ఆషాడ శుద్ధ విదియ ( జులై 7) నాడు జరిగే పూరీ రథోత్సవాన్ని చూసేందుకు రెండు కళ్లు సరిపోవు. ఈ ఏడాది జూలై 7 న రథయాత్ర జరగనుంది. ఈ ఏడాది(2024)ప్రత్యేకత ఏంటంటే 3 ఉత్సవాలు ఒకే రోజు జరగనున్నాయి...
పూరీ జగన్నాథుడి రథయాత్ర కేవలం ఓ ఒడిశా వాసులకు మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉండే ప్రతి భక్తులు చూసి తీరాల్సిన అద్భుతమైన ఆధ్యాత్మిక సంబరం. ఈ రథయాత్ర ప్రత్యేకతలపై ఎన్నో గాథలున్నాయి. వాటి మహిమల గురించి ఎన్నిసార్లు చెప్పుకున్నా నిత్యనూతనమే. ఏటా ఆషాడంలో జరిగే రథయాత్ర చూసేందుకు లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఈ ఏడాది(2024) జూలై 7న ప్రధాన రథయాత్ర జరగనుంది. అయితే ఇదే రోజు మరో రెండు విశిష్టతలున్నాయి...
మూడు ఉత్సవాలు ఒకేరోజు
సాధారణంగా జగన్నాథుడి నవయవ్వనరూపం, నేత్రోత్సవం, రథయాత్ర వేర్వేరు రోజుల్లో జరుగుతాయి. కానీ ఈ ఏడాది ఈ మూడు ఉత్సవాలు ఒకే రోజు జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత ఈ 3 ఉత్సవాలు ఒకే రోజు నిర్వహిస్తున్నారు. 1971లో నవయవ్వనరూపం, నేత్రోత్సవం, రథయాత్ర ఒకేరోజు చేశారు..ఈ ఏడాది కూడా అదే విధానం అనుసరించాలని నిర్ణయించింది అధికార యంత్రాంగం. జూలై 6 అర్థరాత్రి నుంచి గర్భగుడిలో జగన్నాధ, బలభద్ర, సుభద్రకు ప్రత్యేక సేవలు మొదలువుతాయి. తెల్లవారు జామున నవయవ్వన అవతార అలంకరణం, ఆ తర్వాత నేత్రోత్సవం, గోప్య సేవలు నిర్వహించిన తర్వాత విగ్రహాలను రథం వద్దకు తీసుకొస్తారు. పూరీ రాజు గజపతి దివ్యసింగ్‌దేవ్ బంగారు చీపురుతో రథం ముందు ఊడ్చిన తర్వాతే రథం ముందుకు సాగుతుంది.
అద్భుతమైన ఆధ్యాత్మిక సంబరం
జగన్నాథస్వామి ఆలయం నుంచి బయలుదేరే 3 రథాలు అక్కడికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచాదేవి ఆలయం దగ్గరకు వెళ్లగానే ఆగిపోతాయి. అక్కడే వారంపాటూ ఆతిథ్యం స్వీకరించి ఆ తర్వాత తిరుగుపనయం అవుతాయి. మళ్లీ జగన్నాథ ఆలయానికి చేరుకున్నాక విగ్రహాలను తీసుకెళ్లి తిరిగి గర్భగుడిలో ప్రతిష్టిస్తారు. ఆ ఘట్టంతో ఉత్సవం ముగుస్తుంది. అయితే ఈ సంవత్సరం రథయాత్ర సాయంత్రం మొదలవుతుంది.. మొదట బలభద్రుడు..ఆ తర్వాత సుభద్ర..ఆఖర్లో జగన్నాథుడి రథాలు బయలుదేరుతాయి. అంటే బలభద్రుడి రథం బయలుదేరేసరికే చీకటి పడుతుంది...అందుకే జులై 8 న రథాలు గుండిచా సన్నిధికి చేరుకుంటాయి.
అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ అవంతికా పూరీ ద్వారావతీచైవ సప్తైతే మోక్షదాయకా....
అంటే ఏడు మోక్షదాయక క్షేత్రాల్లో ఒకటి పూరీ. పురుషోత్తముడు కొలువైన ఈ క్షేత్రాన్నికి శ్రీ క్షేత్రం, శంఖ క్షేత్రం, నీలాద్రి , నీలాచలం అనే పేర్లతోనూ పిలుస్తారు. సంవత్సరం పాటూ గర్భాలయంలో ప్రత్యేక పూజలందుకునే జగన్నాథుడు.. ప్రతి సంవత్సరం ఆషాడ శుద్ధ విదియ రోజు సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలసి బయటకు అడుగుపెడతాడు. 1078 లో కళింగ పరిపాలకుడైన అనంతవర్మ చోడగంగాదేవ ఈ ఆలయ నిర్మాణం ప్రారంభిస్తే.. ఆయన మనవడైన రాజా అనంగ భీమదేవ్ పాలనలో పూర్తయింది. అంతకు ముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు నిర్మించారు.