యాదాద్రి జిల్లాలో విశ్వకర్మ తో ఆర్థికంగా బలోపేతం : హనుమంతు జెండగే

యాదాద్రి జిల్లాలో  విశ్వకర్మ తో ఆర్థికంగా బలోపేతం : హనుమంతు జెండగే

యాదాద్రి, వెలుగు : కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విశ్వకర్మ పథకం ద్వారా చేతి, కుల వృత్తిదారులు ఆర్థికంగా బలోపేతం కావాలని యాదాద్రి కలెక్టర్​హనుమంతు జెండగే సూచించారు. కలెక్టరేట్​లో విశ్వకర్మ పథకం అమలుపై రివ్యూ మీటింగ్ జరిగింది. ఈ సందర్శంగా ఇప్పటివరకు 7,627 అప్లికేషన్లు వచ్చాయని ఆఫీసర్లు చెప్పారు. వీటిలో 3,771 అప్లికేషన్లను జిల్లా, మరో 3,771 అప్లికేషన్లను రాష్ట్ర స్థాయికి పంపించినట్టు ఆఫీసర్లు వివరించారు. అనంతరం కలెక్టర్​మాట్లాడుతూ అర్హులైనవారికి విశ్వకర్మ పథకం ద్వారా లబ్ధిచేకూర్చాలని, అప్లికేషన్​చేసుకునే విధానంపై గ్రామ, పట్టణ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

18 రకాల చేతి,  కుల వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారిలో సామర్థ్యం మెరుగుపరిచి ఉత్పత్తులను పెంచడమే ఈ పథకం ఉద్దేశ్యమని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు లేని ప్రతి కుటుంబం నుంచి ఒక్కరికి మాత్రమే అప్లికేషన్​చేసుకునే అవకాశం ఉందని చెప్పారు. శిక్షణ కాలంలో ప్రతి రోజు రూ.500 ఇవ్వడంతోపాటు శిక్షణ అనంతరం రూ.15 వేల విలువైన టూల్​కిట్స్​తోపాటు ధ్రువీకరణ పత్రం ఇస్తామన్నారు. వీరికి రెండు విడతల్లో రూ.3 లక్షల రుణం అందిస్తామని తెలిపారు. సమావేశంలో అడిషనల్​కలెక్టర్​గంగాధర్​, పరిశ్రమల అధికారి రాజేశ్వర్ రెడ్డి, ఎంఎస్​ఎంఈ సహాయ సంచాలకులు సుమతి, లీడ్ బ్యాంక్ అధికారి శివరామకృష్ణ, బీసీ, ఎస్సీ, మత్స్యశాఖ ఆఫీసర్లు పాల్గొన్నారు.