సీఎంఆర్ కేటాయింపుల్లో అవకతవకలు

సీఎంఆర్ కేటాయింపుల్లో అవకతవకలు
  • నాలుగు రైస్ మిల్లులకే పెద్దపీట వేశారని ఆరోపణలు
  • చిన్న రైస్ మిల్లులకు కేటాయింపుల్లో వివక్ష
  • డబ్బులిచ్చిన వాటికే ఎక్కువ కేటాయింపులు 

గద్వాల, వెలుగు: రైస్ మిల్లులకు సీఎంఆర్ కేటాయింపులో భారీగా అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని రైస్ మిల్లర్లు ఆరోపిస్తున్నారు. పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చిన వారికి సీఎంఆర్ కేటాయిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో 31 రైస్ మిల్లులకు స్థాయిని బట్టి వడ్లు కేటాయించాల్సిన ఆఫీసర్లు కేవలం నాలుగు రైస్ మిల్లులకు మాత్రమే పెద్ద సంఖ్యలో కేటాయించి చిన్న రైస్ మిల్లులకు వడ్లు ఇవ్వకుండా వివక్ష చూపిస్తున్నారని పలువురు రైస్ మిల్లర్లు వాపోతున్నారు. 31 రైస్ మిల్లులలో 15 రైస్ మిల్లులకు ఇప్పటివరకు ఒక్క క్వింటాల్ వడ్లు కూడా కేటాయించలేదని చెబుతున్నారు. జిల్లాలోని ఓ ఆఫీసర్ సివిల్ సప్లై శాఖను తన గుప్పెట్లో పెట్టుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

31 రైస్ మిల్లులు అర్హత

జోగులాంబ గద్వాల జిల్లాలో మొత్తం 64  రైస్ మిల్లులు ఉన్నాయి. గత గవర్నమెంట్ హయాంలో ఇష్టానుసారంగా వడ్లు కేటాయించడంతో కొన్ని రైస్ మిల్లులు తిరిగి గవర్నమెంట్ కు బియ్యం తిరిగి ఇవ్వలేవు. దీంతో  కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక సీఎంఆర్ కేటాయింపునకు పకడ్బందీ చర్యలు తీసుకుంది.  దీంతో 64 రైస్ మిల్లులలో కేవలం 31 రైస్ మిల్లులు మాత్రమే సీఎంఆర్ కేటాయింపునకు అర్హత సాధించాయి. ఈ 31 రైస్ మిల్లుల్లో  మూడు బాయిల్డ్ రైస్ మిల్లులు కాగా మిగతా28 రా రైస్ మిల్లులు. వీటి కేటాయింపుల్లో కూడా  అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నాలుగు రైస్ మిల్లులకే సింహభాగం

అర్హత సాధించిన 31 రైస్ మిల్లుల్లో జగదాంబ, వినాయక, విశాలాక్షి, మణికంఠ రైస్ మిల్లులకే సింహభాగం వడ్లు కేటాయించారని పలువురు రైస్ మిల్లర్లు ఆరోపిస్తున్నారు. ఈ నాలుగు రైస్ మిల్లులకు ఒక్కొక్క రైస్ మిల్లు కు 40 వేల నుంచి 50 వేల బస్తాలు కేటాయించారని, మిగతా రైస్ మిల్లులకు ఐదు నుంచి పదివేల బస్తాలు కూడా కేటాయించలేదు. 

అగ్రిమెంట్ కాకముందే వడ్లు కేటాయింపు

డిఫాల్ట్ అయిన రైస్ మిల్లులకు అగ్రిమెంట్ కాకముందే ఈ వానాకాలం సీజన్ లో వడ్లు దింపారని రైస్ మిల్లర్లు చెబుతున్నారు. ఎర్రవెల్లి సమీపంలోని వెంకటేశ్వర రైస్ మిల్లుకు అగ్రిమెంట్ కాకముందే వడ్లు దింపారని తెలుస్తోంది.  అన్ని అగ్రిమెంట్లు ఉన్నప్పటికీ కొన్ని రైస్ మిల్లులకు వడ్లు కేటాయించకుండా కావాలని వివక్ష చూపిస్తున్నారన్నారు.

ఇప్పటికీ 29,441 క్వింటాళ్ల కొనుగోలు

జోగులాంబ గద్వాల జిల్లాలో వానాకాలం సీజన్ లో ఇప్పటివరకు 29,441 క్వింటాలను కొనుగోలు చేశారు. రెండు లక్షల క్వింటాళ్ల వడ్లు దిగుబడి వస్తుందని అంచనా వేసిన అందులో ఇప్పటివరకు 30 శాతం వడ్లు కూడా కొనుగోలు చేయలేకపోయారు. 

అందరికీ సమానంగా  వడ్ల కేటాయింపు

రైస్ మిల్లులకు వడ్ల కేటాయింపులో ఎలాంటి వివక్ష చూపించడం లేదు. అగ్రిమెంట్ ప్రకారం వడ్లు కేటాయిస్తున్నాం. సివిల్ సప్లై రూల్స్ ప్రకారం ముందుకు సాగుతున్నాం. వడ్లు అందని రైస్ మిల్లులకు త్వరలోనే కేటాయిస్తాం.- స్వామి కుమార్, డీఎస్ఓ, గద్వాల.