
- ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,48,618 అప్లికేషన్లు
- జూన్ 2 నుంచి పథకాన్ని అమలు చేసేలా ప్రభుత్వం ప్లాన్
ఖమ్మం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజీవ్ యువ వికాసం అప్లికేషన్ల స్క్రూటినీపై అధికారులు దృష్టిపెట్టారు. ఈనెలాఖరులోపు మొత్తం దరఖాస్తుల్లో అర్హులను ఎంపిక చేయాలని నిర్ణయించారు. అర్హులకు జూన్ 2 న రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తుండడంతో, ఈ లోగానే ప్రాసెస్ పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఈ పథకానికి మొత్తం 1,48,618 దరఖాస్తులు రాగా, ఖమ్మం జిల్లాలో 91,850, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 56,768 అప్లికేషన్లు వచ్చాయి.
వాటి పరిశీలనలో భాగంగా ఖమ్మం జిల్లాలో నియోజకవర్గానికి ఒకరి చొప్పున స్పెషలాఫీసర్లకు బాధ్యతను అప్పగించారు. ఖమ్మం నియోజకవర్గానికి జడ్పీ సీఈఓ దీక్షా రైనా, పాలేరుకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎం.రాజేశ్వరి, మధిరకు జిల్లా పంచాయతీ అధికారిణి ఆశాలత, వైరాకు డివిజనల్ పంచాయతీ అధికారి టి.రాంబాబు, సత్తుపల్లి నియోజకవర్గానికి కల్లూరు ఆర్డీవో ఎల్. రాజేంద్ర గౌడ్ లను ప్రత్యేక అధికారులుగా నియమించారు. జిల్లాలో రాజీవ్ యువ వికాసంతో పాటు ఇందిరమ్మ ఇండ్ల పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందేలా స్పెషలాఫీసర్లు పర్యవేక్షించనున్నారు.
సబ్సిడీతో ఆర్థిక సహాయం
రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. చిన్న తరహా పరిశ్రమలు, వ్యాపారాలు ఏర్పాటు చేసుకునేందుకు సబ్సిడీతో రూ.4 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనున్నారు. సోమవారంతో ఈ స్కీమ్ కు దరఖాస్తు చేసుకునే గడువు ముగిసింది. అయితే వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రావడంతో చివరి తేదీని పొడిగిస్తారని యువత ఆశించింది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈనెల 4తోనే గడువు ముగియగా, పది రోజుల పాటు పొడిగించారు. రాష్ట్ర అవతరణ సందర్భంగా జూన్ 2న ఈ పథకాన్ని అమలు ప్రారంభించాలని ప్రభుత్వం భావించడంతో మరోసారి గడువును పెంచలేదని తెలుస్తోంది.
ఉమ్మడి జిల్లాలోని దరఖాస్తుల వివరాలు..
జిల్లా బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు మొత్తం
ఖమ్మం 41,881 29,091 14,220 66,58 91,850
భద్రాద్రి కొత్తగూడెం 18,920 12,494 22,374 29,80 56,768