
- బీసీ, ఎస్సీలు ఎక్కువ, ఎస్టీ, మైనార్టీలు తక్కువ
- ఈ వారం నుంచే అప్లికేషన్ల వెరిఫికేషన్
- వచ్చే నెలలో జిల్లా కమిటీ స్క్రూటీని
యాదాద్రి, వెలుగు : రాజీవ్ యువ వికాసం (ఆర్‌వైవీ) స్కీమ్‌లో అప్లికేషన్ల ప్రక్రియ ముగియగా.. ఓవరాల్ గా ఒక్కో యూనిట్‌కు ఐదుగురు అప్లికేషన్లు చేసుకున్నారు. చిన్న యూనిట్లకు తక్కువమంది అప్లయ్చేసుకోగా.. పెద్ద యూనిట్లకు ఎక్కువ మంది అప్లికేషన్ చేసుకున్నారు. ఈ నెలాఖరు నుంచి మండలాల్లో అప్లికేషన్ల వెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
రాజీవ్ యువ వికాసం(ఆర్‌వైవీ) స్కీమ్ ద్వారా యువతకు స్వయం ఉపాధి కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ కింద రేషన్‌కార్డులు కలిగిన బడుగు, బలహీన వర్గాల యువతతో పాటీ ఈబీసీ, మైనార్టీలకు రూ. 50 వేల నుంచి రూ. 4 లక్షల వరకు లోన్ తీసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ స్కీమ్‌లో రూ.50 వేల యూనిట్‌తో పాటు చిన్ననీటి పారుదల యూనిట్లకు అంటే వ్యవసాయ బోర్లు, బావుల తవ్వకం వంటి వాటికి రూ. లక్ష వరకు వంద శాతం సబ్సిడీ ఇవ్వనుంది. రూ. లక్ష నుంచి రూ. 4 లక్షలలోపు వరకూ 90 శాతం నుంచి 70 శాతం వరకూ సబ్సిడీతో బ్యాంక్ లింకేజీతో లోన్ ఇప్పించనుంది.
యాదాద్రికి 9188 యూనిట్లు
యాదాద్రి జిల్లాకు ప్రభుత్వం 9188 యూనిట్లను మంజూరు చేసింది. ఇందులో ఎస్సీలకు 3644 యూనిట్లు మంజూరు చేసి రూ. 50.32 కోట్లు లోన్ అందించనుంది. ఎస్టీలకు 1250 యూనిట్లకు రూ. 16.71 కోట్లు, బీసీలకు 4294 యూనిట్లు రూ. 50 కోట్లు, ఈబీసీ, మైనార్టీలకు రూ. 12.50 కోట్లు లోన్ అందించనుంది.
అప్లికేషన్లు 38,900
ఆర్‌వైవీ యూనిట్లకు యువత నుంచి మంచి స్పందనే లభించింది. మొత్తం 9188 యూనిట్లకు 38,900 మంది అప్లికేషన్ చేశారు. ఓవరాల్‌గా చూస్తూ ఒక్కో యూనిట్‌కు 5గురు అప్లికేషన్లు చేసినట్టు కన్పిస్తున్నా.. రూ. 50 వేలు, రూ. లక్ష విలువైన యూనిట్లకు తక్కువ మంది అప్లయ్ చేశారు. రూ. 50 వేలు, రూ. లక్ష యూనిట్ల సంఖ్య కంటే అప్లికేషన్లు తక్కువగా వచ్చినట్టుగా ఆఫీసర్లు చెబుతున్నారు. రూ. 2 లక్షల నుంచి రూ. 4 లక్షల విలువైన యూనిట్లకు ఎక్కువ మంది అప్లయ్ చేసుకున్నారు. కాగా బీసీ కార్పోరేషన్లో యూనిట్లకు ఎక్కువగా పోటీ నెలకొంది. 4294 యూనిట్లు ఉంటే 23578 మంది అప్లికేషన్లు చేసుకున్నారు. ఎస్టీలకు 3644 యూనిట్లు ఉంటే 10,209 మంది, ఎస్టీలకు 1250 యూనిట్లు ఉంటే 2536 మంది, ఈబీసీ, మైనార్టీలకు 1044 యూనిట్లు ఉంటే 2577 మంది అప్లికేషన్లు చేసుకున్నారు.
నెలాఖరు నుంచి వెరిఫికేషన్
యువత చేసుకున్న అప్లికేషన్లను ఈ నెలాఖరు నుంచి మండలాల్లో వెరిఫికేషన్ చేయనున్నారు. ఎంపీడీవో నేతృత్వంలోని మండల కమిటీ అప్లయ్ చేసుకున్న వారిలో అర్హులైన వారిని వచ్చే నెల 20 వరకూ గుర్తిస్తుంది. అనంతరం ఆ జాబితాను కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా కమిటీకి సిఫారసు చేస్తుంది. మే 21 నుంచి మే 31 వరకూ ఈ జాబితాలో ఉన్న వారిని మరింత వడబోసి జిల్లా కమిటీ ఎంపిక చేస్తుంది. జూన్ 2న యూనిట్లు మంజూరు చేసిన వారికి ప్రొసిడింగ్స్ అందిస్తారు.