ఎన్ఎస్పీ ఆయకట్టుకు గోదావరి జలాలు

ఎన్ఎస్పీ ఆయకట్టుకు గోదావరి జలాలు
  • గోదావరి, కృష్ణ జలాలు కలిసేందుకు వారధిగా రాజీవ్​ కెనాల్​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ఖమ్మం జిల్లాలోని ఎన్ఎస్పీ ఆయకట్టుకు ఊపిరి పోసేందుకు భద్రాద్రికొత్తగూడెం జిల్లా నుంచి గోదారమ్మ పరుగులు పెడుతోంది. గతనెల 27న అశ్వాపురం నుంచి బయల్దేరిన గోదావరి జలాలు రెండు​, మూడు పంప్​ హౌజ్​ ల వద్ద ఆగుతూ ఎనిమిది రోజులకు ఎన్ఎస్పీ కెనాల్​కు చేరుకున్నాయి. దీనికి వారధిగా రాజీవ్ కెనాల్​ నిలిచింది. గురువారం రాజీవ్​ కెనాల్​ వద్ద​ కృష్ణమ్మను గోదారమ్మ చేరుకున్న క్షణాలు తమకు మధుర స్మృతులంటూ పలువురు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

‘సీతారామ’ మొదటి పంప్​ హౌజ్ ​నుంచి.. 

భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని బీజీ కొత్తూరు ప్రాంతంలో నిర్మించిన సీతారామ లిఫ్ట్​ ఇరిగేషన్​ మొదటి పంప్​ హౌజ్​నుంచి గతనెల 27న గోదావరి జలాలు విడుదల చేశారు. ములకలపల్లి మండలం పూసుగూడెంలో నిర్మించిన రెండో పంప్​ హౌజ్​ నుంచి కమలాపురంలోని మూడో పంప్​ హౌజ్​కు సోమవారం చేరుకున్నాయి. పూసుగూడెం, కమలాపురం నుంచి నీటి విడుదలను అగ్రికల్చర్​ మినిస్టర్​ తుమ్మల నాగేశ్వరరావు పర్యవేక్షించారు. 

మూడో పంప్​ హౌజ్​ నుంచి గోదావరి జలాలకు జూలూరుపాడు మండలంలోని వినోభానగర్​ వద్ద బుధవారం రాత్రి మంత్రి తుమ్మలతో పాటు వైరా ఎమ్మెల్యే రాందాస్​నాయక్, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం కలెక్టర్లు జితేశ్​వి పాటిల్, ముజామ్మిల్ ఖాన్, రైతులు స్వాగతం పలికి పూజలు చేశారు. ఇక్కడ నుంచి ఖమ్మం జిల్లాలోని ఎన్కూర్​ లింక్​ కెనాల్​(రాజీవ్​ లింక్​ కెనాల్​) ద్వారా సాగర్​ ఎడమ కాల్వకు గోదావరి జలాలు గురువారం చేరుకున్నాయి. రాజీవ్​ కెనాల్​ నుంచి 52 గేట్​ వద్ద ఎన్ఎస్పీ కెనాల్​లో గోదావరి నీళ్లు కృష్ణ కాల్వల్లో కలుస్తున్నాయి. సీతారామ ప్రాజెక్ట్​ ఎత్తిపోతల పథకం ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు 1.30లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని తుమ్మల తెలిపారు. 

కష్టకాలంలో ‘గోదారమ్మ’ ఊపిరి.. 

ప్రతీ మూడు నాలుగేండ్లకోసారి సాగర్​ నీళ్లు రాక ఎన్ఎస్పీ కెనాల్​ఆయకట్టు రైతులు యాసంగిలో ఇబ్బందులు పడేవారు. వానాకాలం పంటల సాగుకూ సాగర్​ నీళ్లు ఆగస్టు 25 తర్వాతనే వస్తాయి. దీంతో పంటల సాగు కొంత ఆలస్యమయ్యేది. గోదావరి జలాలు ఎన్ఎస్పీ కాల్వలోకి సరైన సమయంలో రావడంతో ఖమ్మం జిల్లాలోని వైరా, కల్లూరు కెనాల్​ పరిధిలోని వేలాది ఎకరాల్లోని యాసంగి పంటలకు ఢోకా లేదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

పాములేరు వాగుకు మళ్లించాలి.. 

ముల్కలపల్లి మండలంలోని పూసుగూడెం, కమలాపురం ప్రాంతాల్లో సీతారామ లిఫ్ట్​ ఇరిగేషన్​ రెండు, మూడో పంప్​ హౌజ్​లు ఉన్నాయి. కానీ ఈ మండలంలోని రైతులకు గోదావరి జలాలు అందని ద్రాక్షగా మారాయి. పూసుగూడెం నుంచి కమలాపురం పంప్​ హౌజ్​ వెళ్లే దారిలోని రామాంజనేయపురం ప్రాంతంలో గల పాములేరు వాగులోకి గోదావరి జలాలను వదిలితే మాదారం, ముల్కలపల్లి, పొగళ్లపల్లి, రింగరెడ్డపల్లి, తదితర ప్రాంతాల్లో ని దాదాపు 200 ఎకరాల్లో యాసంగి సాగుకు ఊతమిచ్చినట్లవుతోంది. వాగుపై పలు చోట్ల చెక్​ డ్యామ్​లు ఉన్నాయి. వాగును నమ్ముకొని రైతులు వరితో పాటు మొక్కజొన్న నాటు పొగాకు, వేరుశనగ సాగు చేశారు. వాగులోని నీళ్లు రోజు రోజుకు ఇంకిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి గోదావరి జలాలను వాగులోకి మళ్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

భవిష్యత్​లో 28 గంటల్లోపే.. 

అశ్వాపురం నుంచి గోదావరి జలాలు ఖమ్మం జిల్లాకు చేరుకునేందుకు ప్రస్తుతం 70 గంటలకు పైగా టైం పట్టింది. అశ్వాపురం నుంచి రాజీవ్​ కెనాల్​ ద్వారా ఎన్​ఎస్పీ కెనాల్​ వరకు దాదాపు 100.4  చైనేజ్​ దూరం ఉంది.  ఈ మధ్యలో గల కాల్వలను అన్ని సరి చేస్తే భవిష్యత్​లో కేవలం 28 గంటల లోపే ఖమ్మం జిల్లాలోని ఎన్ఎస్పీ కాల్వలకు గోదావరి జలాలు చేరుకునే అవకాశాలున్నాయని ఇరిగేషన్​ ఆఫీసర్లు పేర్కొంటున్నారు. కాగా, భద్రాద్రికొత్తగూడెం జిల్లా నుంచి ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలు చేరుకోవడంలో సీఎం రేవంత్​ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క​తోపాటు మంత్రులు కొమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి సహకారం మరువలేనిదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.