
- దాడులు, హత్యలతో తరచూ అలజడి
- ఆకతాయిలకు అడ్డాగా మారిన రింగ్ రోడ్డు పరిసరాలు
- స్టేషన్ల మధ్య బార్డర్ సమస్యలతో పెట్రోలింగ్ ప్రాబ్లం
- పర్యవేక్షణ లేక దాడులు పెరుగుతున్నాయనే ఆరోపణలు
హనుమకొండ, వెలుగు: కమిషనరేట్ లో కీలకమైన గ్రేటర్ వరంగల్ శివారు ప్రాంతాలు క్రైమ్కార్నర్లుగా మారుతున్నాయి. పోలీసుల నిఘా లేకపోవడంతో దాడులు, దౌర్జన్యాలు, మర్డర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నాయి. నగరంలోని భట్టుపల్లి శివారులో ఇటీవల డాక్టర్ సుమంత్‌రెడ్డిపై జరిగిన దాడి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపగా, పోలీసుల నిఘా లోపం వల్లే సిటీ ఔట్స్కర్ట్స్నేరాలు పెరిగిపోతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా పోలీస్ స్టేషన్ల మధ్య బార్డర్ సమస్యలు ఇబ్బందులు తెచ్చిపెతుండగా, తమ పరిధి కాదని పోలీసులు పెట్రోలింగ్కూడా నిర్వహించకపోవడం వల్లే నేరగాళ్లు ఇలాంటి స్పాట్లను దారుణాలకు ఎంచుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సిటీ శివారులపై నిఘా లేకనే..!
కమిషనరేట్ పరిధిలో హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాలు ఉండగా మొత్తంగా 53 పోలీస్ స్టేషన్లున్నాయి. స్టేషన్ల పరిధి ఎక్కువగా ఉండటం, సిబ్బంది సరిపడా లేకపోవడం వల్ల నిఘా లోపాలున్నాయనే ఆరోపణలున్నాయి. దీంతోనే క్రైమ్ రేట్పెరుగుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కమిషనరేట్ పరిధిలో గతేడాది మొత్తంగా 40 మర్డర్లు, 107 అటెంప్ట్ మర్డర్లు, ఘర్షణలు 1,600కుపైగా జరగగా, గత రెండు నెలల్లో మూడు హత్యలు, ఐదు హత్యాయత్నాలు, దాదాపు 150 వరకు ఘర్షణలు చోటుచేసుకోవడం గమనార్హం.
గ్రేటర్ వరంగల్ శివారులో కొంతకాలంగా దాడులు, హత్యలు ఎక్కువవుతుండగా, పోలీసుల నిఘా లోపం వల్లే దారుణాలు చోటుచేసుకుంటున్నాయనే విమర్శలు ఉన్నాయి. దాదాపు నాలుగేండ్ల కిందట వరంగల్‌నగర శివారు గొర్రెకుంటలోని తొమ్మిది మందిని హత్య చేసి బావిలో పడేసిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించగా, ఆ ప్రాంతంలో పోలీసుల నిఘా లేకపోవడం వల్లే అంతటి దారుణానికి అవకాశం ఏర్పడిందనే ఆరోపణలొచ్చాయి.
ఏడాది కింద కాజీపేట స్టేషన్ పరిధి రహమత్‌నగర్‌లో విజయ అనే వృద్ధురాలిని గుర్తు తెలియని వ్యక్తులు కొట్టి చంపగా, ఇంతవరకు ఆ కేసులో నిందితులను పోలీసులు గుర్తించలేదు. గతేడాది డిసెంబర్ 2న హనుమకొండ శ్రీనగర్ కాలనీకి చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్ రాజామోహన్ ను హనుమకొండలో జనావాసాల మధ్యనే ఉన్న రెవెన్యూ కాలనీ ప్రగతి నగర్ లో హత్య చేయగా, ఆ సమయంలో పోలీసుల నిఘా వ్యవస్థపై విమర్శలు వచ్చాయి.
నగరంలోని రెవెన్యూ కాలనీ, దర్గా టు భట్టుపల్లి, రంగంపేట, పోచమ్మమైదాన్ టు పైడిపల్లి, ములుగు రోడ్డు నుంచి ఆరెపల్లి మార్గాల్లో తరచూ ఆకతాయిలు, గంజాయి, రౌడీ గ్యాంగులు గొడవలకు పాల్పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు.
బార్డర్ సమస్యలు..
నగరంలోని శివారు ప్రాంతాల్లో నేరాలు పెరగడానికి స్టేషన్ల మధ్య బార్డర్ సమస్యలే ప్రధాన కారణమనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇటీవల డాక్టర్సుమంత్ రెడ్డిపై దాడి జరిగిన ప్రాంతం మడికొండ, మిల్స్‌కాలనీ, సుబేదారి స్టేషన్ల మధ్యలో ఉండగా, ఈ మూడు స్టేషన్లు ఈ ఏరియాను గాలికొదిలేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో తరచూ ఏదో ఒక ఇష్యూ జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి సమయంలో సీపీ అంబర్ కిశోర్ ఝా సిబ్బందితో అక్కడి ప్రాంతాలను విజిట్ చేయగా, ఆఫీసర్లలో కొంత కదలిక వచ్చినట్లు తెలుస్తోంది.
రింగ్ రోడ్డు ప్రాంతంలో కేయూ, హసన్‌పర్తి పీఎస్మధ్య కూడా బార్డర్ ఇష్యూ ఉండగా, అక్కడ కోమటిపల్లి, దేవన్నపేట, చింతగట్టు, ఎర్రగట్టుగుట్ట, కిట్స్ కాలేజీ ప్రాంతాల్లో కూడా సమస్యలు తలెత్తుతున్నాయి. ఇక్కడ నిఘా లోపం వల్లే గతేడాది మార్చి 9న కోమటిపల్లి శివారులో ఓ సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయ్ మర్డర్ జరగగా, ఓ కాలేజీ స్టూడెంట్ పై అత్యాచారం కూడా జరిగింది. స్టేషన్ల మధ్య బార్డర్ సమస్యల వల్ల యాక్సిడెంట్లు జరిగిన సమయంలో కూడా ఇబ్బందులు తలెత్తుతుండటం గమనార్హం. నగర శివారు ప్రాంతాల్లో క్రైమ్పెరిగిపోతుండటం, స్టేషన్ల బార్డర్ల సమస్యలతో ఇబ్బందులు ఎదురవుతుండగా, పోలీసులు ఉన్నతాధికారులు తగిన చొరవ తీసుకుని పెరుగుతున్న నేరాలకు చెక్‌పెట్టాలని నగర వాసులు డిమాండ్ చేస్తున్నారు.
వరంగల్ నగర పరిధిలోని భట్టుపల్లి, అమ్మవారిపేట ఏరియా ఆకతాయిలు, రౌడీ గ్యాంగులకు అడ్డాగా మారాయి. ఈ ఏరియా మూడు స్టేషన్ల పరిధిలో ఉండగా, పోలీసుల నిఘా సరిగా లేకపోవడంతో, ప్రజలు ఈ మార్గంలో రాత్రయ్యిందంటే రాకపోకలకు జంకుతున్నారు. ఫిబ్రవరి 20న ఇద్దరు వ్యక్తులు డా.సుమంత్ రెడ్డిపై దాడి చేయడంతో ఆయన ప్రాణాలు కోల్పోగా, 2024 జూన్‌లో ఇక్కడి ఓ రియల్ఎస్టేట్వెంచర్లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. ఇలా ఇక్కడ తరచూ ఏదో ఒక ఘటన జరుగుతోందని స్థానికులు చెబుతున్నారు.
వరంగల్ నగర శివారులోని ధర్మారానికి చెందిన ఓ ఆటో డ్రైవర్ జనవరి 31 రాత్రి 9 గంటల ప్రాంతంలో తన భార్యాపిల్లలతో కలిసి బిర్యానీ కోసమని జాన్‌పాకకు వెళ్లాడు. బిర్యానీ తీసుకుని వెళ్తుండగా, ధర్మారం వైన్స్ సమీపంలోని మెల్లకుంట చెరువు వద్ద కొంతమంది ఆటో డ్రైవర్ తో గొడవపడ్డారు. తీవ్రంగా దాడి చేశారు. గీసుగొండ పీఎస్ పరిధిలో ఈ ఘటన జరగగా, పోలీసుల నిఘా లేకపోవడం వల్లే ఆకతాయిల ఆగడాలు ఇక్కడ ఎక్కువవుతున్నాయనే ఆరోపణలున్నాయి.