ఆర్‌‌‌‌‌‌‌‌ఆర్ మళ్లీ అవుతుందా విన్నర్‌‌‌‌‌‌‌‌!..మరో 7 రోజుల్లో ఐపీఎల్-18

 ఆర్‌‌‌‌‌‌‌‌ఆర్ మళ్లీ అవుతుందా విన్నర్‌‌‌‌‌‌‌‌!..మరో 7 రోజుల్లో ఐపీఎల్-18

వెలుగు స్పోర్ట్స్ డెస్క్ : ఆస్ట్రేలియా స్పిన్ లెజెండ్, దివంగత షేన్ వార్న్ కెప్టెన్సీలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తొలి సీజన్‌‌‌‌లో టైటిల్ నెగ్గిన జట్టు రాజస్తాన్ రాయల్స్‌‌‌‌. నాడు ఎలాంటి అంచనాలు లేకపోయినా అద్భుత ఆటతో చాంపియన్‌‌గా నిలిచిన ఆర్ఆర్‌‌‌‌‌‌‌‌  రెండో టైటిల్ కోసం నిరీక్షిస్తునే ఉంది. సంజూ శాంసన్ కెప్టెన్సీలో గత కొన్ని సీజన్లలో అత్యంత నిలకడైన ఆట చూపెడుతున్న రాయల్స్‌‌‌‌ 2022లో ఫైనల్ చేరినా ట్రోఫీ నెగ్గలేకపోయింది.

2025 సీజన్‌‌కు ముందు రాయల్స్‌‌‌‌ అత్యధికంగా ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకొని కోర్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌ను నిలబెట్టుకుంది.  వేలంలో జోఫ్రా ఆర్చర్‌‌‌‌‌‌‌‌, నితీష్ రాణా, మహేశ్ తీక్షణ, హసరంగ వంటి టాలెంటెడ్ ప్లేయర్లతో జట్టును బలోపేతం చేసుకొని 18వ సీజన్‌‌‌‌కు రెడీ అయింది. రాహుల్ ద్రవిడ్ మార్గనిర్దేశంలో  ఈసారి కచ్చితంగా టైటిల్ సాధించాలని 
తహతహలాడుతోంది.   

బలమైన టాపార్డర్‌‌‌‌‌‌‌‌, పదునైన బౌలింగ్ విభాగం

రాయల్స్ జట్టులో బ్యాటింగ్ విభాగం అత్యంత శక్తివంతంగా ఉంది. టాప్‌‌‌‌–3లోని యశస్వి జైస్వాల్, సంజు  శాంసన్‌‌‌‌, నితీశ్ రాణా ముగ్గురూ డేరింగ్, డ్యాషింగ్‌‌‌‌ బ్యాటర్లే. లీగ్‌‌‌‌లో తగినంత అనుభవం ఉంది. పవర్‌‌‌‌‌‌‌‌ ప్లేలో జైస్వాల్ దంచికొడితే..  శాంసన్, రాణా పరిస్థితులకు తగ్గట్టుగా ఆడగలరు. మిడిలార్డర్‌‌‌‌‌‌‌‌లోనూ ఆర్‌‌‌‌‌‌‌‌ఆర్ బ్యాటింగ్ బలంగానే ఉంది. రియాన్ పరాగ్ గత సీజన్‌‌‌‌లో తన మెరుపు బ్యాటింగ్‌‌‌‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈసారి కూడా అతనిపై భారీ అంచనాలున్నాయి. ఫినిషింగ్ బాధ్యతను ప్రధానంగా హెట్‌‌‌‌మయర్ తీసుకుంటాడు.

అతని దూకుడైన ఆట క్షణాల్లో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలదు. ధ్రువ్ జురేల్, శుభం దూబే  వంటి యువ ఆటగాళ్లు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే జట్టుకు మరింత లాభం కలుగుతుంది.  బౌలింగ్‌‌‌‌లో ఆర్చర్, సందీప్ శర్మ, ఫరూకీ, హసరంగ, తీక్షణ మంచి ప్రతిభ, అనుభవం ఉన్న వారే. ఆర్చర్ తన యార్కర్లతో ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు. హసరంగ, తీక్షణ మిడిల్ ఓవర్లలో స్పిన్ బౌలింగ్‌‌‌‌తో మ్యాచ్‌‌‌‌ను మలుపు తిప్పగలరు. 

డెత్ ఓవర్ల బౌలింగ్‌‌‌‌లో డీలా

ఓవరాల్‌‌‌‌గా ఆర్‌‌‌‌‌‌‌‌ఆర్ ప్రభావవంతంగానే కనిపిస్తున్నా కొన్ని ప్రధాన సమస్యలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా డెత్ ఓవర్లలో బౌలింగ్ రాజస్తాన్‌‌‌‌‌‌‌‌కు తలనొప్పిగా మారొచ్చు. సందీప్ శర్మ గత సీజన్‌‌‌‌లో 10.16 ఎకానమీ రేటుతో మరీ ఎక్కువ పరుగులు ఇచ్చాడు. ఫామ్‌‌‌‌ కోల్పోయిన ఆర్చర్ గతంలో మాదిరిగా ప్రత్యర్థులను  భయపెట్టే బౌలర్‌‌‌‌గా కనిపించడం లేదు. ఫరూకీ  టీమ్‌‌‌‌కు కొత్త  బౌలర్ కావడంతో తను ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటాడో చూడాలి.

 ఇక ఫినిషర్‌‌‌‌గా హెట్‌‌‌‌మయర్ తప్ప మరో నమ్మదగిన ఆటగాడు లేకపోవడం ఇంకో సమస్య. తను గాయపడినా.. ఫామ్ కోల్పోయినా చివరి ఓవర్లలో రన్స్ చేయడం కష్టతరం అవుతుంది. జోఫ్రా ఆర్చర్ ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ ఎప్పుడూ ప్రశ్నార్థకంగానే ఉంటుంది. ఒకవేళ శాంసన్‌‌‌‌, జైస్వాల్ గాయపడితే  వాళ్లకు సరైన బ్యాకప్ లేదు. ఒకవేళ13 ఏండ్ల యంగ్‌‌‌‌ సెన్సేషన్  వైభవ్ సూర్యవంశీపై ఆధారపడాల్సి వస్తే  అది టీమ్‌‌పై ఒత్తిడిని పెంచే అంశమే కానుంది.  

ఎంతదూరం

కోర్ టీమ్‌‌‌‌ అలానే ఉండటం, కొత్తగా పలువురు మేటి ఆటగాళ్లు రావడంతో ఈసారి రాజస్తాన్‌‌‌‌ రాయల్స్‌‌‌‌కు ట్రోఫీ గెలిచే అద్భుతమైన అవకాశం ఉంది. టీమ్ టాపార్డర్ మెరుగ్గా ఉండగా.. బౌలింగ్‌‌‌‌ విభాగం కూడా సమతూకంలో కనిపిస్తోంది. శాంసన్ కెప్టెన్సీ జట్టుకు అదనపు బలం. గత మూడు సీజన్లలో  రెండుసార్లు టీమ్‌‌‌‌ను ప్లే ఆఫ్స్ చేర్చాడు.  ఆర్‌‌‌‌‌‌‌‌ఆర్ ఈసారి కూడా  ప్లేఆఫ్స్‌‌‌‌ చేరితే టైటిల్ కోసం గట్టిగా ప్రయత్నించొచ్చు.  ముఖ్యంగా రియాన్ పరాగ్, హెట్‌‌‌‌మయర్, జైస్వాల్, ఆర్చర్ లాంటి ఆటగాళ్లు అంచనాలను అందుకొని, తమ సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో కనబరిస్తే టైటిల్ గెలుచుకోవడం కష్టమేమీ కాబోదు.  

రాజస్తాన్ రాయల్స్ జట్టు

బ్యాటర్లు: యశస్వి జైస్వాల్,  రియాన్ పరాగ్, షిమ్రన్ హెట్‌‌‌‌మయర్, శుభమ్ దూబే, వైభవ్ సూర్యవంశీ;  వికెట్ కీపర్లు: సంజూ శాంసన్  (కెప్టెన్‌‌‌‌), ధ్రువ్ జురెల్, కునాల్ రాథోడ్‌‌‌‌;   ఆల్‌‌‌‌రౌండర్లు: నితీశ్ రాణా, యుధ్‌‌‌‌వీర్ సింగ్‌‌‌‌;  


స్పిన్నర్లు: హసరంగ, తీక్షణ, కుమార్ కార్తికేయ. ఫాస్ట్ బౌలర్లు: జోఫ్రా ఆర్చర్,  సందీప్ శర్మ , ఆకాశ్ మధ్వాల్, తుషార్ దేశ్‌‌‌‌పాండే, ఫజల్‌‌‌‌హక్‌‌‌‌ ఫరూకీ, క్వెనా మఫాకా, అశోక్ శర్మ.