తత్కాల్‌ టికెట్లతో రైల్వేకు భారీ ఆదాయం

ఇండియన్  రైల్వేకు తత్కాల్ టికెట్లతో భారీగా ఆదాయం సమకూరుతోంది. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా  2020/21లో కూడా పెద్ద ఎత్తున ఆదాయం లభించింది. కరోనా నివారణ చర్యల్లో భాగంగా రైల్వే సర్వీసులను చాలా వరకు తగ్గించి నడిపించారు. దీంతో సహజంగానే తక్కువ టికెట్లు అందుబాటులో ఉంటాయి. దీంతో తత్కాల్ టికెట్లకు డిమాండ్ ఏర్పడిందంటున్నారు రైల్వే అధికారులు.

గడిచిన ఆర్థిక సంవత్సరంలో తత్కాల్ టికెట్ల రూపంలో రైల్వేకు రూ.403 కోట్లు సమకూరింది. ప్రీమియం తత్కాల్ టికెట్ల అమ్మకంతో  రూ.119 కోట్లు ఆదాయం లభించింది. మొత్తం మీద తత్కాల్ రూపంలో రూ.522 కోట్ల ఆదాయం చేకూరింది. ఇక డైనమిక్ ఫేర్ విధానం ద్వారా అదనంగా మరో రూ.511 కోట్లను రైల్వే శాఖ రాబట్టుకుంది. మధ్యప్రదేశ్ కు చెందిన చంద్రశేఖర్ గౌర్ సమాచార హక్కు చట్టం కింద రైల్వే శాఖ నుంచి ఈ సమాచారాన్ని సంపాదించి ప్రజల కోసం విడుదల చేశారు.

తత్కాల్ టికెట్లు ప్రయాణానికి ఒక రోజు ముందు అత్యవసరంగా తీసుకోవడానికి అందుబాటులో ఉండేవి. ప్రీమియం తత్కాల్  మరింత అదనపు చార్జీలతో అమ్ముతారు. తత్కాల్ లో వెయిటింగ్ లిస్ట్ పై టికెట్లు ఇస్తారు. ప్రీమియం తత్కాల్ లో కన్ఫర్మ్ డ్ టికెట్లనే జారీ చేస్తారు. డైనమిక్ ఫేర్ అంటే సంబంధిత మార్గంలో టికెట్లకు ఉన్న డిమాండ్ ఆధారంగా టికెట్ ధరలను అప్పటికప్పుడు పెంచుతూ, తగ్గిస్తూ కేటాయించేవి.

 

మరిన్ని వార్తల కోసం..

ఆత్మహత్యల రాష్ట్రంగా మారుతుంటే తమాషా చూస్తున్నారు