానే సెంటర్లు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఈ సీజన్​ లో మొత్తం 6.77 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్న అధికారులు..  236 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి  4,29,630 మెట్రిక్​ టన్నులు కొనాలని  టార్గెట్​పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించి గన్నీ బ్యాగులు, ప్యాడీ క్లీనర్లు, కాంటాలు, టార్పాలిన్లు సిద్ధం చేశారు. 

బార్డర్​లో ప్రత్యేక నిఘా

 ఈ ఏడాది నుంచి సన్న రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్​ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో సన్న రకాల  గుర్తింపు కోసం చర్యలు తీసుకుంటోంది.  కొనుగోలు కేంద్రాల బాధ్యులు, వ్యవసాయ విస్తరణ అధికారి  సమన్వయంతో సన్నరకాలను   గుర్తించాలని గైడ్​లైన్స్​లో పేర్కొన్నారు.  గ్రామాల్లో ఇప్పటికే పంటల నమోదు పూర్తిచేయడంతో ఆ డేటా ఆధారంగా కొనుగోలు ప్రక్రియ జరగనుంది. ఏపీకు చెందిన వ్యాపారులు గతంలో అక్కడ  తక్కువ ధరకు కొన్న ధాన్యాన్ని జిల్లాకు తెచ్చి అమ్ముకున్న ఘటనలు ఉన్నాయి.

ఏపీకి సరిహద్దులో ఉన్న జిల్లాలోని చాలా గ్రామాలకు  రాత్రికి రాత్రి ట్రాక్టర్లలో బార్డర్​ దాటించి ఇక్కడి రైతుల పేర్లతో అమ్మకాలు సాగిస్తున్నారు.  బోనస్ కూడా ఇస్తున్నందున ఈసారి ఎక్కువగా ధాన్యాన్ని తరలించే చాన్స్​ ఉంటుందని భావిస్తున్న అధికారులు బార్డర్​లో  ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.  ధాన్యం కొనుగోళ్లు జరిగిన తర్వాత మిల్లర్లు సరుకు దించుకోవడానికి  కొర్రీలు పెట్టడం కామన్​గా మారింది. తేమ శాతం ఎక్కువగా ఉందని క్వింటాలుకు 8 నుంచి 10 కిలోల వరకు తరుగు తీయడంవల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు.

ఈ సారి అలాంటి ఇబ్బంది రాకుండా సెంటర్ల దగ్గరే  నాణ్యతను పరిశీలించాలని, రైస్ మిల్లుల దగ్గర ఎలాంటి  కోతలు పెట్టరాదని  మిల్లర్లను ఆఫీసర్లు హెచ్చరించారు.  కొనుగోలు కేంద్రాల నుంచి ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించేందుకు అవసరమైన లారీలను  సిద్ధం చేశారు.  ధాన్యం నాణ్యత, మద్దతు ధర తదితర  అంశాలను  వివరిస్తూ అన్ని  కేంద్రాల వద్ద బ్యానర్లు ఏర్పాటు చేయనున్నారు.

సెంటర్లలో  తాగు నీరు, విద్యుత్ సరఫరా, లైట్లు, రైతులకు అవసరమైన  సౌకర్యాలు కల్పించాలని  కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అధికారులకు సూచించారు. రైతులు నాణ్యమైన ధాన్యాన్ని   కేంద్రాలకు తీసుకుని రావాలన్నారు.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు నవంబర్​ లో ప్రారంభం కానున్నాయి. మొదటి దశలో 160కి పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   చేయనున్నారు.1.20 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం సేకరణకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ​