బషీర్ బాగ్, వెలుగు: హైదరాబాద్గోషామహల్ లో నాలా కుంగింది. దారుస్సలామ్ – చాక్నావాడి రోడ్డులో ప్లైవుడ్ దుకాణాల ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. గతంలో ఇదే ప్రాంతంలో నాలా కుంగిపోయింది. ఆ నాలా పనులు కొనసాగుతుండగా.. ఇప్పుడు మరోసారి అది కుంగింది. నాలా పనుల నిమిత్తం క్రషర్ మెటీరియల్ ను తీసుకొచ్చిన లారీ అందులోనే కూరుకుపోయింది. నాలాలో ఆ లారీ ఇరుక్కుపోయినప్పటికీ, డ్రైవర్ ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు.
దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. నాలా కుంగిపోవడంతో డ్రైనేజీ నీరు ఏరులై పారుతోంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే మూడుసార్లు నాలా కుంగిపోయిందని మళ్లీ పునరావృతం కాకుండా దానిని పునరుద్ధరించాలని కోరారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్న అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు పేర్కొన్నారు. ఇలా నాలాలు కుంగడం వల్ల ప్రాణనష్టం జరిగితే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు.