
- చూపు సరిగ్గా లేకపోవడంతో పదో తరగతి వరకు చదివి ఇంటికే పరిమితమయ్యాడు.
- ఎంత ప్రయత్నించినా మంచి ఉద్యోగం దొరకలేదు. చివరికి ఓ ఫ్యాక్టరీలో
- సెక్యూరిటీ గార్డ్‌గా పనిలో చేరాడు రాజేష్ కుమార్. కానీ.. ఆ చాలీచాలని జీతంతో
- బతుకుబండిని నడపడం కష్టమైంది. అందుకే తనకున్న కొద్ది పొలంలోనే గులాబీ
- సాగు చేశాడు. పూలతో రకరకాల ప్రొడక్ట్స్ తయారుచేసి అమ్ముతూ.. నెలకు
- రూ. 50 వేలకు పైగా సంపాదిస్తున్నాడు.
రాజేష్ కుమార్ 1985లో హర్యానాలోని హింద్వాన్ గ్రామంలో ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టాడు. అతనికి పుట్టుకతోనే రెటినిటిస్ పిగ్మెంటోసా, మాక్యులర్ డీజనరేషన్ అనే కంటి వ్యాధులు ఉన్నాయి. మామూలుగా అందరి కళ్లు 180 డిగ్రీల పరిధి వరకు చూడగలవు. కానీ.. రాజేష్ కళ్లు 10 డిగ్రీల వరకు మాత్రమే చూడగలవు. అంటే చిన్న గొట్టంలో నుంచి చూసినట్టు కనిపిస్తుంది. ఈ సమస్య వల్ల అతను చిన్నప్పటి నుంచి చదువులో వెనుకబడ్డాడు. తన పనులు తాను చేసుకోవడంలో కూడా చాలా ఇబ్బంది పడేవాడు. అందుకే పదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు.
ఉద్యోగం దొరకలేదు
దృష్టి లోపం వల్ల అతనికి మంచి ఉద్యోగం దొరకలేదు. ఒక ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా పనిలో కుదిరాడు. దాంతోపాటు కార్లు కడగడం లాంటి చిన్న చిన్న పనులు కూడా చేసేవాడు. అతనికి వచ్చే జీతం బతకడానికి ఏమాత్రం సరిపోయేది కాదు. ఎన్ని పనులు చేసినా నెలకు రూ. 5,000 మాత్రమే వచ్చేవి. ఆ డబ్బుతో భార్య సునీత, ఇద్దరు పిల్లలను పోషించడం కష్టమైంది. అందులో ఎక్కువ భాగం కిరాణా సామాన్లు, పాల బిల్లు కట్టేందుకే సరిపోయేది. ‘‘నా పిల్లలు పెన్సిళ్లు, నోట్‌బుక్స్ అడిగినప్పుడు, కొనిచ్చే స్థోమత లేక చాలా బాధపడేవాడిని” అంటూ గతాన్ని గుర్తు చేసుకున్నాడు రాజేష్.
గులాబీ సాగుతో..
దృష్టి లోపం అతన్ని ఎన్నో ఇబ్బందులు పెట్టింది. కానీ.. సక్సెస్‌ని మాత్రం ఆపలేకపోయింది. ఎన్ని కష్టాలు వచ్చినా జీవితంలో ఎలాగైనా ఎదగాలి అనే ఆశయాన్ని మాత్రం వదులుకోలేదు రాజేష్. సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నప్పుడు అతనికి ఒక తోటమాలి పరిచయం అయ్యాడు. అతనితో మాట్లాడుతున్నప్పుడు రాజేష్‌కు ఒక ఐడియా వచ్చింది. ఆ తోటమాలి రాజేష్‌తో పొలంలో 1,000 గులాబీ మొక్కలు నాటే పని ఉందని చెప్పాడు. దాంతో రాజేష్ గులాబీల పెంపకం, మార్కెట్లో డిమాండ్ గురించి అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నాడు.
రాజేష్‌కు ఆరు కనాల్‌లు
(1 కనాల్ = 0.125 ఎకరాలు) భూమి ఉంది. అందులో పూల మొక్కలు సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. మొదటి ప్రయత్నంలో భాగంగా 2015లో బంతి సాగు చేశాడు. గులాబీతో పోలిస్తే.. బంతి సాగుకు చాలా తక్కువ పని ఉంటుంది. ఈజీగా మార్కెట్ చేసుకోవచ్చు. కాకపోతే లాభాలు తక్కువ. సాగులో అనుభవం వచ్చాక మరుసటి సంవత్సరం బంతి చెట్ల మధ్యలో వెయ్యి గులాబీ మొక్కల్ని నాటాడు. అందుకోసం పెట్టుబడిగా రూ.30 వేలు ఖర్చు చేశాడు. 2016 అక్టోబర్ నాటికి గులాబీలు వికసించడం మొదలైంది. ఆ తర్వాత రాజేష్ ఆదాయం రెట్టింపయ్యింది. ఫ్రెష్ గులాబీలను అమ్మడం ద్వారా రోజుకు రూ. 300 సంపాదించాడు. అంటే నెలకు రూ. 9,000 వరకు వచ్చేవి.
కుటుంబం సాయంతో..
రాజేష్‌కు దృష్టి లోపం ఉండడం వల్ల పొలం పనులు, మార్కెటింగ్, డెలివరీ మాత్రమే చూసుకుంటున్నాడు. మొక్కలను దగ్గరగా చూడడం కష్టమైనప్పటికీ అతను స్పర్శ, వినికిడి ద్వారా పనులను చేస్తుంటాడు. “నేను మొక్కలను తాకి వాటి ఆరోగ్యాన్ని అంచనా వేస్తాను. నా భార్య, పిల్లలు నాకు కళ్లుగా మారి సాయం చేస్తున్నారు” అంటున్నాడు రాజేష్. భార్య సునీత, పిల్లలు అతనికి ప్రతి పనిలో అండగా ఉంటున్నారు. పిల్లలు రోజూ ఉదయం స్కూలుకు వెళ్లే ముందు పొలంలో పూలు కోస్తారు. భార్య కలుపు తీయడం లాంటి పనులు చేస్తుంది.
మధ్యాహ్నం సునీత గులాబీ ప్రొడక్ట్స్ తయారుచేస్తుంది. పిల్లలు స్కూలు నుంచి వచ్చాక వాటి ప్యాకేజింగ్, లేబులింగ్ చేస్తారు. లాభాలు పెరగడంతో 2018 నాటికి గులాబీ తోటను మరో రెండు కనాల్ల(సుమారు అరెకరం)లో వేశాడు. గతంతో పోలిస్తే.. దిగుబడి పెరిగింది. పెద్ద మొత్తంలో ప్రొడక్ట్స్ తయారుచేస్తున్నారు. రాజేష్ 2020లో తన కూతురు పేరు మీద ‘పరేరణ ఫ్లవర్ ఫామ్’ అనే బ్రాండ్‌ను స్థాపించాడు. హర్యానా, లూధియానా, చండీగఢ్‌లలో తన ప్రొడక్ట్స్ ఎక్కువగా అమ్ముతున్నాడు. ప్రస్తుతం అతనికి నెలకు రూ. 50,000కి పైగానే ఆదాయం వస్తోంది.
ఫ్లవర్ ప్రొడక్ట్స్
గులాబీ తోట పెట్టిన మొదట్లో రాజేష్ కేవలం పూలు మాత్రమే అమ్మేవాడు. ఒకసారి తన పిల్లలు చదువుకునే స్కూల్లో టీచర్లు ఇచ్చిన సలహాతో వాటిని ప్రాసెస్ చేసి అమ్మడం మొదలుపెట్టాడు. ముందుగా రోజ్ వాటర్ తయారుచేశాడు. తర్వాత కొన్నాళ్లకు గుల్కండ్ (గులాబీ జామ్) చేసి, మార్కెట్లో అమ్మాడు. ముఖ్యంగా లోకల్ స్కూళ్లలో, వాళ్ల గ్రామస్తులు గుల్కండ్ని ఎక్కువగా కొన్నారు. అదే టైంలో రాజేష్ హర్యానా అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి గులాబీల ప్రాసెసింగ్ మీద ట్రైనింగ్ తీసుకున్నాడు. అప్పటినుంచి రోజ్ షర్బత్, రోజ్ హెయిర్ ఆయిల్, రోజ్ బాత్ సోప్ లాంటివి కూడా తయారుచేస్తున్నాడు. స్థానిక అధికారులు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ ఇవ్వడంలో సాయం చేశారు. అప్పటినుంచి మార్కెటింగ్ పెంచాడు.
సేంద్రియ పద్ధతిలో..
సాగులో సక్సెస్ అయ్యాక సేంద్రియ వ్యవసాయ పద్ధతులకు మారాడు. నేలను సారవంతం చేయడానికి ఆవు పేడ, వర్మీకంపోస్ట్‌తో పాటు ఆవాలు, వేరుశనగ నుంచి నూనె తీసిన తర్వాత మిగిలే వేస్ట్‌ని పంటకు వేశాడు. తెగుళ్ళను అరికట్టడానికి ఒక సేంద్రియ మిశ్రమాన్ని తయారుచేశాడు. ఈ పురుగుమందుని లస్సీ, ఆవు మూత్రం, బెల్లం లాంటివి కలిపి తయారుచేస్తారు.
తక్కువ భూమిలో ఎక్కువ లాభం
సాగు మొదలుపెట్టిన కొత్తలో పూలు అమ్మితే పెద్దగా లాభాలు రావని చాలామంది అన్నారు. కొందరైతే నాపై జాలిపడి తిరిగి చిన్న చిన్న ఉద్యోగాలు వెతుక్కోవాలని సలహాలు ఇచ్చారు. కానీ.. నేను మాత్రం ఎలాగైనా పూల సాగులో సక్సెస్ కావాలని నిర్ణయించుకున్నా. ఎందుకంటే తక్కువ భూమిలో ఎక్కువ లాభాలు తీసుకోవడానికి నాకు అదొక్కటే మార్గంగా కనిపించింది. పట్టుదలతో సాగు చేశా. చివరకు సాధించా” అంటూ చెప్పుకొచ్చాడు రాజేష్.