
- కార్డుల విభజనతో పాటు బినామీ వ్యవహారాలపై ఫోకస్
- రెండు వారాల్లోనే ప్రక్రియ పూర్తి చేసేలా ప్లాన్
- జిల్లాలోని 748 రేషన్ షాపుల్లో తనిఖీ
ఖమ్మం జిల్లా ముదిగొండలో నాలుగు రేషన్ షాపులున్నాయి. అందులో ఒక డీలర్ పరిధిలో 745 రేషన్ కార్డులుండగా, అతడికి ప్రతినెలా 140 క్వింటాళ్ల రేషన్‌బియ్యం వస్తున్నాయి. అదే ఊర్లో ఉన్న మరో డీలర్ సస్పెండ్ కావడంతో ఆయన షాపునకు కూడా మొదటి డీలరే ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. అక్కడ 904 రేషన్ కార్డులుండగా, 169 క్వింటాళ్ల బియ్యం వస్తున్నాయి. మూడో డీలర్ కు 547 రేషన్ కార్డులుండగా 99 క్వింటాళ్లు పంపిణీ చేస్తున్నారు.
పెద్ద గ్రామం కావడంతో అక్కడే ఉన్న రాఘవపురం కాలనీకి రెండేండ్ల కింద కొత్త రేషన్ షాపును మంజూరు చేసి డీలర్ ను నియమించారు. అతడికి 210 కార్డులు కేటాయించడంతో 36 క్వింటాళ్ల బియ్యం స్టాక్ వస్తోంది. నాలుగో షాపునకు వచ్చిన స్టాక్ ఒకట్రెండు రోజుల్లోనే అయిపోతుండగా, బియ్యం కోసం మళ్లీ వినియోగదారులు దూరంలో ఉన్న వేరే రేషన్ షాపులకు వెళ్లాల్సి వస్తోంది. రేషన్ కార్డులను సమానంగా విభజన చేయకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడుతోంది. ఇక కమిషన్ రూపంలో వచ్చే ఆదాయంలోనూ నాలుగో డీలర్ కు అన్యాయం జరుగుతోంది.
ఖమ్మం, వెలుగు : ఖమ్మం జిల్లాలో డీలర్లకు రేషన్ కార్డులను సరైన విధంగా విభజించకపోవడంతో కస్టమర్లు ఇబ్బంది పడాల్సి వస్తోంది. దూరంగా ఉన్న రేషన్ షాపుల నుంచి ఆయా గ్రామస్తులు బియ్యం తెచ్చుకోవడం కష్టంగా మారిందని గుర్తించి రెండేండ్ల కింద కొత్త రేషన్ డీలర్లను నియమించిన అధికారులు, అదే కొత్త డీలర్లకు తగిన విధంగా స్టాక్ ను మాత్రం కేటాయించడం లేదు. దీంతో దగ్గరలో ఉన్న రేషన్‌షాపుల్లో బియ్యం స్టాక్ లేక మళ్లీ పాత షాపుల నుంచే బియ్యం తెచ్చుకోవాల్సి వస్తోంది. ఇన్నేళ్లుగా దొడ్డు బియ్యం సప్లయ్ కావడం, రేషన్ బియ్యం తినేందుకు చాలా మంది ఇష్టపడకపోవడంతో రేషన్డీలర్లే వాటిని పక్కదారి పట్టించేవారు.
ఇలా ప్రతినెలా వందల క్వింటాళ్ల రేషన్‌బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ, దందాలకు పాల్పడుతున్న రేషన్ డీలర్లు తమకు వచ్చే ఆదాయంలో అధికారులకు కూడా వాటాలు పంచుతూ వారిని గ్రిప్‌లో పెట్టుకున్నారు. కొత్తగా రేషన్ డీలర్లను ఎంపిక చేసిన తర్వాత వారికి తమతో సమానంగా రేషన్ కార్డులను విభజించితే, తమ ఆదాయానికి గండిపడుతుందని భావించి అధికారులపై ఒత్తిడి తెచ్చి నామమాత్రంగా 200 లోపు కార్డులను మాత్రమే కొత్తవారికి కేటాయించారు. దీంతో కొత్తగా రేషన్ షాపులు దక్కిన డీలర్లకు కమిషన్ రూపంలో వచ్చిన ఆదాయం షాపుల కిరాయి, ఇతర ఖర్చులకే సరిపోతున్నాయని బాధపడుతున్నారు.
షాపులపై ఎంక్వైరీకి కలెక్టర్ఆదేశం
రాష్ట్రంలో యావరేజీగా ప్రతి రేషన్‌డీలర్ పరిధిలో 522 కార్డులున్నాయని ఇటీవల అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఖమ్మం జిల్లాలో ఒక్కో రేషన్ షాపునకు రాష్ట్ర యావరేజీని మించి 550 కార్డులున్నాయి. జిల్లాలో మొత్తం 748 రేషన్ షాపులుండగా 4,11,428 రేషన్ కార్డులున్నాయి. ఉదాహరణకు ముదిగొండ మండలంలో 37 మంది రేషన్ డీలర్లకు గాను ఏడుగురికి 250 లోపు మాత్రమే కార్డులున్నాయి. మండలంలోని మల్లారం డీలర్ అమ్మపేటకు ఇన్చార్జిగా, యడవల్లి డీలర్ కట్టకూరుకు ఇన్చార్జిగా, పండ్రేగుపల్లి డీలర్ ఖానాపురానికి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వాటిని సరిచేయడంతో పాటు సన్నబియ్యం పంపిణీ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో ఎలాంటి అక్రమాలు జరగకుండా చూడడంపై కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్నజర్ పెట్టారు.
జిల్లాలోని అన్ని రేషన్ షాపుల్లో తనిఖీలు నిర్వహించాలని సివిల్ సప్లయ్అధికారులను ఆయన ఆదేశించారు. ఆయా రేషన్ షాపులను కేటాయించిన డీలర్లే నిర్వహిస్తున్నారా, బినామీల ద్వారా షాపు నడిపిస్తున్నారా అనేది ఎంక్వైరీలో తేల్చనున్నారు. సకాలంలో రేషన్ అందిస్తున్నారా, కస్టమర్లకు అందుబాటులో ఉంటున్నారా, ఇతర వ్యాపారాలు ఏవైనా నిర్వహిస్తున్నారా అనే అంశాలతో పాటు కొత్త రేషన్ షాపుల అవసరంపైనా అధికారులు పరిశీలించనున్నారు. ఇందుకోసం ఎన్ఫోర్స్ మెంట్ టీమ్ లను సిద్ధం చేస్తున్నారు. రెండు వారాల్లో ఈ తనిఖీ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు.
రెండు పూటలా షాపులు ఓపెన్ చేయాల్సిందే..
తరచుగా రేషన్ షాపులు మూసి ఉంటున్నాయన్న వినియోగదారుల ఫిర్యాదుల నేపథ్యంలో రెండు పూటలా ఓపెన్ చేయాలని డీలర్లు జిల్లా అధికారులు ఆదేశించారు. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు రేషన్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.