వరదలను ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలం :పువ్వాడ అజయ్ కుమార్

వరదలను ఎదుర్కోవడంలో ప్రభుత్వం విఫలం :పువ్వాడ అజయ్ కుమార్
  • మాజీమంత్రి పువ్వాడ, ఎంపీ వద్దిరాజు 

ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మంలో వరదలను ఎదుర్కోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు. మున్నేరు పరివాహక ప్రజలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంలో ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోందన్నారు.  సోమవారం ఖమ్మం నగరంలోని బీఆర్​ఎస్​ పార్టీ జిల్లా కార్యాలయంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఖమ్మంలో ముగ్గురు మంత్రులు ఉండి కూడా ఈ పరిస్థితి రావడం బాధాకరమన్నారు.

 వరదల్లో నష్టపోయిన ప్రతి ఫ్యామిలీకీ రూ.2 లక్షల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరదల్లో మృతి చెందిన కుటుంబాలకు రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్​ చేశారు. మున్నేరు వరదల నుంచి ప్రజలను రక్షించేందుకు శాశ్వత పరిష్కారం గా రిటర్నింగ్ వాల్ నిర్మాణం కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.690 కోట్లు కేటాయించారని గుర్తు చేశారు. వాటితో కాంగ్రెస్​ ప్రభుత్వం రిటర్నింగ్ వాల్ నిర్మించి ఉంటే ఇంత నష్టం వాటిల్లకపోయేదన్నారు.

 వరదల్లో చిక్కుకుని మృతి చెందిన సైటిస్ట్ అశ్విని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది నెలలైనా ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఎంపీ వద్దిరాజు ఆరోపించారు. ముంపు ప్రాంతాల్లో తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలన్నారు. అంతకుముందు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర వరద  ప్రాంతాల్లో పర్యటించారు.