జీహెచ్ఎంసీలో రిటైర్డ్ అధికారులకే కొలువులు

జీహెచ్ఎంసీలో రిటైర్డ్ అధికారులకే కొలువులు
  • ఓఎస్డీల పేరుతో ఏళ్లుగా కొనసాగింపు

గ్రేటర్ హైదరాబాద్  మున్సిపల్  కార్పొరేషన్ లోకి  ఒక్కసారి వచ్చారంటే చాలు రిటైర్  అయినా కుర్చీ  వదలరు. కొందరు  సర్వీసులు  పొడిగించుకుంటే....మరికొందరు  పైరవీలతో  ఓఎస్డీల పేరుతో తిష్ట  వేస్తున్నారు. ఇతర   ప్రభుత్వ శాఖల నుంచి  డిప్యూటేషన్ పై  బల్దియాలోకి  వచ్చిన అధికారులు... ఇక్కడి  నుంచి వెళ్లేందుకు  ఇష్టపడటం లేదు. తమ పేరెంట్  డిపార్ట్ మెంట్ కు వెళ్లినా నెల తిరక్కుండానే కార్పోరేషన్ లోకి  వచ్చేందుకు పైరవీలు ప్రారంబించారు.  
జీహెచ్ఎంసీలో కార్మికులు, ఉద్యోగులు కలిపి 18 విభాగాల్లో 33వేల మంది పనిచేస్తుంటారు.   కమిషనర్, అడిషనల్ కమిషనర్లు, జోనల్, డిప్యూటీ కమిషనర్లు, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, స్పోర్ట్స్, మలేరియా, శానిటేషన్, అర్బన్ బయోడైవర్సిటీ, ట్రాన్స్ పోర్టు, EVDM లాంటి విభాగాల్లో పెద్ద సంఖ్యలో వీళ్ళంతా పనిచేస్తుంటారు. ఇందులో చాలా మంది ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి GHMCకి డిప్యూటేషన్ పై వస్తారు. సాధారణంగా మూడేళ్ళ తర్వాత వాళ్ళు తమ పేరెంట్ డిపార్టు మెంట్ కి వెళ్లిపోవాలి. ఇంకా వాళ్ల సేవలు అవసరమని భావిస్తే... మరో రెండేళ్లు ప్రభుత్వం నిబంధనల ప్రకారం పొడిగిస్తారు. కానీ బల్దియాకి వచ్చిన వాళ్ళెవరూ వదలడం లేదు. రిటైర్ అయ్యాక కూడా ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ పేరుతో ఓఎస్డీలుగా కొనసాగుతున్నారు.  దాంతో అప్పటి వరకు తమకు ప్రమోషన్ వస్తుందని భావించిన ఎంప్లాయీస్ కి నిరాశే ఎదురవుతోంది. 
ఐదేళ్లు పూర్తయిన తరువాత పేరెంట్ డిపార్టుమెంట్ కి  వెళ్లిన కొందరు... తిరిగి మళ్ళీ జీహెచ్ఎంసీలోనే పనిచేస్తామంటూ అర్జీలు పెట్టుకుంటున్నారు. తమకు పరిచయం ఉన్న అధికారులు, రాజకీయ నేతల రికమండేషన్లతో మళ్ళీ పోస్టింగ్స్ తెచ్చుకుంటున్నారు. జీహెచ్ఎంసీ ఎస్టేట్ విభాగం నుంచి పేరెంట్ డిపార్ట్మెంట్ కు వెళ్లిన ఓ అధికారి... నెల తిరక్కముందే మళ్లీ బల్దియాకు వచ్చేందుకు పైరవీలు ప్రారంభించారు. డిప్యూటేషన్  పూర్తయ్యాక మాతృ సంస్థలో తప్పనిసరిగా 6 నెలలు పనిచేయాలన్న ప్రభుత్వ నిబంధన ఉంది. అవేమీ పట్టించుకోకుండా మళ్ళీ పైరవీలు చేసుకుంటూ... పాత స్థానాల్లో జాయిన్ అవుతున్నారు. రూల్స్ కి విరుద్ధమని జీహెచ్ఎంసీ అడ్మిన్ విభాగం అధికారులకు తెలిసినా.... కమిషనర్ దృష్టికి తీసుకెళ్లకుండా ఫైల్స్ రన్ చేస్తున్నారు. 
నిబంధనలకు విరుద్ధంగా బల్దియాలో పోస్టింగ్ లు తెచ్చుకుంటున్న అధికారుల్లో చాలామందిపై  అవినీతి, లైంగిక వేధింపుల ఆరోపణలున్నాయి. బల్దియా ఆరోగ్య విభాగంలో డిప్యూటేషన్ పై వచ్చిన ఓ అధికారి..  మహిళ కంప్యూటర్ ఆపరేటర్ పై  లిప్టులో అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంది. ఆ అధికారి సెలవు రోజుల్లో కూడా వచ్చి పనిచేయాలని వేధిస్తున్నాడని అంటున్నారు కార్మిక సంఘం నాయకులు.  
జీహెచ్ఎంసీ లో వచ్చిన వారు బయటకు వెళ్లడం లేదు...వెళ్లిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఇక్కడికే వస్తున్నారు. రిటైర్డ్ అయ్యాక కూడా  ఓఎస్డీలుగా బల్దియాకి వస్తుండటంతో... నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకుండా పోతున్నాయి. ఉద్యోగుల ప్రమోషన్లు ఆగిపోతున్నాయి.  ఇప్పటికైనా ప్రభుత్వం... నిబంధనలకు విరుద్ధంగా జీహెచ్ఎంసీలో పని చేస్తున్న అధికారులను సొంత శాఖలకు పంపించాలని కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.