నారాయణపేట/అలంపూర్,, వెలుగు: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలకు పాతబడిన ఇండ్లు కూలిపోతున్నాయి. ఆస్తి నష్టం జరగడంతో ఆదుకోవాలని నిర్వాసితులు కోరుతున్నారు. ఇంకా ముసురు కొనసాగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నారాయణపేట్ జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మాగనూర్ మండలంలో కూలిన ఇళ్లను అధికారులు పరిశీలించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మండల కేంద్రంలోని చిన్నవాగు ఉప్పొంగింది. కృష్ణా నదిలో వరద పెరగనుందనే సమాచారంతో అధికారులు కృష్ణా మండలంలో తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.
మక్తల్ మండలంలో గుడిగండ్ల, కాచ్వార్ గ్రామాలలో ఒక్కో ఇళ్లు, మక్తల్ పట్టణంలో 4 మట్టి ఇళ్లు, మరికల్ మండలం పెద్దచింతకుంటలో పెంకుటిళ్లు కూలింది. కోస్గి పట్టణంలో పాత ఇళ్లను అధికారులు కూల్చివేశారు. కోస్గి ప్రభుత్వాస్పత్రి వెనక ఉన్న ఆంజనేయస్వామి దేవాలయం వర్షపు నీటిలో మునిగిపొయింది. ధన్వాడ మండలంలో యంనోనిపల్లి నుంచి కంసాన్పల్లి వెళ్లే దారిలో ఉన్న బ్రిడ్జిపై వరదనీరు చేరింది. ఊట్కూర్ మండలం పగిడిమారి నుంచి అమీన్పూర్ గ్రామాల మధ్య వాగు పొంగటంతో రాకపోకలు నిలిచిపోయాయి. బుధవారం ధన్వాడ మండలంలో అత్యధికంగా 6 సెం.మీ వర్షపాతం నమోదైంది.
గోడకూలి 12 గొర్రెలు మృతి
గద్వాల: జిల్లాలోని ఐజ మండలంలో అత్యధికంగా 62.6 ఎంఎం వర్షపాతం నమోదయింది. గుడిదొడ్డి వాగు తెగిపోవడంతో విఠలాపురం, ఎల్కూరు, మల్లెం దొడ్డి, చిప్పదొడ్డి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలంపూర్ మండలంలోని క్యాతూర్ గ్రామంలో గురువారం అర్ధరాత్రి కురిసిన వర్షాలకు పాత గోడ కూలి కురువ బలరాము, బాల స్వామికి చెందిన 12 గొర్రెలు మృతి చెందాయి. మానవపాడు మండలంలో అండర్ రైల్వే బ్రిడ్జి కింద నీరు నిలిచింది. ఐజ టౌన్ లో 16 వార్డులో దొరబాబు కు చెందిన మట్టిమిద్దె, మల్దకల్ మండల కేంద్రంలో ఇల్లు కూలిపోయింది.
మహబూబ్ నగర్ జిల్లాలో కూలిన 15 ఇండ్లు..
భారీ వర్షాలకు మహబూబ్ నగర్ జిల్లాలో 15 ఇండ్లు కూలిపోయాయి. జడ్చర్ల మండలంలో మూడు ఇండ్లు కూలిపోయాయి. చిన్న ఆదిరాల గ్రామానికి చెందిన ఒక ఇల్లు, లింగంపేటలో రెండు ఇండ్లు కూలిపోయాయి. మిడ్జిల్ మండలం పస్పుల గ్రామంలో, ఒకటి, చిన్నచింతకుంట మండలం అల్లీపూర్ గ్రామంలో మూడు ఇండ్లు కూలిపోయాయి. హన్వాడ మండల కేంద్రంలో మజీద్, పెద్దర్పపల్లి గ్రామంలో రెండు, పల్లెమోని కాలనీలో రెండు, టంకరలో రెండు ఇండ్లు కూలిపోయాయి. నవాబుపేట మండలం కారుకొండ, చిన్నారెడ్డిపల్లి గ్రామాల్లో ఇండ్లు కూలిపోయాయి. కూలిన ఇండ్లను తహసీల్దార్, ఆర్ఐలు పరిశీలించారు. వాగుల వద్ద పోలీసులు గస్తీ కాస్తున్నారు.
చిన్నచింతకుంట మండలంలోని పెద్దచెరువు నుంచి భారీగా అలుగుపారుతుండడంతో మద్దూరు గ్రామంలోని బలిజవానికుంట తెగిపోయింది. దీంతో30 ఎకరాల పంటపొలాలు నీటమునిగాయి.
నాగర్ కర్నూల్ జిల్లాలో ..
జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మూడు ఇండ్లు కూలిపోయాయి. దాదాపు 30 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చుక్కాయపల్లి చెరువు అలుగు పారుతోంది. డిండి వాగుకు ప్రవాహం మొదలైంది.కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి మండలాల్లో వరి నారు నీట మునిగింది. పెద్దకొత్త పల్లి మండలం జగన్నాథ పురంలో బుధవారం రెండు ఇండ్లు కూలిపోయాయి. దాదాపు రూ. 6 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. తాడూరు మండలం యాదిరెడ్డిపల్లిలో మేకల వెంకటయ్య,నాగమ్మ,బేగం ఇండ్ల పై కప్పు పడిపోయింది. జిల్లాలో యావరేజ్ గా 3 సెం. మీ వర్షపాతం నమోదైంది. ఉప్పునుంతల మండలంలో దుందుభి నది ఉధృతంగా పారుతోంది. వర్షాలపై జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ అధికారులతో రివ్యూ నిర్వహించారు. తలకొండపల్లి మండలం చంద్రధన గ్రామంలో 3 ఇళ్లు, కడ్తాల్ మండలంలో 2 ఇళ్లు కూలిపోయాయి.
ALSO READ:కేసీఆర్ చెప్పినోళ్లకే కాంగ్రెస్‌లో టికెట్లు : ఎంపీ అర్వింద్
రామన్ పాడ్ గేట్లు ఎత్తివేత
వనపర్తి: వర్షాల కారణంగా పలు గ్రామాల్లో పాత ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మదనాపురం మండలంలో ఉన్న రామన్ పాడ్ రిజర్వాయర్ గేట్లు తెరిచి నీటిని కిందికి వదిలేశారు. పలుచోట్ల పత్తి చేన్లలో నీరు చేరింది. జిల్లాలో ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో చెరువులు నిండలేదు. అధికారులను మంత్రి నిరంజన్ రెడ్డి, కలెక్టర్ తేజస్ పవార్, ఎస్పీ రక్షిత మూర్తి అప్రమత్తం చేశారు.
భయం గుప్పిట్లో చిన్నోనిపల్లి వాసులు
గద్వాల, వెలుగు: నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలో ముంపునకు గురైన చిన్నోనిపల్లి వాసులు భయం గుప్పెట్లో కాలం వెల్లడిస్తున్నారు. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మూడు వాగుల నుంచి రిజర్వాయర్ కి నీళ్లు వస్తున్నాయి. దీంతో అర్ధరాత్రి ఇళ్లలోకి నీరు వచ్చి చేరుతుందనే ఆందోళనతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. మంగళ, బుధవారాలలో కురిసిన వర్షాలకు కొన్ని ఇండ్లు పడిపోవడంతో ఎక్కడ మిగతా ఇల్లు కూలిపోతాయన్న భయం మధ్య కాలాన్ని వెల్లదీస్తున్నారు.