- రేషన్ బియ్యాన్ని నూకలుగా మార్చి అమ్మకాలు
- లిక్కర్ ఫ్యాక్టరీలు, పౌల్ట్రీ ఫామ్ లకు సప్లై
- కీలకంగా వ్యవహరిస్తున్న బినామీ డీలర్లు, రైస్ మిల్లర్లు
- కేసులు పెడుతున్నా ఆగని దందా
గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలో రేషన్ బియ్యం మాఫియా రూట్ మార్చేసింది. ఒక వైపు మిల్లర్లు రీసైక్లింగ్ చేస్తూ రేషన్ బియ్యాన్ని సీఎంఆర్ కింద ఇస్తుండగా, మరి కొందరు ఆ బియ్యాన్ని నూకలుగా చేసి పౌల్ట్రీ ఫామ్‌లు, లిక్కర్ ఫ్యాక్టరీలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు.
రేషన్ బియ్యాన్ని నూకలు చేసేందుకు సపరేట్ గా మినీ రైస్ మిల్లులు ఏర్పాటు చేసుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మాఫియాలో కింగ్ మేకర్లుగా బినామీ డీలర్లు, రైస్ మిల్లర్లు వ్యవహరిస్తున్నారు. పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్లు మాఫియాకు సహకరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కేసులు పెట్టినప్పటికీ ఈ దందా కొనసాగుతూనే ఉంది.
నూకలు చేసేందుకు మినీ రైస్ మిల్లులు..
రేషన్ బియ్యాన్ని నేరుగా సప్లై చేస్తే ఆఫీసర్లు దాడులు చేసి పట్టుకుంటారనే భయంతో నూకలుగా మార్చి అమ్ముతున్నారు. గత నెలలో అయిజ పట్టణం సమీపంలో పొలం దగ్గర చిన్న షెడ్డులో మినీ రైస్ మిల్ ఏర్పాటు చేసి రేషన్ బియ్యాన్ని నూకలు చేస్తుండగా, ఎన్‌ఫోర్స్‌మెంట్ దాడులు నిర్వహించడంతో ఈ వ్యవహారం బయటపడింది. దాడుల్లో 142 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకొని కేసు నమోదు చేశారు.
రూ.10 నుంచి రూ.12కు బియ్యం కొని వాటిని నూకలుగా మార్చి, రూ.25 నుంచి రూ.29కి మానవపాడు మండలం కలుకుంట సమీపంలోని లిక్కర్ ఫ్యాక్టరీతో పాటు వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపూర్ లిక్కర్ ఫ్యాక్టరీకి అమ్ముతున్నారని తెలుస్తోంది. మరి కొందరు పౌల్ట్రీ ఫామ్‌లకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు.
గద్వాల జిల్లాలో 333 రేషన్ షాపులు ఉన్నాయి. అందులో చాలా షాపులకు రెగ్యులర్ డీలర్లు లేకపోవడంతో ఒక్కొక్కరు 3 నుంచి 5 షాపులకు ఇన్‌చార్జిగా ఉన్నారు. 54 మంది ఇన్‌చార్జి డీలర్లు ఉన్నారు. ఇందులో చాలా వరకు ఇన్‌చార్జీల పేరుతో బినామీలే షాప్‌లు నిర్వహిస్తున్నారు. వీరితో మాఫియా కుమ్మక్కై బియ్యాన్ని బల్క్‌గా తీసుకొని డీసీఎంల ద్వారా మిల్లులకు తరలిస్తున్నారు.
విజిలెన్స్ దాడుల్లో వెలుగులోకి..
విజిలెన్స్ దాడుల్లో రైస్ మిల్లర్ల దందాలు వెలుగులోకి వస్తున్నాయి. రెండు రోజుల కింద ఎర్రవల్లి మండలంలోని రైస్ మిల్లులో విజిలెన్స్ దాడులు చేసి, 158 క్వింటాళ్ల బియ్యం పట్టుకొని మిల్లుపై కేసు నమోదు చేశారు. మిల్లులకు కేటాయించిన వడ్లకు, మిల్లులో ఉన్న నిల్వలకు తేడా ఉన్నట్లు విజిలెన్స్ ఆఫీసర్లు గుర్తించారు.
కొందరు మిల్లర్లు మిల్లుకు వచ్చిన సన్న వడ్లను గుట్టు చప్పుడు కాకుండా తిరిగి కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇలా వడ్లను అమ్మి బోనస్ నొక్కేస్తున్నారనే విమర్శలున్నాయి. దీంతోపాటు కొన్ని మిల్లులకు పరిమితికి మించి వడ్లు కేటాయించడంతో వాటిని మిల్లింగ్ చేయలేని పరిస్థితి ఉంది. సివిల్ సప్లైలోని ఒక ఆఫీసర్ డబ్బులు తీసుకొని ఇలా పరిమితికి మించి వడ్లు కేటాయించారనే ఆరోపణలున్నాయి.
రీసైక్లింగ్ పైనే నజర్..
గద్వాల పట్టణంతో పాటు చుట్టు పక్కల ఉన్న రైస్ మిల్లులు, అలంపూర్ నియోజకవర్గంలోని హైవే సమీపంలో ఉన్న రైసు మిల్లుల్లో ఈ దందా కొనసాగిస్తున్నారు. రైస్ మిల్లులకు ఇచ్చిన వడ్లను కొందరు మిల్లర్లు మిల్లింగ్ చేయకుండా, రీసైక్లింగ్ ద్వారా వచ్చిన రేషన్ బియ్యాన్ని సీఎంఆర్ కింద అందజేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గద్వాల సమీపంలోని గోన్పాడు విలేజ్ దగ్గర ఉన్న ఓ మిల్లులో వందల సంచులు ఉన్నప్పటికీ మిల్లింగ్ చేయకుండా నిల్వ ఉంచడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మిల్లును లీజ్‌కు తీసుకున్న మాఫియా బినామీ డీలర్ల నుంచి బియ్యం తరలించి డంప్ చేస్తున్నారు. వీటిని సీఎంఆర్ కింద అందజేసి, వడ్లను ఏపీ, కర్నాటక బార్డర్ దాటిస్తున్నారు. ఇలా ఇటీవల ఐదు కేసులు నమోదు చేశారు.
జింకల పల్లె గ్రామంలోని పద్మావతి శ్రీనివాస రైస్ ఇండస్ట్రీలో 50 క్వింటాళ్ల బియ్యం పట్టుకొని కేసు పెట్టారు. మరో మిల్లులో130 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నారు. రెండు రోజుల కింద మానవపాడు మండలం పోతులపాడు గ్రామంలో 23 క్వింటాళ్ల బియ్యం బార్డర్ దాటిస్తుండగా పట్టుకొని కేసు పెట్టారు. గద్వాల పట్టణంలో గత నెల 26న పీడీఎస్ రైస్ పట్టుకొని కేసు నమోదు చేశారు. ఇలా కేసులు నమోదవుతున్నా దందా మాత్రం ఆగడం లేదు.
అక్రమాలు జరగకుండా చూస్తాం..
రైస్ మిల్లుల్లో అక్రమాలు జరగకుండా పగడ్బందీ చర్యలు తీసుకుంటాం. సీఎంఆర్ ఇవ్వాలని మిల్లర్లపై ఒత్తిడి తెస్తాం. విజిలెన్స్ ఆఫీసర్లు మిల్లులపై దాడులు చేస్తున్నారు. అక్రమాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటాం.స్వామి కుమార్, డీఎస్ వో, గద్వాల