పాసివ్​ ​ఫండ్లకే ఓటు.. ఇండెక్స్​ ఫండ్ల ద్వారా భారీగా పెట్టుబడులు

పాసివ్​ ​ఫండ్లకే ఓటు.. ఇండెక్స్​ ఫండ్ల ద్వారా భారీగా పెట్టుబడులు

హైదరాబాద్​, వెలుగు: భారతీయ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమలో పాసివ్​ ఇన్వెస్ట్​మెంట్లకు మొగ్గుచూపే వారి సంఖ్య పెరుగుతున్నది.  అమెరికాలో పాసివ్​ ఇన్వెస్ట్​మెంట్ల కోసం ఎక్స్ఛేంజ్ -ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) ఉంటాయి. భారతీయ ఇన్వెస్టర్లు మాత్రం ఈటీఎఫ్​ల​ కంటే ఇండెక్స్ ఫండ్ల ద్వారానే పెట్టుబడి పెట్టడాన్ని ఇష్టపడుతున్నారు. యాక్టివ్​స్టాక్​ సెలెక్షన్​కు బదులు మార్కెట్ ​ఇండెసెస్​పనితీరు ఆధారంగా మదుపు​ చేయడాన్ని పాసివ్​ ఇన్వెస్టింగ్​ అంటారు. మోతీలాల్ ఓస్వాల్ అసెట్ మేనేజ్‌‌‌‌మెంట్ కంపెనీ (ఎంఓఏఎంసీ) చేసిన సర్వే ప్రకారం... రెస్పాండెంట్లలో 87 శాతం మంది ఇండెక్స్ ఫండ్స్ (పాసివ్) ద్వారా పెట్టుబడి పెట్టగా, 42 శాతం మంది ఈటీఎఫ్​ ద్వారా పెట్టుబడి పెట్టినట్టు వెల్లడించారు. 

ఎంఓఏఎంసీ ఈ ఏడాది ఫిబ్రవరి–-మే మధ్య ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో సర్వే నిర్వహించింది. దీనిలో రెండువేల ఫండ్ హౌస్‌‌‌‌లకు చెందిన పెట్టుబడిదారులు పాల్గొన్నారు.  వీరిలో56 శాతం మంది 18–-35 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు కాగా, 54 శాతం మంది మెట్రో నగరాల్లో నివసిస్తున్నారు. 61 శాతం మంది రెస్పాండెంట్లు తమ వార్షిక ఆదాయం రూ. 10 లక్షల కంటే తక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. దాదాపు 61 శాతం మంది రెస్పాండెంట్లు తాము కనీసం ఒక పాసివ్ ఫండ్‌‌‌‌లో పెట్టుబడి పెట్టామని చెప్పారు. 

ఇవీ కారణాలు..

తక్కువ ధర, సింప్లిసిటీ,  మార్కెట్ రాబడి బాగుండటం వల్ల వీటిని ఎంచుకుంటున్నామని పేర్కొన్నారు. రెస్పాండెంట్లలో  సగానికి పైగా (53 శాతం) మంది గత 12 నెలల్లో పాసివ్​ఫండ్లకు తమ కేటాయింపులను పెంచినట్లు చెప్పారు.  ఈటీఎఫ్  యూనిట్లలో లావాదేవీలు చేస్తున్నప్పుడు, పెట్టుబడిదారులకు తక్కువ లిక్విడిటీ, ఎక్కువ ఖర్చు వంటి సమస్యలు వస్తున్నాయి. ఇండెక్స్ ఫండ్‌‌‌‌లలో ఈ సమస్యలు ఉండవు. సిస్టమాటిక్​ ఇన్వెస్ట్​మెంట్​ప్లాన్స్​(సిప్​) విధానంలో పాసివ్​ఫండ్స్​ను కొనుక్కోవచ్చు. ఈ ఏడాది మార్చిలో  నెలవారీ సిప్​ ఇన్‌‌‌‌ఫ్లోలు మొదటిసారిగా రూ. 14,000 కోట్ల మార్కును అధిగమించాయి. 

వరుసగా 19 నెలల పాటు రూ. 10 వేల కోట్ల మార్కును అధిగమించాయి. ఇదే ఏడాది జూన్​లో ఇన్‌‌‌‌ఫ్లోలలో సిప్​ల వాటా రూ. 14,734 కోట్లుగా ఉంది. ప్రతి నలుగురిలో ముగ్గురు సిప్‌‌‌‌ల ద్వారా పెట్టుబడి పెట్టేందుకు ఇష్టపడుతున్నారు. రెస్పాడెంట్లలో 80 శాతం కంటే ఎక్కువ మంది తమ పెట్టుబడులను మూడేళ్ల కంటే ఎక్కువ కాలం ఉంచుకోవాలని కోరుకుంటున్నారని ఎంఓఏఎంసీ పాసివ్ ఫండ్స్ హెడ్ ప్రతీక్ ఓస్వాల్ చెప్పారు.