- జెండా ఆవిష్కరణ, వేడుకలు
- అర్హులందరికీ సంక్షేమ పథకాలు ఇస్తామని వెల్లడి
నెట్వర్క్, వెలుగు: గణతంత్ర దినోత్సవాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రాలు, పట్టణాలు, మండలాల్లోని కూడళ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, పార్టీ ఆఫీసులు తదితర ప్రాంతాల్లో మువ్వన్నెల జెండాను ఎగురవేశారు. ఆదిలాబాద్జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్లో కలెక్టర్ రాజర్షి షా జెండా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. పేదలకు సంక్షేమ ఫలాలు అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు గ్యారంటీ పథకాలతో ప్రజలకు చేరువైందని, తాజాగా మరో నాలుగు పథకాలను ప్రారంభించినట్లు తెలిపారు. గ్రామ, వార్డు సభల్లో 77,442 దరఖాస్తులు వచ్చాయన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందిస్తామన్నారు.
జిల్లాలో ఇప్పటి వరకు 62016 మంది రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశామన్నారు. నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు కేటాయించారని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు. ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులకు అవార్డులు అందజేశారు. వేడుకల్లో ఎంపీ గొడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, అడిషనల్ కలెక్టర్ శ్యామలా దేవి, ఎస్పీ గౌస్ ఆలం, డీసీసీబీ చైర్మెన్ అడ్డిబోజారెడ్డి తదితరులు ఉన్నారు.
పథకాలు పేదలకు వరం
అందరి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. మొదట కలెక్టరేట్ లో జెండాను ఆవిష్కరించిన కలెక్టర్ అనంతరం ఎన్టీఆర్ మిని స్టేడియంలో పోలీసు బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఉత్తమ ఉద్యోగులకు ఆమె ప్రశంసా పత్రాలు అందజేశారు. అనంతరం సభలో మాట్లాడుతూ జిల్లాలో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భ రోసా, రైతు భరోసా కార్యక్రమాలు పేదలకు వరం కాబోతున్నాయన్నారు.
జిల్లాలో 27,417 మం ది భూమిలేని నిరుపేదల ను ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద గుర్తించినట్లు తెలిపారు. 72,500 మంది రైతు కుటుంబాలకు రైతు భరోసా, ఇల్లు లేని పేదలందరికీ మొదటి విడతలో 3500 ఇండ్లను నిర్మించి ఇవ్వనున్నట్లు తెలిపారు. గృహ జ్యోతి పథకం కింద 1,27,56 మంది కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. పేద బడి పిల్లల కోసం జిల్లాలో బాలశక్తి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఇతర సంక్షేమ పథకాలను వివరించారు.
సింగరేణిలో అలరించిన సెలబ్రేషన్స్
మంచిర్యాల, అసిఫాబాద్ జిల్లాలో విస్తరించిన బొగ్గు గనుల ప్రాంతాల్లో 76వ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అలరించాయి. బెల్లంపల్లి రీజియన్పరిధి మందమర్రిలోని సింగరేణి హైస్కూల్ గ్రౌండ్, శ్రీరాంపూర్లోని ప్రగతిస్టేడియం, బెల్లంపల్లి గోలేటీ భీమన్న స్టేడియం, జైపూర్ థర్మల్ పవర్ప్లాంట్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లో సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో వేర్వేరుగా జరిగిన వేడుకల్లో జీఎంలు పాల్గొని జెండాలు ఆవిష్కరించారు. సింగరేణి సంస్థ ఉత్పత్తి చేసిన బొగ్గు వివరాలు వెల్లడించారు. 2024-25 వార్షిక ఉత్పత్తి లక్ష్యం 72 మిలియన్ టన్నులకు గాను జనవరి 24 నాటికి 58.30 మిలియన్టన్నులు సాధించి 92 శాతం ఉత్పత్తితో సాగుతోందన్నారు. ఉత్తమ ఉద్యోగులు, వారి కుటుంబాలను ఘనంగా సన్మానించారు. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందజేశారు.
నాలుగు పథకాలతో నవోదయం
రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నిండుతాయని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ బాయ్స్ హైస్కూల్లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో కలెక్టర్పాల్గొని జెండా ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ‘ప్రజా సంక్షేమం కోసం కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రామసభలు, వార్డుసభలు నిర్వహించి పారదర్శకంగా అర్హుల జాబితా రూపొందించాం.
జాబితాలో రాని వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తాం. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమల్లో మన జిల్లా ముందంజలో ఉంది. మహాలక్ష్మి పథకం ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 1.31 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకున్నారు. జిల్లాలో 1.13 లక్షల మందికి రూ.500కే సబ్సిడీ సిలిండర్ అందిస్తున్నాం. 64,493 మంది రైతులకు రూ.543 కోట్ల రుణం మాఫీ చేశాం’ అని పేర్కొన్నారు. అడిషనల్ కలెక్టర్ మోతీలాల్, డీసీపీ భాస్కర్, డీఎఫ్వో శివ్ ఆశిశ్ సింగ్, అధికారులు, ప్రజాప్రతినిధులు తదిరులు పాల్గొన్నారు.
అర్హులందరికీ వెల్ఫేర్ స్కీంలు
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన పేదలందరికీ అందిస్తామని ఆసిఫాబాద్కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని ఏఆర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన 76వ గణతంత్ర దినోత్సవంలో పాల్గొని జాతీయ పథకాన్ని అవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. కొత్తగా ప్రభుత్వం అమలు చేయనున్న పథకాలను వివరించారు. అర్హుల ఎంపిక ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. ‘రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కృషిచేస్తోంది.
రైతుల కోసం తొలి ఏడాది రైతు రుణమాఫీ, రైతు నేస్తం, వరి పంటకు బోనస్, అయిల్ ఫాం పంటల విస్తరణకు ప్రోత్సాహకాలు వంటి అనేక కార్యక్రమాలను అమలు చేశాం. ప్రతి ఎకరానికి రూ.12 వేల రైతు భరోసా అందిస్తాం. జిల్లాలో 51,523 మంది రైతులకు రూ.485.84 కోట్లు రుణమాఫీ చేశాం. జిల్లాలో 7 వేల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేశాం. గతేడాది 215 మంది రైతు కుటుంబాలకు రూ.10.75 కోట్ల రైతు బీమా అందించాం’ అని తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ డీవీ శ్రీనివాస రావు, అడిషనల్ కలెక్టర్లు దీపక్ తివారీ, డేవిడ్, శ్రద్ధా శుక్లా, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఏఎస్సీ చిత్తరంజన్, అడిషనల్ ఎస్పీ ప్రభాకర్రావు పాల్గొన్నారు.