రామగుండం బల్దియాలో దెబ్బతిన్న మురుగునీటి వ్యవస్థ

  •     చిన్నపాటి వానలకే పొంగుతున్న మ్యాన్​హోల్స్​
  •     రోడ్లపై పారుతున్న మురుగు
  •     డ్రైనేజీల్లో పూడిక తీసేవారే లేరు
  •     దుర్వాసనతో ఇబ్బందులు పడ్తున్న జనం 

గోదావరిఖని, వెలుగు : రామగుండం కార్పొరేషన్​పరిధిలో డ్రైనేజీ సిస్టమ్ అస్తవ్యస్తంగా మారింది. చిన్నపాటి వానలకే మ్యాన్​హోల్స్​పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై మురుగునీరు పారుతుండడంతో వాహనదారులు, జనం ఇబ్బందులు పడుతున్నారు. డివిజన్లలో దుర్వాసనతో జనం అవస్థలు పడ్తున్నారు. డ్రైనేజీలు పూడిపోవడంతో ఇటీవల వానలకు వరద నీరు రోడ్డుపైనే నిలిచింది. వర్షపు నీరు వెళ్లేందుకు రోడ్డుపై ఏర్పాటు చేసిన ఇనుప జాలీల్లోనూ మట్టి, చెత్తతో నిండిపోవడంతో నీరంతా అక్కడే ఉంటోంది. కార్పొరేషన్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ నుంచి ఫైవింక్లయిన్‌‌‌‌ వరకు మెయిన్‌‌‌‌ రోడ్డుపై  రూ.కోట్లతో నిర్మించిన వరద కాలువ కూడా సరిగ్గా లేకపోవడంతో రోడ్డుపైనే నీరు నిలిచిపోతోంది. డ్రైనేజీ సిస్టమ్​దెబ్బతిని జనం ఇబ్బందులు పడుతున్నా బల్దియా పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. 

డ్రైనేజీల్లో చెత్త, మట్టి 

బల్దియా పరిధిలోని ఇండ్ల నుంచి వచ్చే నీటిని డ్రైనేజీల్లోకి మళ్లించేందుకు డివిజన్లలో అండర్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌ డ్రైనేజీ నిర్మించారు. కాగా చాలా చోట్ల డ్రైనేజీ పైపులు.. చెత్త, మట్టితో నిండిపోయాయి. ముఖ్యంగా ప్లాస్టిక్​వేస్ట్​డ్రైనేజీ నీటిని కదలనివ్వడం లేదు. డ్రైనేజీ ముందుకు వెళ్లకపోవడంతో మ్యాన్‌‌‌‌హోల్స్ నుంచి పైకి వస్తూ రోడ్లపై పారుతోంది. మిషన్ల ద్వారా అండర్​గ్రౌండ్​పైపుల్లో పేరుకపోయిన చెత్త, మట్టిని తొలగించాల్సి ఉన్నా బల్దియా ఆఫీసర్లు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు.  దీనికితోడు ఇటీవల భారీ వర్షాల నేపథ్యంలో అండర్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌ డ్రైనేజీ పైపుల్లో వర్షపు నీరు ముందుకు వెళ్లక వెనక్కి వచ్చి సమీపంలోని ఇండ్లల్లోకి చేరింది. దీంతో ఇండ్లన్నీ వర్షపు నీటితోపాటు డ్రైనేజీతో నిండిపోయాయి. ఉదయ్‌‌‌‌నగర్‌‌‌‌, పవర్‌‌‌‌హౌజ్‌‌‌‌ కాలనీ, ఎల్‌‌‌‌బీనగర్‌‌‌‌, లక్ష్మీనగర్‌‌‌‌, కల్యాణ్‌‌‌‌నగర్‌‌‌‌ కాలనీల్లో ఇండ్లల్లోకి వర్షపు, డ్రైనేజీ నీరు చేరింది. దీంతో కాలనీల్లో ఇండ్లల్లోకి చేరిన నీటిని పంపించేందుకు రోడ్డు తవ్వాల్సి వచ్చింది. మేదరిబస్తీ, కల్యాణ్‌‌నగర్‌‌‌‌, ఎఫ్‌‌సీఐ రోడ్డులో ఇప్పటికీ డ్రైనేజీ పొంగుతూనే ఉంది. రోడ్లపై అక్కడక్కడ ఏర్పాటు చేసిన ఇనుప జాలీల్లోనూ చెత్త నిండిపోయి రోడ్లపై నీరు పారడం లేదు.

వరద కాలువ వృథా

రామగుండం కార్పొరేషన్‌‌‌‌ ఆఫీస్‌‌‌‌ నుంచి ఫైవింక్లయిన్‌‌‌‌ చౌరస్తా వరకు రూ.2.92 కోట్లతో రోడ్డుకు ఇరువైపులా వరద కాలువ నిర్మించారు. ఈ కాల్వలోకి వర్షపు నీరు చేరేలా నిర్మించిన హోల్స్‌‌‌‌ రోడ్డుకు పైకి ఉండడంతో నీరు అందులోకి చేరడం లేదు. రోడ్డుపై నిలిచిన వర్షపు నీటిలో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం, పాలకవర్గం పట్టించుకోకపోవడంతోనే రామగుండం కార్పొరేషన్‌‌‌‌లో ఈ పరిస్థితి నెలకొందని ప్రజలు వాపోతున్నారు. పేరుకు పెద్ద కార్పొరేషన్‌‌‌‌ అయినా డ్రైనేజీ సిస్టమ్‌‌‌‌ అమలులో పాలకవర్గం ఫెయిలైందని ఆరోపిస్తున్నారు.