
హైదరాబాద్ లో చిన్న పిల్లల విక్రయాల అంతరాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. 9 మంది నిందితులతో పాటు 18 మంది పిల్లలను దత్తత తీసుకున్న తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పిల్లల అమ్మకాల్లో కీలక నిందితురాలు సోము అమూల్యను అరెస్ట్ చేసిన పోలీసులు మీడియా మందు ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీపీ సుధీర్ బాబు మీడియాకు వివరాలు వెల్లడించారు.
పిల్లల విక్రయాల కేసులో మొత్తం ఇప్పటివరకు 27 మంది నిందితులను అరెస్ట్ చేశాం. ఈ ముఠా నుంచి 10 మంది చిన్నారులను పోలీసులు రెస్క్యూ చేశారు. కాపాడిన చిన్నారుల్లో ఆరుగురు బాలికలు, 4 బాలురు ఉన్నారు. ఈ ముఠా మహారాష్ట్ర, యూపీ , ఛతీస్ ఘడ్ లో పిల్లను సేకరించి.. వెస్ట్ బెంగాల్ , తమిళనాడు , కర్ణాటక, ఏపీ, తెలంగాణాలో పిల్లలను అమ్ముతోంది. ఇప్పటి వరకు 18 మంది చిన్నారులను ఈ ముఠా అమ్మింది.
కీలక నిందితురాలు అమూల్య 10 మంది చిన్నారులను అమ్మింది. అమూల్య , దీప్తి కలిసి మరో 8 మందిని అమ్మినట్లు గుర్తించాం. మగ శిశువులను నాలుగు నుంచి ఆరు లక్షల మధ్య ఆడ శిశువులను రెండు నుంచి నాలుగు లక్షల మధ్య అమ్ముతున్నారు. ఆడ శిశులను రెండు నుంచి మూడు లక్షల మధ్య కొనుగోలు చేసి మూడు నాలుగు లక్షలకు మళ్లీ అమ్ముతున్నారు. అలాగే మగ శిశువులను నాలుగు నుంచి ఐదు లక్షల మధ్య కొనుగోలు చేసి ఐదు నుంచి ఆరు లక్షల మధ్య అమ్ముతున్నారు. మొత్తం 25 మంది శిశువుల అమ్మకాలు జరిగాయి. 16 మందిని రెస్క్యూ చేశాం. ఇంకా 9 మందిని రెస్క్యూ చేయాల్సి ఉంది.
ముఠాలో కీలక నిందితురాలు అమూల్య ఆశా వర్కర్ గా పనిచేస్తుంది. దత్తతా అనేది లీగల్ గా జరగడం లేదు, ఇదంతా చట్ట విరుద్ధంగా జరుగుతోంది. జేజే యాక్ట్ ప్రకారం ఆన్ లైన్లో వివరాలను ఎంటర్ చేసి ఆ తర్వాత చిన్నారులను దత్తత తీసుకోవాలి. ఇలా కాకుండా ఏ విధంగా దత్తత తీసుకున్నా చట్ట విరుద్ధమే. అని సీపీ హెచ్చరించారు.