సచిన్ రికార్డ్ బ్రేక్ చేసిన పటిదార్: IPL హిస్టరీలోనే రెండో భారత బ్యాటర్‎గా అరుదైన ఘనత

సచిన్ రికార్డ్ బ్రేక్ చేసిన పటిదార్: IPL హిస్టరీలోనే రెండో భారత బ్యాటర్‎గా అరుదైన ఘనత

బెంగుళూర్: రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (ఆర్సీబీ) కెప్టెన్ రజత్ పటిదార్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‎లో కేవలం 30 ఇన్నింగ్స్‌ల్లోనే 1000 పరుగులు పూర్తి చేశాడు. శుక్రవారం (ఏప్రిల్ 18) పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పటిదార్ ఈ ఫీట్ నెలకొల్పాడు. తద్వారా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డ్‎ను పటిదార్ బద్దలుకొట్టాడు.

ఐపీఎల్‎లో సచిన్ 31 ఇన్నింగ్స్‌లలో 1000 పరుగులు పూర్తి చేయగా.. పటిదార్ 30 ఇన్సింగ్స్‎ల్లోనే ఈ మైలురాయి అందుకుని మాస్టర్ బ్లాస్టర్ రికార్డ్‎ను బ్రేక్ చేశాడు. ఓవరాల్‎గా ఐపీఎల్‎లో అత్యంత వేగంగా ఈ మైలురాయిని చేరుకున్న రెండవ భారతీయుడిగా పటిదార్ నిలిచాడు.

పటిదార్ కంటే ముందు గుజరాత్ బ్యాటర్ సాయి సుదర్శన్ ఉన్నాడు. సాయి సుదర్శన్ కేవలం 25 ఇన్సింగ్స్‎ల్లోనే 1000 రన్స్ పూర్తి చేశాడు. అయితే,  ఐపీఎల్ చరిత్రలో 35 కంటే ఎక్కువ సగటు, 150 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 1000 పరుగులు సాధించిన మొదటి భారతీయ బ్యాట్స్‌మన్ మాత్రం పటిదారే.

ఐపీఎల్‎లో అత్యధిక ఫ్యాన్ బేస్ కలిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు (ఆర్సీబీ) కెప్టెన్‎గా ఈ ఏడాది రజత్ పటిదార్ నియామకమైన విషయం తెలిసిందే. ఆర్సీబీ యజమాన్యం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని పటిదార్ నిలబెట్టుకుంటున్నాడు. కెప్టెన్సీతో పాటు ఇటూ బ్యాటింగ్‎లో రాణిస్తూ ఆర్సీబీ విజయాల్లో కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఆరు ఇన్సింగ్స్‎ల్లో 157 స్ట్రైక్ రేట్‎తో 209 రన్స్ చేశాడు. 

ఇక, పటిదార్ కెప్టెన్సీలో ఈ సీజన్లో ఇప్పటి వరకు 7 మ్యాచులు ఆడిన ఆర్సీబీ నాలుగు విజయాలు సాధించి.. మూడింట్లో ఓటమి పాలైంది. ప్రత్యర్థి వేదికలపై విజయాలు సాధించిన ఆర్సీబీ.. సొంతగడ్డపై ఆడిన మూడు మ్యాచుల్లో ఓటమి పాలుకావడం గమనార్హం. ఈ సీజన్లో ఇప్పటివరకు ఆర్సీబీ గెలిచిన నాలుగు మ్యాచులు కూడా ప్రత్యర్థుల హోంగ్రౌండ్‎లోనే కావడం విశేషం. 

కాగా, ఐపీఎల్‌‌18వ సీజన్‌‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వింతగా ఆడుతోంది. ప్రత్యర్థి వేదికల్లో ఆడిన నాలుగు మ్యాచ్‌‌ల్లోనూ గెలిచిన ఆర్సీబీ సొంతగడ్డపై ఇంకా గెలుపు రుచి చూడలేకపోయింది. చిన్నస్వామి స్టేడియంలో మూడో పోరులోనూ ఆ జట్టు పల్టీ కొట్టింది. శుక్రవారం (ఏప్రిల్ 18) రాత్రి వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌‌లో ఆల్‌‌రౌండ్ పెర్ఫామెన్స్‌‌తో ఆకట్టుకున్న పంజాబ్ కింగ్స్‌‌ 5  వికెట్ల తేడాతో ఆర్సీబీని ఓడించి ఐదో విజయం ఖాతాలో వేసుకుంది.