సన్న బియ్యం ఖాళీ .. రేషన్​షాపులకు క్యూ కడుతున్న లబ్ధిదారులు

సన్న బియ్యం ఖాళీ .. రేషన్​షాపులకు క్యూ కడుతున్న లబ్ధిదారులు
  • నాలుగు రోజుల్లోనే పూర్తి కావస్తున్న కేటాయింపులు
  • హైదరాబాద్​లో ఎలక్షన్​ కోడ్ కారణంగా జిల్లాలో బియ్యం తీసుకుంటున్న కార్డు హోల్డర్లు

మహబూబ్​నగర్, వెలుగు: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పంపిణీ జోరుగా సాగుతోంది. కార్డు హోల్డర్లు క్యూ కడుతుండడంతో రేషన్ షాపులకు వచ్చిన స్టాక్​నాలుగు రోజుల్లోనే పూర్తి కావస్తున్నది. మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాల్లో 70 శాతం సన్న బియ్యం పంపిణీ పూర్తి అయ్యింది. ఈ రెండు జిల్లాల్లో 579 రేషన్​ షాపులు ఉండగా,  మహబూబ్​నగర్​కు 5,229 ​ టన్నులు, నారాయణపేటకు 3,397 టన్నుల సన్న బియ్యంను రాష్ట్ర ప్రభుత్వం అలాట్​చేసింది. 

అయితే, ఇప్పటివరకు మహబూబ్​నగర్​జిల్లాకు 3,229 ​టన్నులు అలాట్​చేశారు. షాపుల్లో ఈ స్టాక్​అయిపోవస్తుండటంతో మరో వెయ్యి మెట్రిక్​ టన్నుల బియ్యాన్ని శనివారం సాయంత్రం అలాట్​చేశారు. మరో వెయ్యి ​ టన్నుల బియ్యాన్ని ఆదివారం సాయంత్రం వరకు ఆయా షాపులకు రానుంది. నారాయణపేట జిల్లాలో కూడా ఇదే పరిస్థితి. ఈ జిల్లాలో ఇప్పటికే రెండు వేల మెట్రిక్​ టన్నుల సన్న బియ్యాన్ని రేషన్​ కార్డు హోల్డర్లకు అందించారు. ఒకటి, రెండు రోజుల్లో మిగిలిన కోటా బియ్యాన్ని కూడా అర్హులకు అందించే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

హైదరాబాద్​ నుంచి వచ్చి తీసుకెళ్తున్నారు

మహబూబ్​నగర్, నారాయణపేట జిల్లాలకు చెందిన చాలా మంది ప్రజలు హైదరాబాద్​లో డైలీ కూలీలుగా, ఆటో డ్రైవర్లుగా, ఇతర రంగాల్లో ఉద్యోగులుగా పనులు చేస్తున్నారు. అక్కడే రేషన్ షాపుల్లో బియ్యాన్ని తీసుకునేటోళ్లు. ప్రస్తుతం హైదరాబాద్​లో ఎమ్మెల్సీ కోడ్​కారణంగా సన్న బియ్యం పంపిణీ జరగడం లేదు. దొడ్డు బియ్యమే షాపుల్లో ఇస్తున్నారు. దీంతో వారంతా రెండు రోజులుగా తిరిగి సొంతూళ్లకు వస్తున్నారు. స్థానిక రేషన్​షాపుల ద్వారా సన్న బియ్యం తీసుకొని తిరిగి వెళ్తున్నారు. 

ఫోన్​లు చేసి పిలిచేటోళ్లు..

గత నెల వరకు రేషన్​షాపుల్లో దొడ్డు బియ్యం తీసుకెళ్లేందుకు కార్డు హోల్డర్లు పెద్దగా ఆసక్తి చూపేటోళ్లు కాదు. అవసరం ఉన్న కొందరు మాత్రమే రెగ్యులర్​గా తీసుకెళ్లేటోళ్లు. ఈ స్టాక్ ​అయిపోకపోవడంతో రేషన్​డీలర్లు నిత్యం లబ్ధిదారులకు ఫోన్​లు చేసేవారు. దాదాపు బియ్యం పంపిణీ కోసం ఒకటో తేదీ నుంచి 15, 16, 17వ తేదీల వరకు షాపులను తెరిచే ఉంచేవారు. ప్రస్తుతం సన్న బియ్యం పంపిణీతో పరిస్థితి మారిపోయింది. దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేయకపోయినా.. విషయం తెలుసుకున్న లబ్ధిదారులు రేషన్ షాపుల క్యూకట్టి బియ్యాన్ని 
తీసుకెళ్తున్నారు. 

ఇండెంట్​ పెట్టుకుంటే బియ్యం ఇస్తాం

సన్న బియ్యం మూవ్​మెంట్​ఎక్కువగా జరుగుతోంది. బియ్యం తీసుకోవడానికి కార్డు హోల్డర్లు రేషన్ షాపులకు ఎక్కువగా వస్తున్నారు. షాపుల్లో సన్న బియ్యం స్టాక్​ అయిపోతే రేషన్​డీలర్లు పోర్టబులిటి రేజ్​చేయాలి. సన్న బియ్యం కోసం ఇండెంట్ పెట్టుకుంటే మళ్లీ ఇస్తాం. మహబూబ్​నగర్​జిల్లాలో ఆరు నెలలకు సరిపడా సన్న బియ్యం స్టాక్​ ఉంది. కార్డు హోల్డర్లు సన్న బియ్యం అయిపోయిందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతి కార్డు హోల్డర్​కు సన్న బియ్యం పంపిణీ చేస్తాం.- తోట వెంకటేశ్, డీఎస్​వో, మహబూబ్​నగర్​