మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: బాలికల హక్కులను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని జిల్లా న్యాయమూర్తి పాపిరెడ్డి పిలుపునిచ్చారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో మహిళలు, బాలికల పాత్ర ఎనలేనిదని కొనియాడారు. బాలికల హక్కులపై విస్తృత ప్రచారం నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థి దశ నుండే బాలికలు తమ హక్కులు, బాద్యతలను తెలుసుకోవాలని సూచించారు. ఇంటర్, డిగ్రీ, రెసిడెన్షియల్ కాలేజీ విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీలో ఎస్పీ జానకి, డీఎల్ఎస్ఏ సెక్రటరీ డి.ఇందిర, న్యాయమూర్తులు ఆర్.శ్రీదేవి, జె.నిహారిక, ఎన్టీఆర్ మహిళా కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ వి.రాజేంద్ర ప్రసాద్, డీడబ్ల్యూవో జరీనా బేగం పాల్గొన్నారు.