ఓటీపీ ప్లీజ్‌!.. స్వచ్ఛ ర్యాంకుల టార్గెట్ల కోసం అడ్డదారులు

  • ప్రజలకు ఫోన్లు చేసి ఓటీపీ అడుగుతున్న సిబ్బంది 
  • ఫీల్ట్ ‌‌ సర్వే చేయకుండానే రిపోర్ట్ రెడీ చేస్తున్నరు

సూర్యాపేట, వెలుగు:  స్వచ్ఛ సర్వేక్షణ్ ‌‌–2023 ర్యాంకుల కోసం మున్సిపల్ అధికారులు, సిబ్బంది అడ్డదారులు తొక్కుతున్నారు.  ఫీల్డ్ ‌‌కు వెళ్లకుండానే ఆఫీసులో కూర్చొని సర్వే పూర్తి చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వాస్తవానికి మున్సిపాలిటీల పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి వివిధ అంశాలపై ప్రజల అభిప్రాయాలుసేకరించి యాప్ ‌‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.  ఆ తర్వాత వారి మొబైల్ నెంబర్ ‌‌ ‌‌కు ఓటీపీ వెళ్తుంది. దాన్ని నమోదు చేస్తే ఒకరి అభిప్రాయం కంప్లీట్ అయినట్లు లెక్క.  కానీ, సిబ్బంది అవేమీ చేయకుండా తెలిసిన వారి ద్వారా మొబైల్ ‌‌ నెంబర్లు సేకరించి, ఫోన్లు చేసి ఓటీపీలు అడుగుతున్నారు. 

ఏడు అంశాలపై సర్వే

కేంద్రం ఎప్పటిలాగే ఈ సారి కూడా స్వచ్ఛ సర్వేక్షణ్ ‌‌–-2023 అవార్డుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసి ఆగస్టు 15 వరకు గడువు ఇచ్చింది. ఈ లోగా అధికారులు, సిబ్బంది మున్సిపాలిటీల్లో రోడ్లు, కమ్యూనిటీ టాయిలెట్లు,  చెత్త సేకరణ, డ్రైనేజీ, శానిటేషన్ ‌‌ తదితర 7 అంశాలపై సర్వే చేసి  ‘స్వచ్ఛ సర్వేక్షణ్ ‌‌--’ యాప్ ‌‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.  పట్టణంలో పరిశుభ్రతపై ప్రజలు ఇచ్చే రేటింగ్ ‌‌ కూడా రికార్డు చేయాలి. అనంతరం వీటిని పరిగణలోకి తీసుకొని కేంద్ర బృందాలు పర్యటించి అవార్డులకు ఎంపిక చేస్తాయి. 

మెప్మా రిసోర్స్ ‌‌ పర్సన్లకు పని

వాస్తవానికి స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే మున్సిపల్ అధికారులు, సిబ్బంది చేయాల్సి ఉంటుంది.  కానీ, సూర్యాపేట జిల్లాలోని  మున్సిపాలిటీల్లో చాలావరకు ఈ పనిని మెప్మా రిసోర్స్ ‌‌ పర్సన్లకు అప్పజెప్పారు. అంతేకాదు ప్రతిరోజూ 50 మంది అభిప్రాయాలు తీసుకోవాలని టార్గెట్ ‌‌ పెట్టారు.  దీంతో వాళ్లు ఫీల్డ్ ‌‌కు వెళ్తున్నా టార్గెట్ ‌‌ పూర్తి కావట్లేదు.  చేసేది లేక ప్రజల మొబైన్ ‌‌ నెంబర్లు సేకరించి ఓటీపీలు అడుగుతున్నారు. అయితే కొందరు ఓటీపీ చెబుతున్నా.. మరికొందరు వెనకాడుతున్నారు.  గత్యంతరం లేక యాప్ ‌‌లో తెలిసిన వారి  ఫోన్ ‌‌ నెంబర్ ‌‌ను ఎంటర్ ‌‌ చేస్తున్నట్లు తెలిసింది.  కోదాడ మున్సిపాలిటీలో కొంతమంది ప్రైవేట్ వ్యక్తులను నియమించి ఒక్కో ఓ ‌‌టీపీకి రూ.3 చొప్పున ఇస్తూ సర్వే చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 

సర్వే కొనసాగుతోంది

మున్సిపాలిటీ లో స్వచ్ఛ సర్వేక్షణ్‌ సర్వే నిర్ణీత విధానంలో కొనసాగుతోంది. మున్సిపల్ సిబ్బంది వార్డుల్లో ఇల్లిల్లూ తిరుగుతూ ప్రజల నుంచి పారిశుద్ధ్య నిర్వహణపై అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఆ సమాచారాన్ని మాత్రమే నమోదు చేస్తున్నారు.   - మహేశ్వర రెడ్డి, మున్సిపల్ కమిషనర్, కోదాడ