మోచేతిపై పురుషాంగం

మోచేతిపై పురుషాంగం
  • మైక్రో వాస్క్యులర్ సర్జరీ ద్వారా డెవలప్
  • 10 గంటలకు పైగా సోమాలియా యువకుడికి ఆపరేషన్
  • హైదరాబాద్ మెడికవర్ హాస్పిటల్ డాక్టర్ల ఘనత

హైదరాబాద్ సిటీ/మాదాపూర్,​ వెలుగు: హైదరాబాద్ హైటెక్ సిటీలోని మెడికవర్ హాస్పిటల్ డాక్టర్లు అరుదైన ఆపరేషన్ చేశారు. పురుషాంగాన్ని పూర్తిగా కోల్పోయిన ఓ వ్యక్తికి అతని మోచేతిపైనే కొత్త పురుషాంగాన్ని డెవలప్ చేశారు. ఆ తర్వాత దాన్ని తీసుకెళ్లి మర్మాంగాలు ఉండే ప్లేస్​లో అమర్చారు. సోమాలియాకు చెందిన ఓ 19 ఏండ్ల యువకుడు.. 4 ఏండ్ల వయస్సులో చేయించుకున్న సున్తీ కారణంగా ఇన్​ఫెక్షన్ అయింది. దీంతో అతను తన పురుషాంగం కోల్పోయాడు. కూర్చొని టాయిలెట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

 పెండ్లి, సంసారం, సామాజికంగా ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. తన పురుషాంగం మళ్లీ డెవలప్ చేసుకునేందుకు చేసిన ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి. చివరకు హైదరాబాద్‌‌‌‌లోని మెడికవర్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌కు వచ్చాడు. సీనియర్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్, ఆండ్రోలజిస్ట్ డాక్టర్‌‌‌‌ రవి కుమార్‌‌‌‌, ప్లాస్టిక్‌‌‌‌ సర్జన్‌‌‌‌ (రీ కన్ స్ట్రక్టివ్ అండ్ కాస్మొటిక్​) డాక్టర్‌‌‌‌ దాసరి మధు వినయ్‌‌‌‌ కుమార్‌‌‌‌ కలిశారు. పేషెంట్​కు అన్ని పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. పురుషాంగాన్ని మళ్లీ డెవలప్ చేయాలని నిర్ణయించారు. 

పూర్తి స్పర్శ పొందిన పురుషాంగం

పేషెంట్ హెల్త్ కండీషన్ గురించి డాక్టర్లు పూర్తిగా ఎగ్జామిన్ చేశారు. మోచేతి వద్ద మైక్రో వాస్క్యులర్ సర్జరీ ద్వారా రేడియల్ ఆర్జెరీ ఫోర్ ఆర్మ్ ఫ్లాప్ నుంచి పురషాంగాన్ని డెవలప్ చేశారు. ఈ ఆపరేషన్ చేయడానికి 10 గంటలకు పైగా సమయం పట్టిందని సీనియర్‌‌‌‌ కన్సల్టెంట్‌‌‌‌ యూరాలజిస్ట్‌‌‌‌, ఆండ్రాలజిస్ట్‌‌‌‌ డాక్టర్‌‌‌‌ ఏవీ రవికుమార్‌‌‌‌ అన్నారు. ఇక నుంచి సదరు పేషెంట్ సాధారణ పురుషుల్లాగానే మూత్రం పోయవచ్చు అని తెలిపారు. రోగి మోచేతి దగ్గర నుంచి పురుషాంగం డెవలప్ చేశామని, తర్వాత దాన్ని మర్మాంగాల ప్రదేశంలో అమర్చినట్లు కన్సల్టెంట్‌‌‌‌ ప్లాస్టిక్‌‌‌‌ సర్జన్‌‌‌‌ డాక్టర్‌‌‌‌ దాసరి మధు వినయ్‌‌‌‌ కుమార్‌‌‌‌ అన్నారు. 

‘‘పురుషాంగాన్ని మళ్లీ డెవలప్ చేయడానికి మోచేతి అనువుగా ఉంటుంది. అక్కడ అంత చర్మం లభిస్తుంది. మోచేతి చర్మం పొర సున్నితంగా ఉండటంతో అంగం చుట్టూ సులభంగా మౌల్డ్ చేయవచ్చు. తొడ చర్మం కూడా ఉపయోగించవచ్చు కానీ, అది మందం ఉండటం వల్ల మౌల్డ్ కాదు.

 చేతిలో రెండు నరాలు ఉంటాయి. అందులో ఒక నరాన్ని పురుషాంగం డెవలప్ చేసేందుకు ఉయోగించాం. రోగికి సర్జరీ జరిగిన ఆరు నెలల నుంచి ఏడాదిలోపు పురుషాంగం పరంగా పూర్తి స్పర్శ పొందాడు. ఆ తర్వాత దాన్ని తీసుకెళ్లి మర్మాంగం ఉండే స్థానంలో అమర్చాం. పినైల్ ఇంప్లాంట్ చేయడంతో ఇక అతను ఎలాంటి అనుమానం లేకుండా పెండ్లి చేసుకుని సంసారం చేయొచ్చు. అత్యంత అరుదైన కేసు అయినప్పటికీ సవాల్‌‌‌‌గా తీసుకుని ఈ ఆపరేషన్ సక్సెస్ చేశాం’’అని వినయ్ కుమార్ తెలిపారు.

మానసిక క్షోభ అనుభవించాను: పేషెంట్

చిన్నప్పుడు ఓ తప్పు వల్ల మానసికంగా ఎంతో క్షోభ అనుభవించానని సోమాలియాకు చెందిన 19 ఏండ్ల పేషెంట్ చెప్పాడు. తాను ఆడ, మగ అనేది తేల్చుకోలేని స్థితి నుంచి ఇప్పుడు సంపూర్ణమైన పురుషుడిగా స్వదేశానికి వెళ్తుండటం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. అరుదైన చికిత్సను చేసిన మెడికవర్‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌ డాక్టర్లు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే తాను పెండ్లి చేసుకోబోతున్నట్లు వెల్లడించారు.