
- ఉమ్మడి మెదక్ జిల్లాలో 3,730 సెంటర్లు
- 1,97,363 మంది చిన్నారులు
మెదక్/సంగారెడ్డి/సిద్దిపేట, వెలుగు: ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం( ఆర్ బీఎస్ కే) ద్వారా ఏటా విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, సమస్యలున్న వారికి చికిత్స అందిస్తున్నారు. ఇదివరకు స్కూల్, కాలేజీ విద్యార్థులకే చేయగా.. ఇప్పుడు అంగన్ వాడీ పిల్లలకు సైతం ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి మెదక్జిల్లాలో 3,730 అంగన్ వాడీ కేంద్రాలుండగా.. వాటిల్లో 0 నుంచి 6 ఏళ్ల వయసులోపు పిల్లలు1,97,363 మంది ఉన్నారు.
ఈ మేరకు వైద్యారోగ్య శాఖ, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రామాల వారీగా మెడికల్ క్యాంప్లు పెడుతున్నారు. వాటిల్లో గ్రామంలోని అంగన్ వాడీ సెంటర్లలో గల పిల్లలకు మెడికల్టెస్ట్లు చేస్తున్నారు. చిన్నారులకు కంటి పరీక్షలతో పాటు, వయసుకు తగిన ఎత్తు, బరువు ఉన్నారా ? లేదా? అన్నది పరిశీలిస్తున్నారు. ఇంకేమైనా ఆరోగ్య సమస్యలున్నాయా అనేది కూడా గుర్తించనున్నారు. తదనుగుణంగా వారి ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోనున్నారు.
దృష్టిలోపం ఉన్న పిల్లలకు..
అంగన్ వాడీ చిన్నారుల్లో నెలకొన్న కంటి సమస్యలను పరిష్కరించేందుకు ఆర్ బీఎస్ కే బృందాలు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాయి. పిల్లల్లో కంటి వ్యాధిగ్రస్తత, కనురెప్ప కిందికి పడిపోవడం, కళ్ల నుంచి నీరు రావడం, కళ్లు నియంత్రించలేని స్థితిలో కదలడం, ఒకే దిశలో చూడకపోవడం, కళ్లల్లో తేమ లేకపోవడం, కంటిపై ఒకవైపు మాంసం పెరగడం, కళ్లు పొడిబారడం, కంటిలో వక్రీభవన లోపాలు, సరిగ్గా తెరవకపోవడం, కళ్లపై మచ్చలు ఇతరత్రా వాటిని పరీక్షిస్తున్నారు. దృష్టిలోపం ఉన్న పిల్లలకు వైద్య సేవలందించడమే తమ లక్ష్యమని ఆర్ బీఎస్ కే నిపుణులు తెలిపారు.
సంగారెడ్డి జిల్లాలో...
సంగారెడ్డి జిల్లాలో అంగన్ వాడీ చిన్నారులకు కంటి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 1,504 అంగన్వాడీ సెంటర్లు ఉండగా వాటి పరిధిలో 0 నుంచి 6 ఏళ్ల వయసులోపు పిల్లలు 7,644 మంది ఉన్నారు. వీరికి కంటి, ఇతర ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు 9 ఆర్ బీఎస్ కే బృందాలను నియమించారు. 12 మంది ఆఫ్తాల్మిక్ అసిస్టెంట్లు ఈ స్క్రీనింగ్ పరీక్షల్లో పాలుపంచుకుంటున్నారు. ఒక్కో ఆర్ బీఎస్ కే బృందం రోజుకు 120 మంది చిన్నారులకు కంటి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. కాగా, కంటి పరీక్షల సందర్భంగా పిల్లల తల్లిదండ్రులకు పోషకాహారం తదితర అంశాలపై అధికారులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు.
మెదక్ జిల్లాలో..
జిల్లాలో 4 ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలోని 1,076 అంగన్వాడీ కేంద్రాల్లో 52,619 మంది పిల్లలున్నారు. వీరికి ఆరోగ్య పరీక్షలు చేసేందుకు 6 ఆర్ బీఎస్కే టీంలను ఏర్పాటు చేశారు. గ్రామాల వారీగా మెడికల్ క్యాంప్లు నిర్వహిస్తూ చిన్నారులకు వైద్య పరీక్షలు చేస్తున్నట్లు డీడబ్ల్యూవో హైమావతి తెలిపారు. రిపోర్టుల ఆధారంగా సమస్యలున్న పిల్లలకు చికిత్స అందించనున్నట్లు పేర్కొన్నారు.
సిద్దిపేట జిల్లాలో..
సిద్దిపేట జిల్లాలోని 5 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,150 అంగన్వాడీ సెంటర్లున్నాయి. వీటిల్లో 67,100 మంది పిల్లలున్నారు. వీరందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం 9 ఆర్బీఎస్కే టీంలను ఏర్పాటు చేశారు.