ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

కరీంనగర్ సిటీ, వెలుగు: రామగుండం ఆర్ఎఫ్ సీఎల్ లో ఉద్యోగాల పేరుతో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ రూ. 50 కోట్లు తీసుకొని నిరుద్యోగులను మోసం చేశారని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామచంద్రం ఆరోపించారు. ఆర్ఎఫ్ సీఎల్ లో జరిగిన కాంట్రాక్ట్​ ఉద్యోగ నియామకాల్లో అవినీతిపై సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. బీఎస్పీ ఆధ్వర్యంలో మంగళవారం కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ లో ఎమ్మెల్యే చందర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఇల్లు ముట్టడించడానికి ర్యాలీగా బయలుదేరారు. అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకోగానే బీఎస్పీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఆందోళనకారులు అక్కడినుంచి తప్పించుకుని మంత్రి గంగుల కమలాకర్ క్యాంపు ఆఫీస్​ను ముట్టడించారు. డీఎస్పీ వారిని వారించడంతో అక్కడే కూర్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఎమ్మెల్యే చేతిలో మోసపోయిన బాధితులకు న్యాయం చేయాలన్నారు. కోరుకంటి చందర్ పై 420, 306 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. 790 మంది బాధితుల వద్ద తీసుకున్న డబ్బులను ఎమ్మెల్యే తిరిగి వారికి చెల్లించాలన్నారు. మృతుడు హరీశ్​గౌడ్ భార్యకు శాశ్వత ఉద్యోగం కల్పించాలని, 50 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని డిమాండ్​చేశారు. బీఎస్పీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి కరీంనగర్ డ్యాం వద్ద ఉన్న పోలీస్ ట్రైనింగ్ క్యాంపునకు తరలించారు. 

ప్రతిపక్షాల మాటలకు అభివృద్ధే సమాధానం

కరీంనగర్ టౌన్, వెలుగు: ప్రతిపక్షాలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాయని, వారికి అభివృద్ధితోనే సమాధానం చెబుతామని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం పద్మనగర్– ఒడ్యారం వరకు రూ.5.5కోట్లతో నిర్మించనున్న సెంట్రల్ లైటింగ్ పనులను మేయర్ సునీల్ రావుతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూ.100కోట్లతో కరీంనగర్ నుంచి సిరిసిల్ల వరకు రోడ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. కరీంనగర్ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎక్కువ నిధులు కేటాయిస్తున్నారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ చౌరస్తా నుంచి ఒడ్యారం వరకు రూ.9కోట్ల వ్యయంతో సెంట్రల్ లైట్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రూ.2కోట్లతో మానకొండూర్ చెరువును సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. అనంతరం 76మందికి రూ.30లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.  33వ డివిజన్ లో మేయర్ సునీల్ రావు మట్టివినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‍రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి, సుడా చైర్మన్ రామకృష్ణారావు,కార్పొరేటర్లు శ్రీకాంత్, బండారి వేణు, గుగ్గిళ్ల జయశ్రీ, మాధవి, కమిషనర్ సేవా ఇస్లావత్ తదితరులు పాల్గొన్నారు. 

వార్డుల్లో సమస్యలు పరిష్కరించండి

మెట్ పల్లి, వెలుగు: మెట్ పల్లి పట్టణంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్​కౌన్సిలర్లు డిమాండ్​ చేశారు. మంగళవారం మెట్​పల్లి మున్సిపల్​ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా కౌన్సిలర్లు పట్టణంలో నెలకొన్న వివిధ సమస్యలను ఎమ్మెల్యే విద్యాసాగర్​రావు దృష్టికి తీసుకెళ్లారు. మిషన్ భగీరథ పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయని, చాలా చోట్లా ఇప్పటికీ నల్లాలు ఫిట్ చేయలేదన్నారు. కొత్త కరెంట్ పోల్​లు ఏర్పాటు చేసి కొన్ని ఏరియాల్లో స్ట్రీట్ లైట్లు అమర్చకపోవడంతో ప్రజలు చీకట్లో ఇబ్బందులు పడుతున్నారని కౌన్సిలర్లు వివరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వార్డుల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆఫీసర్లను ఆదేశించారు. పెన్షన్ రానివారికి మంజూరు చేసేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం ఎజెండాలో పొందుపరిచిన 13 అంశాలను కౌన్సిల్ సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. కార్యక్రమంలో చైర్ పర్సన్ రణవేని సుజాత, వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రావు, కమిషనర్ సమ్మయ్య, ఆఫీసర్లు, కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్లు పాల్గొన్నారు.

పాలనలో కేసీఆర్ ఫెయిల్

కరీంనగర్, వెలుగు: పాలనలో అన్ని రంగాల్లో సీఎం కేసీఆర్ ఫెయిలయ్యారని, దీంతో ఆయన ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని బీజేపీ రాష్ట్ర నాయకుడు కటకం మృత్యుంజయం ఫైర్ అయ్యారు. కరీంనగర్ లో మంగళవారం నిర్వహించిన మీడియాతో మాట్లాడుతూ రూ.లక్షల కోట్లు పెట్టి కట్టిన – కాళేశ్వరం ప్రాజెక్ట్ వరదలతో నీటమునిగిందని, మరో నాలుగేండ్లు నీటిని ఎత్తిపోసేందుకు అవకాశం లేదని ఇంజినీర్లు చెబుతున్నారన్నారు. కేసీఆర్​ కుటుంబం లిక్కర్ స్కాంలో కూరుకు పోయిందని ఆరోపించారు. బండి సంజయ్  ఎక్కడ తిరిగితే కేసీఆర్ కు ఎందుకుని.. ఓర్వలేనితనంతో పాదయాత్రలో  ఇబ్బందులు పెడుతున్నారన్నారు. 

టీఆర్ఎస్​కు బండి సంజయ్ భయం పట్టుకుంది 

మానకొండూరు, వెలుగు: కేసీఆర్​సర్కారుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ భయం పట్టుకుందని, దీంతో ఆయనపై పనికిమాలిన వ్యాఖ్యలు చేస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి  ఆరోపించారు. మంగళవారం మానకొండూరు నియోజకవర్గ బీజేపీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ టీఆర్ఎస్​అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు సీఎం కేసీఆర్ కుటుంబానికి బానిసలా మారి బీజేపీ నాయకులపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి ప్రజల్లో వస్తున్న ఆదరణను ఓర్వలేక ఆయనపై ఆరోపణలు చేస్తున్నారని కృష్ణారెడ్డి మండిపడ్డారు. సీఎం కేసీఆర్ కు కరీంనగర్​ జైలులో గది సిద్ధంగా ఉందని చెబితే, టీఆర్ఎస్​కు మద్దతుగా మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఆపార్టీ శ్రేణులు ఆందోళన చేయడం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకులు దరువు ఎల్లన్న, జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్ గౌడ్, వాసుదేవ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటరెడ్డి, వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి భాస్కరాచారి పాల్గొన్నారు.

ఘనంగా గణేశ్ ​చతుర్థి, ఓనం వేడుకలు

కరీంనగర్​ రూరల్, వెలుగు: గణేశ్​చతుర్థి, ఓనం వేడుకలను మంగళవారం కరీంనగర్​ రూరల్​ మండలం బొమ్మకల్​లోని బిర్లా ఓపెన్ మైండ్స్​ఇంటర్నేషనల్ స్కూల్లో​ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్​కల్చరల్ ప్రోగ్రామ్స్​నిర్వహించారు. టీచర్స్​కేరళ సంప్రదాయ దుస్తులను ధరించి చేసిన నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. కార్యక్రమంలో స్కూల్​డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి, ప్రిన్సిపల్ ​బబిత విశ్వనాథన్ పాల్గొన్నారు.

వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే విమర్శలు

జగిత్యాల, వెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఒకరిపై ఒకరి విమర్శలు చేసుకుంటూ, ప్రజలను మభ్యపెడుతున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు.  జగిత్యాల జిల్లా కేంద్రంలో మంగళవారం ఆయన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. బీజేపీ ముక్త్ భారత్ తో పాటు టీఆర్ఎస్​ ముక్త్ తెలంగాణ కూడా కావాలని, అప్పుడే సామాన్యులకు న్యాయం జరుగుతుందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం బడా వ్యాపారులు, పెట్టుబడిదారులకు 8 ఏండ్లలో రూ.10 లక్షల కోట్లు మాఫీ చేసిందన్నారు. సీఎం కేసీఆర్ ఇక్కడి రైతులకు ఏమీ చేయకుండా, పంజాబ్ రైతు నాయకులతో చర్చిస్తూ తన చేతగానితనాన్ని కప్పుపుచ్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మీటింగ్ లో కాంగ్రెస్ ​నాయకులు  నాగభూషణం, శంకర్, విజయలక్ష్మి పాల్గొన్నారు.

ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చిపోయిండు

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం కేసీఆర్​ ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చి పోయిండని, పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పెద్దపల్లిలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ పర్యటన కోసం రూ.12 కోట్లు ప్రజాధనాన్ని వృథా చేశారని, అయినా బహిరంగ సభ అట్టర్ ప్లాప్ అయిందన్నారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన డీఎంఎఫ్​టీ నిధులు రూ.1000 కోట్లు ఎత్తుకెళ్లి, 20 కోట్లు ప్రకటించారన్నారు. ఆర్ఎఫ్​సీఎల్​ బాధితులకు మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే చందర్ న్యాయం చేయాలని డిమాండ్​ 
చేశారు.

హరీశ్​ కుటుంబానికి అండగా ఉంటాం

హుజూరాబాద్,​ వెలుగు: ఆర్ఎఫ్ సీఎల్ లో ఉద్యోగం కోసం దళారులకు డబ్బు ఇచ్చి మోసపోయి ఆత్మహత్య చేసుకున్న హరీశ్​కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, కోరుకంటి చందర్​తెలిపారు. మంగళవారం వారు వేర్వేరుగా హరీశ్​ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా రసమయి మాట్లాడుతూ హరీశ్​ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని, అతని కుటుంబానికి ప్రభుత్వం నుంచి సాయం అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. చందర్​ మాట్లాడుతూ హరీశ్​ను మోసం చేసిన దళారులపై కఠిన చర్యలు తీసుకోవడానికి కృషి చేస్తానన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో హరీశ్ భార్యకు ఉద్యోగం, కొడుకుల చదువును తానే స్వయంగా చూసుకుంటానని భరోసా ఇచ్చారు. 

పీఏసీఎస్​ను సందర్శించిన నాబార్డ్ టీం

సుల్తానాబాద్, వెలుగు: సుల్తానాబాద్ పీఏసీఎస్​ను మంగళవారం నాబార్డు ఆఫీసర్ల టీం సందర్శించింది. ఈ టీంలో14 రాష్ట్రాలకు చెందిన సహకార శాఖ అధికారులు, నాబార్డు ఉన్నతాధికారులు ఉన్నారు. సొసైటీకి సంబంధించిన గోదాములను, వ్యాపారాలను, రూ. ఒక కోటితో నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంటును పరిశీలించారు. నాబార్డ్ డీజీఎం రవీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వాల సహకారంతోనే సొసైటీ అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో కేడీసీసీబీ జీఎం సత్యనారాయణ, డిప్యూటీ డైరెక్టర్ అనంత్, సొసైటీ చైర్మన్ శ్రీనివాస్, డీసీవో మైకేల్ రాజు, శశిధర్ రావు, సాగర్ రెడ్డి పాల్గొన్నారు.

ఎన్టీపీసీ మేనేజ్​మెంట్​ కార్మికులకు క్షమాపణ చెప్పాలి

జ్యోతినగర్, వెలుగు: రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్ట్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులపై లాఠీచార్జ్​ చేయడాన్ని నిరసిస్తూ, మేనేజ్​మెంట్​క్షమాపణ చెప్పాలని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, బీజేపీ నాయకుడు కౌశిక్ హరి డిమాండ్ చేశారు. మంగళవారం ఎన్టీపీసీ జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో  ప్రాజెక్ట్ 2వ గేట్​వద్ద జరిగిన నిరసనలో వారు పాల్గొని మాట్లాడారు. కార్మికులపై అకారణంగా లాఠీచార్జ్​ చేసిన సీఐఎస్ఎఫ్​ పోలీసులపై కేసు నమోదు చేయాలని, ఎన్టీపీసీ హెచ్ఆర్ అధికారులను సస్పెండ్ చేయాలన్నారు. కాంట్రాక్టు కార్మికులతో మేనేజ్​మెంట్​చేసుకున్న ఒప్పందాలు, వారసత్వ ఉద్యోగాల కల్పన, సమాన పనికి సమాన వేతనం.. హామీలను అమలు చేయాలని  డిమాండ్‌‌‌‌ చేశారు.  కుట్రపూరిత ఆలోచనలతో ఎన్టీపీసీ మేనేజ్​మెంట్​వ్యవహరిస్తే... సంస్థ అభివృద్ధికి ఆటంకంగా మారే ప్రమాదముందని హెచ్చరించారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు చిలుక శంకర్, నాంసాని శంకర్, సాధుల రాంబాబు, గీట్లా లక్షారెడ్డి, యాకయ్య, భూమయ్య, నిమ్మరాజుల రవి పాల్గొన్నారు.

వివేక్​ను కలిసిన గొట్టిముక్కల 

పెద్దపల్లి, వెలుగు: ఇటీవల బీజేపీలో చేరిన పెద్దపల్లి సీనియర్​ లీడర్​ గొట్టిముక్కుల సురేశ్​రెడ్డి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ డాక్టర్​ వివేక్​ వెంకటస్వామిని మంగళవారం హైదరాబాద్​లో మర్యాదపూర్వకంగా కలిశారు. వివేక్​కు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సన్మానించారు.

సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శం

జగిత్యాల, వెలుగు: సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా ఉందని ఎమ్మెల్యే డా. సంజయ్ అన్నారు. మంగళవారం జగిత్యాలలోని వివిధ వార్డులకు చెందిన లబ్ధిదారులకు మంజూరైన కొత్త పింఛన్ ​కార్డులను మున్సిపల్ చైర్ పర్సన్ శ్రావణితో కలిసి అందజేశారు. అనంతరం 19 మంది లబ్ధిదారులకు రూ. 5.50 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్​ చెక్కులు,ఏడుగురికి కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. కార్యక్రమం లో వైస్ చైర్మన్ శ్రీనివాస్, పార్టీ పట్టణ అధ్యక్షులు సతీశ్, డీఈ రాజేశ్వర్, కౌన్సిలర్ నవీన్ కుమార్, పాల్గొన్నారు

మట్టి విగ్రహాలనే పూజిద్దాం

సిరిసిల్ల కలెక్టరేట్, వెలుగు: గణపతి ఉత్సవాల సందర్భంగా మట్టి విగ్రహాలనే పూజించాలని ఎస్పీ రాహుల్​హెగ్డే ప్రజలకు సూచించారు. మంగళవారం మానేరు స్వచ్చంద సంస్థ ఆర్గనైజర్ చింతోజు భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలన్నారు. మండపాల ఏర్పాటుకు ఉత్సవ కమిటీలు పోలీస్​  పర్మిషన్​తీసుకోవాలన్నారు.

విషజ్వరంతో బాలిక మృతి

సుల్తానాబాద్, వెలుగు: సుల్తానాబాద్ పట్టణంలోని చెరువు రోడ్డు కు చెందిన దేశెట్టి కార్తీక(13) అనే బాలిక విషజ్వరంతో మంగళవారం తెల్లవారుజామున చనిపోయింది. కార్తీక కు సోమవారం తీవ్ర జ్వరం రాగా కరీంనగర్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్​కు తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ తెల్లవారుజామున చనిపోయింది. జ్వరంతో పాటు ఫిట్స్ రావడం వల్లే బాలిక చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు.