
- రాముని చెరువు డెవలప్మెంట్ జరిగేదెన్నడో?
- అసంపూర్తి పనులతో అవస్థలు పడుతున్న వాకర్స్
- బోసిపోతున్న చిల్డ్రన్స్‌పార్క్.. అధ్వానంగా ఓపెన్ జిమ్
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాలలోని రాముని చెరువు బ్యూటిఫికేషన్పనులు ఒకడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్నట్టు సాగుతున్నాయి. డెవలప్మెంట్ వర్క్స్ స్టార్ట్‌చేసి నాలుగేండ్లు గడుస్తున్నా ఎక్కడివక్కడే ఆగిపోయాయి. ఉరుకులు పరుగుల జీవితంలో ఎప్పుడైనా కాసేపు ఉల్లాసంగా గడపడానికి టౌన్లో ఉన్న ఏకైక స్పాట్ రాముని చెరువు మాత్రమే. అలాంటి చెరువు అభివృద్ధిపై మున్సిపల్ యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తోంది.
ప్రజాప్రతినిధులు, అధికారుల అలసత్వం కారణంగా బ్యూటిఫికేషన్ పనులు ఆగిపోయాయి. దీనికోసం నాలుగేండ్ల కిందట టీయూఎఫ్ఐడీసీ నుంచి రూ.3.50 కోట్లు శాంక్షన్అయ్యాయి. డీపీఆర్, టెండర్లు, పర్మిషన్లు అంటూ రెండు సంవత్సరాలు కాలం గడిపారు. ఎట్టకేలకు 2022 ఏప్రిల్‌లో వర్క్ స్టార్ట్ చేసినప్పటికీ ఫండ్స్ కొరత కారణంగా అనుకున్నంత స్పీడ్‌గా పనులు జరగడం లేదు. వచ్చే వానకాలంలోపు వర్క్స్కంప్లీట్ చేయకుంటే మరో ఏడాది ఎదురుచూపులు తప్పవు.
మత్తడికి గండి కొట్టిన్రు..
రాముని చెరువు బ్యూటిఫికేషన్లో భాగంగా సిల్ట్తీసేందుకు మున్సిపల్ అధికారులు మూడేండ్ల కిందట మత్తడికి గండికొట్టారు. తర్వాత మరో ఏడాది కాలయాపన చేసి పనులు మొదలుపెట్టారు. కొన్నేండ్ల నుంచి చెరువును పట్టించుకోకపోవడం వల్ల హైటెక్‌సిటీ, జాఫర్‌నగర్ నుంచి వచ్చే మురుగునీరు, సిల్ట్‌తో పాటు గుర్రపు డెక్క, పిచ్చిమొక్కలతో నిండిపోయింది. సిల్ట్తొలగింపు కోసం మరోసారి మత్తడి గండిని పెద్దగా చేయడంతో చెరువు మొత్తం ఖాళీ అయ్యింది. ఇష్టారీతిన మట్టితీసి ఇటుకబట్టీలకు అమ్ముకుంటున్నారని ఆరోపణలు రావడంతో సిల్ట్ పనులను ఆపేశారు. ఫలితంగా మూడేండ్లుగా చెరువులో నీళ్లు లేక
బోసిపోతోంది.
గతంలో చేసిన పనులు వృథా..
రాముని చెరువు అభివృద్ధి కోసం గతంలో సుమారు రూ.80 లక్షల దాక ఖర్చు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 2005లో రూ.40 లక్షలతో పార్క్ డెవలప్ చేశారు. కట్టను వెడల్పు చేయడంతో పాటు చెరువు మధ్యలో నుంచి రోడ్డు నిర్మించారు. పలు రకాల మొక్కలు నాటి లైటింగ్ ఏర్పాటు చేశారు. బోటింగ్ కోసం మెట్లు నిర్మించారు. కానీ ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా పార్క్‌ను ప్రారంభించకుండానే ఆనవాళ్లు కోల్పోయింది. చెరువు చెట్టూ కబ్జాలు పెరగడం వల్ల 2017లో అప్పటి కలెక్టర్ ఆర్వీ కర్ణన్ భూసర్వే చేయించి చుట్టూ కట్ట నిర్మించారు.
అవస్థలు పడుతున్న వాకర్స్
అప్పట్లో అది వాకింగ్ ట్రాక్‌గా ఉపయోగపడ్డప్పటికీ క్రమంగా పిచ్చిమొక్కలు పెరగడంతో వాకర్స్అటువైపు వెళ్లడం లేదు. రోజూ మార్నింగ్, ఈవెనింగ్ వందలాది మంది రాముని చెరువు కట్టపై వాకింగ్‌కోసం వచ్చేవారు గుంతల కారణంగా ఇప్పుడు రావడంలేదు. వర్షాకాలంలో అయితే బుదరలోనే వాకింగ్చేయాల్సి దుస్థితి నెలకొంది. బ్యూటిఫికేషన్ పనుల్లో ప్రోగ్రెస్ లేకపోవడంతో వాకర్స్అసోసియేషన్ ఆధ్వర్యంలో పలుమార్లు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందించారు. అయినా ఫలితం శూన్యం.
ఆగిన చిల్డ్రన్స్ పార్క్ పనులు
చెరువు కింద రూ.80 లక్షలతో చేపట్టిన చిల్డ్రన్స్ పార్క్ డెవలప్మెంట్పనులు కూడా ఆగిపోయాయి. పార్క్ ముందుభాగంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్మెయింటెన్స్ అధ్వానంగా ఉంది. పరికరాలు దొంగలపాలవుతున్నాయి. టూరిజం డిపార్ట్మెంట్ఆధ్వర్యంలో బోటింగ్ఏర్పాటు చేస్తామని ప్రకటించినా ఇంతవరకు అతీగతీలేదు. ఇప్పటివరకు రూ.2.50 కోట్ల పనులు చేశామని, కానీ బిల్స్ రావడం లేదని కాంట్రాక్టర్ చెప్తున్నాడు.