కేంద్ర బడ్జెట్ ..బుల్లెట్ గాయాలకు బ్యాండేజ్​ ట్రీట్​మెంట్​ : రాహుల్ గాంధీ

కేంద్ర బడ్జెట్ ..బుల్లెట్ గాయాలకు బ్యాండేజ్​ ట్రీట్​మెంట్​ : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్​పై కాంగ్రెస్​ అగ్రనేత, లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘కేంద్ర బడ్జెట్ 2025.. బుల్లెట్ గాయాలకు బ్యాండేజ్​ ట్రీట్​మెంట్​ లాంటిది’’ అని విమర్శించారు. ఈ మేరకు శనివారం ఆయన ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు.  ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చితి పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలో మన దేశ ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఒక నమూనా మార్పు అవసరం. కానీ, ఈ ప్రభుత్వం వద్ద ఇందుకు సంబంధించిన ఆలోచనలు కరువయ్యాయి" అని రాహుల్​విమర్శించారు. కేంద్ర బడ్జెట్ లో బిహార్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వడంపై కాంగ్రెస్​పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. ఎన్డీయే సర్కారు నిలబడడానికి బిహార్​తో పాటు మరో మూల స్తంభమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్రూరంగా విస్మరించిందని దుయ్యబట్టింది. ఈ సంవత్సరం చివర్లో బిహార్ లో ఎన్నికలు జరగనున్నందున.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆ రాష్ట్రంలో మఖానా బోర్డు ఏర్పాటు, పశ్చిమ కోసి కాలువకు ఆర్థిక సహాయం, ఐఐటీ పాట్నా సామర్థ్యం పెంపు వంటి పథకాలను కేటాయించారు.

ధనవంతులకే మేలు..

దేశంలోని ధనవంతులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చేలా, జనాలకు స్వల్ప ఉపశమనంతో సరిపెట్టేలా కేంద్ర బడ్జెట్‌‌‌‌ కు రూపకల్పన చేశారని రాహుల్ ఆరోపించారు. సాధారణ ప్రజలకు స్వల్ప పన్నురాయితీని ప్రకటించిందని, దేశంలోని 25 నుంచి 30 మందికి ప్రయోజనం చేకూర్చడమే బడ్జెట్ లక్ష్యమని చెప్పారు. బడ్జెట్ రూపకల్పనలో పాల్గొన్న 90 మంది బ్యూరోక్రాట్లలో షెడ్యూల్డ్ కులాలు, గిరిజన వర్గాలు, వెనకబడిన వర్గాలకు చెందిన వారు 10 మంది కంటే తక్కువగా ఉన్నారని ఆరోపించారు. వీరు జనాభాలో దాదాపుగా 75 శాతం ఉన్నప్పటికి చిన్న రోల్స్ మాత్రమే పోషించారని పేర్కొన్నారు. కాగా, మహాకుంభమేళా తొక్కిసలాటలో మరణించిన వారి సంఖ్యను ప్రభుత్వం దాచిపెడుతోందని రాహుల్ గాంధీ ఆరోపించారు.