తిరుమల అప్​డేట్​ : ఒకే రోజు ఏడు వాహనాలపై శ్రీవారి దర్శనం.. ఎప్పుడంటే..

తిరుమల అప్​డేట్​ :  ఒకే రోజు ఏడు వాహనాలపై  శ్రీవారి దర్శనం.. ఎప్పుడంటే..

తిరుమల వెళ్లే  శ్రీవారి  వెళ్లే భక్తుల కు టీటీడీ కీలక సమాచారం అందించింది. ఫిబ్రవరి నెలలో విశేష పర్వదినాల వేళ స్వామివారి దర్శనానికి ఆసక్తి చూపే భక్తులకు పర్వదినోత్సవాల వివరాలు వెల్లడించింది. తిరుమలలో రథ సప్తమి వేడుకలను  ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ అధికారులు సిద్దమవుతున్నారు. ఈ ఏడాది (2025) సూర్యజయంతిని  ఫిబ్రవరి4న జరుపుతున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ మేరకు జరుగుతున్న ఏర్పాట్లను టీటీడీ అధికారులు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు.

రథసప్తమి రోజున (ఫిబ్రవరి 4)  ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏడు వాహనాలపైశ్రీ మలయప్ప స్వామి వారు విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు. 

  • ఉదయం 5.30 నుంచి 8 గంటల వరకు(సూర్యోద‌యం ఉద‌యం 6.45 గంట‌ల‌కు) - సూర్యప్రభ వాహనం 
  • ఉదయం 9 నుంచి 10 గంటల వరకు - చిన్నశేష వాహనం 
  • ఉదయం 11 నుంచి 12 గంటల వరకు - గరుడ వాహనం 
  • మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు - హనుమంత వాహనం  
  • మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు - చక్రస్నానం
  • సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు -  కల్పవృక్ష వాహనం
  • సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు - సర్వభూపాల వాహనం 
  • రాత్రి 8 నుంచి 9 గంటల వరకు - చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులను ఆశీర్వదిస్తారు.  

రథసప్తమి వేడుకలకు దాదాపు లక్ష మంది భక్తులు వస్తారని టీటీడీ అధికారులు అంచనా వేస్తుండగా.. వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా స్వామి వారి దర్శనం కల్పించాలని భావిస్తున్నారు. మరోవైపు.. రథసప్తమి సందర్భంగా తిరుమల శ్రీవారికి సంబంధించి పలు సేవలను రద్దు చేశారు. ఇక భక్తులకు బ్రేక్ దర్శనాలు, స్పెషల్ దర్శనాలు కూడా రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. 

ALSO READ | తిరుమలలో రథసప్తమి ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీ పాలకమండలి

రథసప్తమి (ఫిబ్రవరి 4)  సందర్భంగా టీటీడీలో పలు సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.అష్టదళ పాద పద్మారాధన, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

ఎన్.ఆర్.ఐలు, చంటి బిడ్డల తల్లిదండ్రులు, సీనియర్ సిటిజన్లు, వికలాంగుల ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేసినట్లు తెలిపింది. తిరుపతిలో ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు జారీ చేయడం లేదని స్పష్టం చేసింది. ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. బ్రేక్ దర్శనాలకు సంబంధించి ఫిబ్రవరి 3న ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ అధికారులు తెలిపారు.