రాజీవ్ యువ వికాసం అప్లికేషన్లు 2 లక్షలు..ఏప్రిల్ 5వ తేదీ వరకు గడువు

రాజీవ్ యువ వికాసం అప్లికేషన్లు 2 లక్షలు..ఏప్రిల్ 5వ తేదీ వరకు గడువు
  • వచ్చే నెల 6 నుంచి 30 వరకు అప్లికేషన్ల పరిశీలన 
  • మండల స్థాయి కమిటీలకు లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలు

హైదరాబాద్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల స్వయం ఉపాధి కోసం తెచ్చిన రాజీవ్ యువ వికాసం స్కీమ్‌‌కు భారీ స్పందన వస్తున్నది. ఈ నెల 17 నుంచి శుక్రవారం నాటికి మొత్తం 2 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయని అధికారులు తెలిపారు. వచ్చే నెల 5వ తేదీ వరకు ఈ స్కీమ్‌‌కు దరఖాస్తు చేసేకునేందుకు వెసులుబాటు కల్పించారు. ఈ నేపథ్యంలో మొత్తం 5 లక్షల వరకు అప్లికేషన్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తున్నది.

దరఖాస్తులను ప్రభుత్వం ఆన్‌‌లైన్‌‌ ద్వారా సేకరిస్తున్నది. లబ్ధిదారుల యూనిట్ల కోసం రూ.6 వేల కోట్ల దాకా ఖర్చు చేస్తామని ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ స్కీమ్ అమలు కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్లకు ఆ మేరకు ఫండ్స్ కేటాయించింది.

లబ్దిదారుల ఎంపిక బాధ్యత కలెక్టర్లకు..

జిల్లాల్లో రాజీవ్ యువ వికాసం స్కీమ్ లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలను ప్రభుత్వం కలెక్టర్లకు అప్పగించింది. ఏప్రిల్‌‌ 6వ తేదీ నుంచి 30 వరకు అప్లికేషన్లను అధికారులు పరిశీలించనున్నారు. మరోవైపు, మండల స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీలు అర్హుల ఎంపిక పూర్తి చేసి జిల్లా స్థాయి కమిటీలకు జాబితాను అందజేస్తాయి.

కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి కమిటీ ఈ జాబితాలను పరిశీలించి, మే 21 నుంచి 31 వరకు యూనిట్లను మంజూరు చేస్తుంది. అనంతరం జిల్లా కలెక్టర్లు లబ్ధిదారుల ఎంపిక వివరాలను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ శాఖలకు అందజేస్తారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లబ్ధిదారులకు ప్రభుత్వం చెక్కుల పంపిణీ ప్రారంభించి, 9వ తేదీ వరకు ఇవ్వనుంది. 

ఇవీ గైడ్ లైన్స్..

వ్యవసాయేతర పథకాలకు లబ్ధిదారుల వయసు 2025 జులై 1 నాటికి 21 – -55 ఏండ్లు ఉండాలివ్యవసాయ, వ్యవసాయ ఆధారిత పథకాలకు 21 – 60 ఏండ్ల మధ్య వయసు ఉండాలిదరఖాస్తుదారులు ప్రతిపాదించిన యూనిట్ ధర ఆధారంగా వివిధ స్థాయిల్లో సబ్సిడీ రూ.50 వేల యూనిట్లను 100% సబ్సిడీ, రూ.50 వేల నుంచి రూ.లక్ష మధ్య ఉన్న యూనిట్లకు 90%, రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు 80%, రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు 70% రాయితీ ఇవ్వనున్నారు. మిగిలిన మొత్తం బ్యాంకు లోన్ల ద్వారా అందిస్తారు. కుటుంబంలో ఒక్కరికే ఈ పథకం వర్తిస్తుంది.