
కల్వకుర్తి, వెలుగు: వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలింత చనిపోయిందని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం రాంపూర్ గ్రామానికి చెందిన శ్యామల(23) మంగళవారం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ అయింది. ఆమెకు బ్లీడింగ్ కావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలిస్తుండగా, మార్గమధ్యలో చనిపోయింది. దీంతో ఆగ్రహించిన కుటుంబసభ్యులు డెడ్ బాడీని కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చి, ఆసుపత్రి ఎదురుగా ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. బాలింత మృతికి కారకులైన వారిని శిక్షించాలని, కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
వెల్దండ సీఐ విష్ణువర్ధన్ రెడ్డి, కల్వకుర్తి, వంగూరు, వెల్దండ, చారకొండ, ఊరుకొండ ఎస్సైలు మాధవరెడ్డి, మహేందర్, కురుమూర్తి, శంషోద్దీన్, కృష్ణదేవ సిబ్బందితో వచ్చి బందోబస్తు నిర్వహించారు. రాస్తారోకో చేస్తున్న వారితో సీఐ మాట్లాడినా ఫలితం లేకుండాపోయింది. ఎమ్మెల్యే నారాయణరెడ్డి బాధితుల వద్దకి మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్ ను పంపించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని, కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇప్పించడంతో ఆందోళన విరమించారు.
అంతకుముందు మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ మార్చురీలో శ్యామల డెడ్‌బాడీని సందర్శించారు. కొందరు వైద్యులు సొంతంగా ఆసుపత్రులు నడుపుకుంటూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులను పట్టించుకోవడంలేదని ఆయన మండిపడ్డారు. వైద్యుల నిర్లక్ష్యంపై మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే నారాయణరెడ్డికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు.