కల్తీని అరికట్టేదెవరు? గద్వాల జిల్లాలో ఫుడ్​ ఇన్స్​పెక్టర్ పోస్ట్​ ఖాళీ

కల్తీని అరికట్టేదెవరు? గద్వాల జిల్లాలో ఫుడ్​ ఇన్స్​పెక్టర్  పోస్ట్​ ఖాళీ
  • మార్కెట్​లో విచ్చలవిడిగా కల్తీ పదార్థాలు
  • తనిఖీలు లేక ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న వ్యాపారులు

గద్వాల, వెలుగు: మార్కెట్​లో విచ్చలవిడిగా కల్తీ ఆహార పదార్థాలు అమ్ముతున్నా అరికట్టాల్సిన ఆఫీసర్లు కరువయ్యారు. ఇటీవల గద్వాల కేంద్రంగా నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ దందాను పోలీసులు బట్టబయలు చేశారు. అయితే ఇప్పటికే మార్కెట్​లోకి వెళ్లిన కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్  రికవరీపై మాత్రం దృష్టి పెట్టకపోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఫాస్ట్ ఫుడ్  సెంటర్లు, కిరాణా షాపులు, హోటల్స్, రెస్టారెంట్లలో నకిలీ అల్లం, వెల్లుల్లి పేస్ట్ నే వినియోగిస్తున్నారు. నకిలీ దందా గుట్టు రట్టు చేసిన పోలీసులు, కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు.

అలాగే అయిజ కేంద్రంగా నకిలీ వంట నూనె దందా జోరుగా సాగుతోంది. సన్​ఫ్లవర్​ ఆయిల్ లో పామాయిల్  నూనెను కలిపి మోసం చేస్తున్నారు. పసుపు, వంట నూనె, కొబ్బరి, నువ్వుల పొడులు, అల్లం, వెల్లుల్లి పేస్టు ఇలా అన్ని వస్తువులను కల్తీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నడిగడ్డలో కొన్ని కల్తీ చేస్తుండగా, మరికొన్నింటిని కర్నాటకలోని రాయచూరు ఏపీలోని కర్నూల్  జిల్లా నుంచి ఇక్కడికి కల్తీ వస్తువులు తీసుకొచ్చి అమ్ముతున్నారనే ఆరోపణలున్నాయి.

నాలుగేండ్లుగా ఫుడ్​ ఇన్ స్పెక్టర్​ కరువు..

జోగులాంబ గద్వాల జిల్లాతో పాటు హైదరాబాద్​ కేంద్రంగా కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్టు అమ్మేవారిని పోలీసులు అరెస్ట్​ చేసి వారి నుంచి భారీగా కల్తీ సరుకు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇప్పటికే మార్కెట్​లో సప్లై చేసిన నకిలీ పేస్టును రికవరీ చేయలేదు. మార్కెట్​లో ఉన్న కల్తీ, నకిలీ సరుకులను అరికట్టాల్సిన ఫుడ్ ఇన్స్​పెక్టర్  లేకపోవడంతో కల్తీ దందా చేసేవారిని అడ్డుకునే వారు కరువయ్యారు.

నిత్యావసరాలన్నీ కల్తీనే..

జిల్లాలోని పలు ప్రాంతాల్లో విచ్చలవిడిగా కల్తీ దందా సాగుతోంది. అయిజలో ఎలాంటి పర్మిషన్ లేకుండా వేంకటేశ్వర ఆయిల్ మిల్ వారు ఫ్రెష్ రిచ్ కంపెనీ బ్రాండెడ్ పేరుతో సన్​ఫ్లవర్ ఆయిల్ అమ్ముతున్నట్లు చూపించి, అందులో పామాయిల్ కలుపుతున్నారు. అలాగే నాసిరకం కొబ్బరి, పసుపు, పొడులను తయారు చేసి వివిధ రకాల బ్రాండ్ల పేరుతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రముఖ కంపెనీల పేర్లను కొంత మార్చి అమ్ముతున్నారు. పక్క రాష్ట్రాలైన కర్నాటక, ఏపీ నుంచి కూడా నకిలీ సరుకులు తెచ్చి ఇక్కడి వ్యాపారులు మోసం చేస్తున్నారు.

ALSO READ : వనపర్తి జిల్లాలో .. కంది కొనుగోళ్లలో ప్రైవేట్‌‌‌‌ దందా

ఎక్కువ లాభం వస్తుందని..

లోకల్ మేడ్, నకిలీ ఆహార పదార్థాలు అమ్మితే ఎక్కువ లాభం వస్తుందనే ఉద్దేశంతో వ్యాపారులు వాటిని ప్రమోట్​ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవల పట్టుకున్న కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్  తయారు చేయడానికి కేజీకి రూ.15 ఖర్చవుతుండగా, షాపుల వారికి రూ.60 రూ.100రే కేజీ అమ్మారు. షాప్  వాళ్లు రూ.200 నుంచి రూ.250 కేజీ చొప్పున అమ్మి  రూ.150 వరకు లాభం పొందారు. కల్తీ ఫ్రీడమ్  ఆయిల్  ప్యాకెట్  అమ్మితే రూ. 40 వరకు లాభం వస్తుంది. అదే బ్రాండెడ్  ఆయిల్  ప్యాకెట్  అమ్మితే రూ.4 వరకు లాభం వస్తుంది. దీంతో కొందరు వ్యాపారులు కల్తీ ఆహార పదార్థాలను అమ్ముతున్నారనే ఆరోపణలున్నాయి.

కల్తీలపై నిఘా పెట్టాం..

ఫుడ్ ఇన్స్​పెక్టర్  లేకపోవడంతో ఇబ్బందులు వస్తున్నాయి. అల్లం, వెల్లుల్లి పేస్ట్  మరికొన్ని నకిలీ బ్రాండ్​లు కూడా ఉన్నట్లు గుర్తించాం. మార్కెట్​లో ఉన్న కల్తీ అల్లం, వెల్లుల్లి పేస్ట్​ రికవరీపై దృష్టి పెడతాం. ల్యాబ్  రిపోర్ట్ కోసం వెయిట్  చేస్తున్నాం.- కల్యాణ్ కుమార్, ఎస్సై గద్వాల టౌన్