తెలంగాణలో రాహుల్ టూర్ ఖరారు!

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ మే మొదటి వారంలో రాష్ట్రానికి వస్తారని పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ మహేశ్​ కుమార్​ గౌడ్​ వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్​ గాంధీభవన్​లో జరిగిన ముఖ్యనేతల భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. రాహుల్​ రెండ్రోజుల సమయాన్ని తెలంగాణకు కేటాయించారన్నారు. మొదటి రోజు వరంగల్​ సభలో పాల్గొంటారని, రెండో రోజు హైదరాబాద్​లో కాంగ్రెస్​ నేతలతో భేటీ అవుతారని తెలిపారు. రాహుల్​ టూర్​ తేదీలను శనివారం ఏఐసీసీ ఖరారు చేస్తుందని చెప్పారు. రాహుల్​ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఎవరెవరితో భేటీ కావాలనే అంశాన్ని మీటింగ్​లో చర్చించామన్నారు. ఇటీవల చేపట్టిన మెంబర్​షిప్​ డ్రైవ్​పైనా చర్చ జరిగిందని తెలిపారు. తెలంగాణలో 40 లక్షలకు పైగా సభ్యత్వాలు నమోదు అయ్యాయని, ఈ రోజుతో మెంబర్​షిప్​ డ్రైవ్​ ముగిసిందన్నారు. సభ్యత్వాలు కట్టిన వారికి ఇన్సూరెన్స్​ సొమ్ము చెల్లించామని మహేశ్​గౌడ్​ తెలిపారు. శనివారం సీనియర్​ నేతలు, డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నేతలతో మీటింగ్​ ఉంటుందన్నారు. సమావేశంలో ఏఐసీసీ ఇన్​చార్జి మాణిక్కం ఠాగూర్, పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి, పార్టీ నేతలు బోసురాజు, జగ్గారెడ్డి, గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, జీవన్ రెడ్డి పాల్గొన్నారు.