
- రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య
బషీర్బాగ్/ఖైరతాబాద్, వెలుగు: బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించడంపై బీసీ కుల సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. శనివారం కాచిగూడలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన 18 బీసీ కుల సంఘాల ప్రతినిధుల సమావేశం జరిగింది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. బీసీ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టి 9వ షెడ్యూల్లో పొందుపరిస్తే న్యాయపరమైన ఇబ్బందులు ఉండబోవన్నారు.
సీఎం రేవంత్రెడ్డి అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి బిల్లు పాస్ అయ్యేలా కృషి చేయాలని కోరారు. అవసరమైతే ఢిల్లీ నుంచే పరిపాలన చేయాలన్నారు. బీసీ నేతలు గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, కోలా జనార్దన్, జెల్ల నరేందర్ పాల్గొన్నారు. అలాగే బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో 'బీసీ బిల్లు, స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగ రంగాల్లో తక్షణమే రిజర్వేషన్ల అమలు ఉద్యమ కార్యాచరణ’ అనే అంశంపై శనివారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆర్.కృష్ణయ్య పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే గవర్నర్ ఆర్డినెన్స్ ద్వారా జీఓలను జారీ చేసి విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు.