బషీర్ బాగ్, వెలుగు: మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ మహిళా జేఏసీ చైర్మన్ మట్టా జయంతి గౌడ్ అధ్యక్షతన హైదరాబాద్ కాచిగూడలో ఏర్పాటు చేసిన సమావేశానికి కృష్ణయ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
బీసీ మహిళలకు జరుగుతున్న అన్యాయాలు, అత్యాచారాలపై రాజకీయ పార్టీల నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. బీసీలకు సబ్ కోటా గురించి అసెంబ్లీలో మొక్కుబడిగా తీర్మానం చేసి చేతులు దులుపుకుంటే సరిపోతుందా అని అన్నారు. మహిళా బిల్లులో రాజకీయ రిజర్వేషన్లతో పాటు విద్యా, ఉద్యోగాల్లో 50శాతం రిజర్వేషన్లు ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు.
సిద్ధేశ్వర్దీక్షకు లీడర్ల సంఘీభావం
పద్మారావునగర్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, కులగణన చేపట్టాలని బీసీ లీడర్ సిద్దేశ్వర్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష ఆదివారం నాటికి ఎనిమిదో రోజుకు చేరింది. ఆదివారం గాంధీ దవాఖానకు వచ్చిన రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య, సీపీఐ శాసనసభ పక్ష లీడర్కూనంనేని సాంబశివరావు దీక్ష చేస్తున్న సిద్దేశ్వర్‌కు సంఘీభావం తెలిపారు. ఈ విషయమై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. గాంధీలోనే దీక్ష చేస్తున్న సంజయ్‌కుమార్ ఆరోగ్యం క్షీణించడంతో శనివారం అర్ధరాత్రి ప్రైవేట్దవాఖానకు తరలించిన సంగతి తెలిసిందే.