నేత కార్మికుల కోసం వర్కర్‌‌‌‌‌‌‌‌ టూ ఓనర్‌‌‌‌‌‌‌‌ స్కీమ్‌‌‌‌

నేత కార్మికుల కోసం వర్కర్‌‌‌‌‌‌‌‌ టూ ఓనర్‌‌‌‌‌‌‌‌ స్కీమ్‌‌‌‌
  • తొలివిడతలో రాజన్న సిరిసిల్ల నేతన్నలకు అవకాశం 
  • 1104 మందికి లబ్ధి
  • గత ప్రభుత్వంలో పెద్దూర్‌‌‌‌‌‌‌‌లో 42 వీవింగ్‌‌‌‌ షెడ్ల నిర్మాణం 
  • ఒక్కో కార్మికునికి నాలుగు లూమ్స్ అప్పగించే చాన్స్‌‌‌‌

రాజన్నసిరిసిల్ల, వెలుగు: నేత కార్మికులను ఓనర్లుగా మార్చేందుకు సర్కార్​ దృష్టి పెట్టింది. గతంలో ఆగిపోయిన వర్కర్‌‌‌‌‌‌‌‌ టూ ఓనర్‌‌‌‌‌‌‌‌ పథకాన్ని మరింత పక్కాగా అమలుచేసేందుకు సర్కార్ సన్నాహాలు చేస్తోంది. తొలివిడతలో రాజన్న సిరిసిల్లలోనే అమలుచేసే అవకాశం ఉంది. గతంలో పెద్దూర్‌‌‌‌‌‌‌‌లో వీవింగ్‌‌‌‌ షెడ్ల నిర్మాణం పూర్తి కాగా వీటిలో పవర్‌‌‌‌‌‌‌‌ లూమ్స్‌‌‌‌ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ పథకం పట్టాలెక్కితే రాజన్న జిల్లాలో తొలి దశలో 1104 మందికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది. 

పూర్తయిన షెడ్ల నిర్మాణం 

నేత కార్మికుల కోసం వర్కర్ టూ ఓనర్ పథకంలో భాగంగా 2017లో సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పెద్దూర్ శివారులో రూ. 220 కోట్లతో 88 ఎకరాల్లో వీవింగ్ పార్క్ పనులు ప్రారంభించారు.  టీజీఐఐసీ ద్వారా 42 వీవింగ్ షెడ్లు, నాలుగు వార్పింగ్​ షెడ్ల నిర్మాణం పూర్తి చేశారు. వర్కర్లకు అందించే పవర్‌‌‌‌‌‌‌‌ లూమ్స్ మాత్రమే బిగించాల్సి ఉండగా.. వివిధ కారణాలతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో ఆ షెడ్లలో పవర్‌‌‌‌‌‌‌‌లూమ్స్‌‌‌‌ బిగించి నేత కార్మికులకు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 

కార్మికులు ఎంపిక ప్రక్రియ కోసం కసరత్తు

వర్కర్ టూ ఓనర్ పథకంలో భాగంగా నేత కార్మికుల ఎంపికను త్వరలో చేపట్టనున్నారు. దీనిపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. ఇటీవల చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, విప్ ఆది శ్రీనివాస్.. తదితరులు హైదరాబాద్‌‌‌‌లో సమావేశమయ్యారు. సిరిసిల్లలో దాదాపు 5వేల మంది నేత కార్మికులుండగా 2వేల మంది పేదరికంలో ఉన్నట్లు ప్రభుత్వ లెక్కలు ఉన్నాయి. తొలి విడతలో 1104 మంది కార్మికులను ఎంపిక చేసి ఓనర్లుగా మార్చేందుకు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. 

వర్కర్ టూ ఓనర్ పథకంలో భాగంగా ఒక యూనిట్ కింద రూ. 8లక్షల విలువైన నాలుగు లూమ్స్ అప్పగిస్తారు. ఒక్కో షెడ్డులో 8 లూమ్స్ బిగించనున్నారు. అంటే ఒక షెడ్డును ఇద్దరు కార్మికులకు కేటాయించనున్నారు. యూనిట్‌‌‌‌ విలువలో 50శాతం సబ్సిడీ, 40 శాతం బ్యాంకు లోన్‌‌‌‌, మరో 10శాతం లబ్ధిదారుడు చెల్లించేలా ప్రతిపాదనలు రెడీ చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ స్కీమ్​ను పట్టాలెక్కించే అవకాశముందని చేనేత జౌళిశాఖ ఆఫీసర్లు చెప్తున్నారు. 

వారంలో స్పష్టత వచ్చే అవకాశం  

ఎన్నికల కోడ్ ముగిశాక వర్కర్‌‌‌‌‌‌‌‌ టూ ఓనర్‌‌‌‌‌‌‌‌ స్కీమ్‌‌‌‌ను ప్రారంభించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆదేశాలతో కార్మికుల ఎంపికపై కసరత్తు జరుగుతోంది. మరో వారంలో పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. లూమ్స్ బిగించడానికి కొన్ని కంపెనీలు ముందుకు వస్తుండగా.. వాటితో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. - అశోక్ రావు, టెస్కో జనరల్ మేనేజర్