స్థానిక ఎన్నికలు పెట్టకుంటే ఆమరణ దీక్ష చేస్త

స్థానిక ఎన్నికలు పెట్టకుంటే ఆమరణ దీక్ష చేస్త
  • రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య హెచ్చరిక 
  • బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జీఓ తేవాలని డిమాండ్​

బషీర్​బాగ్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి, బీసీల పట్ల చిత్తశుద్ధి నిరూపించుకోవాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. గురువారం బషీర్​బాగ్​ప్రెస్ క్లబ్​లో సంఘం ఉపాధ్యక్షుడు నీల వెంకటేశ్​అధ్యక్షతన  నిర్వహించిన సమావేశంలో కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. బీసీ సంఘాల్లో సిద్ధాంతపరంగా వైరుధ్యాలు ఉన్నా లక్ష్యం ఒకటేనని చెప్పారు. 

కలిసికట్టుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ కు కట్టుబడి ఉండాలని కోరారు. బీసీ రిజర్వేషన్లను 22 శాతం నుంచి 42కు పెంచుతూ అసెంబ్లీలో చట్టం చేశారు కానీ ఇంతవరకు జీఓ రిలీజ్​చేయలేదన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243డీ- 6 ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. తక్షణమే జీఓ తీసుకొచ్చి స్థానిక ఎన్నికలు జరపాలని, లేని పక్షంలో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని కృష్ణయ్య 
హెచ్చరించారు.