తెలంగాణలో రాగల మూడురోజులు ( సెప్టెంబర్ 10 నుంచి) భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌ని జారీ చేసింది. వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుందని, ఒడిశా పూరీకి తూర్పు ఆగ్నేయ దిశలో 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ కేంద్రం పేర్కొంది. వాయువ్య దిశగా పయనించి.. రాబోయే మూడుగంటల్లో ఒడిశా తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. ఒడిశా మీదుగా వెళ్తూ అదే తీవ్రతను కొనసాగిస్తూ సోమవారం అర్ధరాత్రి వరకు వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని చెప్పింది. రాబోయే 24 గంటల్లో ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఈ క్రమంలో మరో మూడు రోజుల పాటు ( సెప్టెంబర్ 10 నుంచి) కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ అతిభారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఇక ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని పేర్కొంది. రాజన్న సిరిసిల్ల, కొత్తగూడెం, ఖమ్మ, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసేందుకు అవకాశం ఉందని పేర్కొంది. మంగళవారం ( సెప్టెంబర్ 10 )ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో వానలు పడుతాయని చెప్పింది. బుధవారం( సెప్టెంబర్ 11 ) ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వివరించింది.